ఇది నా డ్రీమ్​.. తీన్మార్ రాధతో ఇంటర్వ్యూ

interview-with-teenmar-radha-259252-2

‘తీన్మార్‌‌ రాధ’

‘రాధ’.. తీన్మార్‌‌ల నా పేరు. అట్ల పిలిస్తేనే పలుకుత. అట్లనే పిలువుండ్రి.

మస్త్‌‌ వండుత.. నాన్‌‌వెజ్‌‌ కాదు!

ఫస్ట్‌‌ ఎపిసోడ్‌‌లనే నాన్‌‌వెజ్‌‌ తినిపిస్తేనే మాట్లాడుతా అన్నడు కదా సత్తి. నేను మస్తు వంట వండుత కానీ, చికెన్‌‌, మటన్‌‌ అంటే రాదు. సత్తిని దార్లకి తెచ్చే టెక్నిక్‌‌లు నా దగ్గరున్నయిలే కానీ, ఇప్పటికైతే, ‘రేపు.. రేపు.. రేపు తెస్తలే..’ అని మనకి తెలిసిన లెక్కలు ఉన్నయిగా!

టిక్‌‌ టాక్‌‌లకు వస్తే  పద్మతోటి ఫైటే…

తీన్మార్‌‌ ‘పద్మ’ టిక్‌‌టాక్‌‌ చేస్కుంట నాతోటి పంచాయితీ పెట్టుకుంది మీరు చూసుంటరు. ఏం నేను టిక్‌‌టాక్‌‌లకు రాలేననా? నేనొస్తే పద్మతోటి టిక్‌‌టాక్‌‌ల ఫైటే ఇగ.

అచ్చమైన పల్లె తెలంగాణ మాటకు కొంచెం హైదరాబాద్‌‌ టచ్‌‌ ఇచ్చి తీన్మార్‌‌లకు ఎంట్రీ ఇచ్చిన రాధను తీన్మార్ లో చూస్తున్నరు కదా? సావిత్రి పోయి, ఇప్పుడు సావిత్రి ప్లేస్‌‌ల రాధ వచ్చింది. తీన్మార్‌‌ల వార్తలు చదువుడు ఎట్ల ఉన్నదో
రాధ మనతోటి చెప్పేటందుకు వచ్చేసింది.

రాములమ్మ, లచ్చక్క, సావిత్రి,
ఇప్పుడు రాధ.. తీన్మార్‌‌ క్యారెక్టర్‌‌
అంటే తర్వాత్తర్వాత అది ఒక బ్రాండ్‌‌ అయితది కదా, రాధ గురించి చెప్పు.. ఎట్ల ఉంటది ఇది?

ఈ పేర్లు, ఆ క్యారెక్టర్లు అట్ల బ్రాండ్‌‌ అయినయంటే ఊరికే అయినయా.. టీమ్​ సపోర్ట్​ లేకుంటే ఆ పేర్లు బ్రాండ్​ అయ్యేటివే కావు. తీన్మార్‌‌ ఆడిషన్‌‌ల మూడు రోజులు టెస్ట్‌‌ షూట్‌‌లు పెట్టిన్రు.   గెటప్‌‌ చెక్‌‌ చేసుకున్నరు. జనాలకు ఇష్టమైన ప్రోగ్రామ్‌‌ ఇది. ఇందుల వచ్చే ప్రతీ ఒక్కలినీ వాళ్లు ఓన్‌‌ చేసుకుంటరు. అంతకుముందు సావిత్రి అయినా, ఇప్పుడు రాధ అయినా అంతే. కాబట్టి ఒక్క మిస్టేక్‌‌ రావొద్దు. అందుకని దీని వెనకాతలే ఎంతో మంది కష్టపడుతుంటరు. దాన్నంతా అందుకొని స్క్రీన్‌‌ ముందర రాధ కనిపిస్తది కాబట్టి రాధ పర్ఫెక్ట్‌‌ అనిపిస్తది. తీన్మార్‌‌ సత్తితో గొడవ…

ఫస్ట్‌‌ ఎపిసోడ్‌‌ల సత్తితోటి నాకు గొడవ అయితది చూసిండ్రు కదా! ఆ ఎపిసోడ్‌‌ చూసి మావోళ్లు, ‘ఆ సత్తి ఏంది నిన్ను అట్ల అంటున్నడు’ అని నిజంగనే ఇన్వాల్వ్‌‌ అయిపోయిన్రు. తీన్మార్‌‌ జనాల మనసుల ఎట్ల ఎల్లిపోయినదో ఈ ఒక్కటి చూసి చెప్పొచ్చు. రాధ, సత్తి నిజంగ గొడవ పడ్డట్టు ఫీలయితరు. అంతలా ఒక టీవీల వచ్చే క్యారెక్టర్‌‌ని మన మనిషి అని ఓన్‌‌ చేసుకోవుడు అదృష్టం. అది రాధ లెక్క కనిపిస్తున్న నాకైనా, ఎవ్వరికైనా.

రాధ గారు, నమస్తే!
ఎట్ల నడుస్తున్నది తీన్మార్‌‌ ముచ్చట?

అబ్బా! గారు అంటున్నరులే. నేను మన తీన్మార్‌‌ రాధని. మీ తీన్మార్‌‌ రాధని. రాధని కలిపేసుకున్నరుగా అప్పుడే. ఇంకేం మల్ల?

సత్తిని నువ్వు ఆటపట్టిచ్చినట్టు.. ఆట పట్టిస్తున్నంలే రాధ.. ఎట్ల ఉన్నది తీన్మార్‌‌?

తీన్మార్‌‌ ఎట్ల ఉన్నదని అడిగితే ఏమని చెప్త? మస్తున్నది. ‘వీ 6’ చానల్ల తీన్మార్‌‌ వస్తున్నదంటే టీవీ దిక్కు చూసుడె. అరె ఎంత మంచిగుంటది ఈ ప్రోగ్రామ్‌‌. ఎంత మంచిగ మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడి న్యూస్‌‌ చెప్తరు. నేను కూడా ఆ ప్లేస్‌‌ల ఉంటే మస్త్‌‌ ఉంటుండె కదా అనుకునేదాన్ని. మెల్లగ తీన్మార్‌‌ వార్తలు చూసుడు రోజూ అలవాటయినంక ‘ఎప్పటికన్న వీ6ల తీన్మార్‌‌ వార్తలు చదవాలె’ అని గట్టిగ ఫిక్స్‌‌ అయిన. ఇయ్యాల్టికి ఆ డ్రీమ్‌‌ నిజమైంది.

పరిచయం చేసుకొనుడె ‘హైదరాబాద్‌‌ పిల్లని’ అని చేసుకున్నవు. ఈ హైదరాబాద్‌‌ పిల్లకు యాంకరింగ్‌‌ అంటే ఎప్పట్నుంచి ఇష్టం?

పుట్టి పెరిగినదంతా ఘట్‌‌కేసర్‌‌లనే! మరి హైదరాబాద్‌‌ పిల్లనేగా. పక్కా హైదరాబాదీ అన్నట్టు. రాధ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌‌ కలిపి కొట్టిందంటే ఎట్లుంటదో చూస్తున్నరు కదా! నేను ఇట్ల మాట్లాడుడు, ఎవరితోనన్న కలిసిపోవుడు చూసి అందరూ అంటుండె, ‘నువ్వు యాంకరింగ్‌‌ చెయ్యొచ్చు కదా’ అని. అదే టైంల తీన్మార్‌‌ స్టార్ట్‌‌ అయింది, నెంబర్‌‌ వన్‌‌ అయింది. ఎక్కడ చూసినా తీన్మార్‌‌ గురించి మాట్లాడుతుండె. అప్పుడనిపించేది, చేస్తే తీన్మార్‌‌కి చెయ్యాలని. కాకపోతే ఫస్టే తీన్మార్‌‌ల కనిపిచ్చుడంటే అయితదా? తీన్మార్‌‌ అంటే ఒక పెద్ద బ్రాండ్‌‌. బీటెక్‌‌ చదువు చదివిన. అది అయిపోంగనే కొన్ని చానల్స్‌‌ల యాంకరింగ్‌‌ చేసిన. ఆ తర్వాత యాక్టింగ్‌‌ కూడా చేసిన.

తీన్మార్‌‌ల పని చెయ్యాలన్న డ్రీమ్‌‌ ఆ టైమ్‌‌ల కూడా నడుస్తనే ఉండేదా?

తీన్మార్‌‌ల కనిపించాలన్న డ్రీమ్‌‌ ఒక పక్క నడుస్తనే ఉండేది. నేనింతకు ముందు ఒక చానల్‌‌ల (పేరు చెప్పను, ఏమనుకోవద్దూ) పని చేస్తుండె. ‘హలో ఏం చేస్తున్నారు? మీ పేరేంటి?’ అని ఇట్ల నాది కాని భాషల మాట్లాడమని కోరుతుండె. నేనెట్ల మాట్లాడుత చెప్పుండ్రి? మనదేమన్న ‘ఏడికెళ్లి ఫోన్‌‌ చేస్తున్నరు? ఏం సంగతి’ ఇట్ల మాట్లాడుడె కదా!

నేను పోయి చెప్పిన. ‘ఇట్ల మాట్లాడటం నా వల్ల అయితలేదు. నాలెక్కనే మాట్లాడుతా. వర్కవుట్‌‌ కాకుంటే అప్పుడు చూద్దం’ అన్న. నా లెక్క మాట్లాడుడు మొదలుపెట్టిన. సక్సెస్‌‌ అయింది.

తీన్మార్‌‌ల ఆ సమస్య లేదు కదా!

అదే కదా! అందుకే ఇది నాకు డ్రీమ్‌‌ ప్రాజెక్ట్‌‌ అన్నట్టు. మన తీన్మార్‌‌ల చూడుండ్రి, ఎంత మంచిగ తెలంగాణ వినిపిస్తమో. అదే ఒరిజినల్‌‌. అట్ల ఉంటేనే జనం మనల్ని యాక్సెప్ట్‌‌ చేస్తరు. వీ6 వచ్చినంకనే అనుకుంట, తెలంగాణ వాల్యూ టోటల్​ దునియాకి తెలుస్తున్నది. దాన్ని నిలబెట్టుడె మన పని. తీన్మార్‌‌ దీనికి బ్రాండ్‌‌ అయితే, అందులో ఫిట్‌‌ అయి రాధ పని రాధ చేస్తూ పోవాలి. అంతే.

తీన్మార్‌‌ టీమ్‌‌ సపోర్ట్‌‌ అన్నరు కదా,  అది ఎట్ల ఉంటది?

ఇందాకట్నించి మనం మాట్లాడుతున్నం కదా, ఒకాయన అందంగా జడ ఏస్తడు, ఇంకొకాయన మేకప్‌‌ ఏస్తడు, ఒకాయన కాస్ట్యూమ్‌‌ ఇస్తడు. ఇట్ల అందరూ పనిచేస్తేనే రాధకు ఈ లుక్‌‌ వచ్చింది. షూట్‌‌ మొదలయితున్నదంటే రోజూ ఉండే పనే ఇది. నేనేం మాట్లాడాలన్నది రైటర్‌‌ స్క్రిప్ట్‌‌ రాసిస్తరు. అందరి టైమింగ్‌‌ కలిస్తెనె అది తీన్మార్‌‌.

ఫస్ట్‌‌టైమ్‌‌ తీన్మార్‌‌ల కనిపించినప్పుడు ఎట్ల అనిపించింది?

నేనిట్ల తీన్మార్‌‌ల చేస్తున్న అని ఎవ్వరికీ చెప్పలే. అది టెలికాస్ట్‌‌ అవ్వనీ. టెలికాస్ట్‌‌ అయినరోజే అందరినీ చూడనియ్యి అని అనుకున్న. ఆ రోజొచ్చింది. తీన్మార్‌‌ న్యూస్‌‌ల రాధ పేరుతోటి అందరికీ కనిపించిన. ఆ రోజు చూడాలె. నా ఫోన్‌‌ మెసేజ్‌‌ల మోత మోగించిందనుకో. ‘తీన్మార్‌‌ల వచ్చింది నువ్వేనా’, ‘తీన్మార్‌‌ల వచ్చింది నువ్వేనా’ అని ఒకటే గోల. ఇది కదా నేను కలలు కన్నది అని ఆ రోజు అనిపించింది.

వీ6 తీన్మార్‌‌ల ఆఫర్‌‌ రాంగనే ఎట్లనిపించింది? పెద్ద ప్రోగ్రామ్‌‌? ఈ బరువు మోస్తనా, మోయనా, అన్న భయం ఉండేనా?

భయం కాలే. ఇది నా డ్రీమ్‌‌ అని ముందుగాల్నే చెప్పిన కదా. డ్రీమ్‌‌ చేరుకోవుడు బాగుంటది. నేను ఆడిషన్‌‌కి వచ్చిన మూడు రోజులకు ఈ ఆఫర్‌‌ వచ్చింది. గెటప్‌‌, టెస్ట్‌‌ షూట్‌‌ చేసినంక నన్ను చూసుకొని ‘నేనేనా?’ అనుకున్న. అక్కడ్నే సగం సక్సెస్‌‌ అయిన. నాకున్న భయం ఏందంటే, చిన్నప్పటిసంది సీబీఎస్‌‌ఈ స్కూల్ల చదువుకున్న. తెలుగు చదువుడే రాదు. మాట్లాడతానికి ఏం ఇబ్బంది లేదు. మంచిగ మాట్లాడతా. వీ6 తీన్మార్‌‌ టీమ్‌‌ ఈ విషయంల నా వెనుక నిలబడ్డది.

రాధ వచ్చి ఇంకా వారం కూడా కాలేదు. తీన్మార్‌‌ల రాధ ఏం చేస్తది ఫ్యూచర్‌‌ల?

అరె, ఇప్పుడేగా షురువైంది. రాధ ఎవరు, మీ అందరి మనసులు ఎట్ల దోచుకుంటది? చూద్దురు ఆగుండ్రి.

Latest Updates