రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం.. 10 ఏళ్లు.. 8 కోట్లు

రైల్వే జాబ్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా ప్రణాళికతో పదేళ్లుగా నడుస్తున్న ఈ స్కామ్​ను ఘజియాబాద్ పోలీసులు ఛేదించారు. శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను వెల్లడించారు. రైల్వే ఉద్యోగాల పేరుతో ముఠా దాదాపు 300 మంది బాధితుల దగ్గర రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు వసూల్ చేసినట్లు తెలిసింది. రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు నమ్మిస్తున్న ముఠా..  యాడ్స్ ఇస్తూ, మెడికల్ టెస్టులు, ట్రైనింగ్ వరకు నిర్వహిస్తూ బాధితులను నమ్మిస్తోంది. రైల్వే లోగోలు, లెటర్ ప్యాడ్ లు వినియోగిస్తూ ఈ దందా కొనసాగించింది. ఇందులో రైల్వే ఎంప్లాయీస్ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

పదేళ్లుగా సాగుతున్నా బయటపడలే

పదేళ్లుగా ఈ దందా సాగుతున్నా ఆ స్కాం బయటపడలేదు. ముందుగా జాబ్ వెకెన్సీస్ ఉన్నాయని న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇవ్వడం, పాంప్లెట్లు పంచడం, ఈమెయిల్స్ చేయడం లాంటివి చేస్తుంటారు. బాధితులకు నమ్మకం కలిగేలా ముందు ఒక ఫామ్ ఇచ్చి, అది ఫిల్ చేయమని చెబుతారు. తర్వాత బ్యాంక్ అకౌంట్​కు కొంతమొత్తం ట్రాన్స్ ఫర్ చేయాలంటారు. తర్వాత మెడికల్ టెస్ట్​కు హాజరు కావాలని ఇండియన్  రైల్వేస్ పేరుతో బాధితులకు లెటర్ పంపిస్తారు. న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్​కు రావాలని సూచిస్తారు. అక్కడే ఉండే ఫేక్ డాక్టర్, బాధితులు వచ్చిన తర్వాత శాంపిళ్లు తీసుకొని టెస్టులు చేసినట్టు నటిస్తాడు. ఒకవేళ టెస్టులో ఫెయిలైనా జాబ్ వచ్చేలా చేస్తామని చెప్పే ఏజెంట్లు, ఆ పేరుతో అదనంగా రూ.లక్ష నుంచి రూ.2లక్షలు వసూల్ చేస్తున్నారు.

ఫేక్ ట్రైనింగ్, మెడికల్ సెంటర్లు

మెడికల్ టెస్టు అయిపోయిన నెల తర్వాత క్యాండిడేట్లకు ట్రైనింగ్ లెటర్ పంపిస్తారు. క్యాండిడేట్లకు ఏమాత్రం అనుమానం రాకుండా రైల్వే స్టేషన్​కు సమీపంలోనే ఓ ఫేక్ ట్రైనింగ్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్కో బ్యాచ్​లో ఐదుగురు చొప్పున శిక్షణనిచ్చేవారు. పక్కా ప్రొఫెషనల్స్​తో మేనేజ్ మెంట్, కార్పొరేట్ సెక్టార్ అంశాలపై, ఇండియన్ రైల్వేస్ హిస్టరీ, ట్రైన్లు, కోచెస్ వంటి వాటిపై క్లాసులు చెప్పేవారు. ఈ ట్రైనింగ్ రెండు నెలలు కొనసాగేది. ఇంతలో వారు ఒప్పందం కుదుర్చుకున్న మేరకు బాధితుల నుంచి డబ్బు తీసుకునేవారు. నిందితుడు తెలివిగా ఒక్కో క్యాండిడేట్ కోసం ఒక్కో సిమ్ కార్డు వాడేవాడు. ట్రైనింగ్ పూర్తయి, డబ్బులు చేతిలో పడిన తర్వాత ఆ సిమ్ లను తీసేసేవాడు. దీంతో బాధితులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చేది. అప్పుడు మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్ ఇచ్చేవారు. ఇలాంటి కంప్లయింట్స్ వివిధ సిటీల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫైల్ కావడంతో ఇదొక పెద్ద రాకెట్ గా పోలీసులు గుర్తించలేకపోయారు.

ఒక్కో జాబ్ కు ఒక్కో రేట్

ఈ ముఠా బాధితుల నుంచి వివిధ జాబ్ ల పేరుతో డబ్బులు గుంజింది. ప్రస్తుతం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కు రూ.20 లక్షలు, టికెట్ కలెక్టర్​కు రూ.15 లక్షలు, గ్రూప్ సీ అండ్ డీ పోస్టులకు రూ.10 లక్షల రేటు ఉంది. ఇందులో 40–50 శాతం ముందే తీసుకునే ముఠా… మిగతా మొత్తం తర్వాత దశల్లో వసూలు చేసేది. బాధితుల్లో ఎక్కువ మంది సౌతిండియాకు చెందిన వారేనని తేలింది. దాదాపు 60 శాతం మంది కర్నాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బాధితులు ఉన్నారని తెలిసింది.

సూత్రధారి హితేశ్​

మహారాష్ట్రలోని నాగపూర్​కు చెందిన హితేష్​ఈ స్కామ్ సూత్రధారి. 2009లో గ్యాంగ్​ను ఏర్పాటు చేసి పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. అతడితో పాటు వికార్, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ స్కామ్ చేసినట్టు వెల్లడించారు. రైల్వేకు సంబంధించిన లోగోలు, లెటర్ ప్యాడ్​లు అచ్చుగుద్దినట్లు తయారు చేశారని వివరించారు. మెడికల్ టెస్టులు, ట్రైనింగ్ లెటర్లు సహా ఎన్వలప్ ల వరకు రైల్వేకు సంబంధించిన వాటిలాగే ఉన్నాయని చెప్పారు.

Latest Updates