IPC497  సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోంది: సుప్రీం

తప్పు ఎవరూ చేసినా..తప్పే. అందులో మగ,ఆడ అనే తేడా ఉంటుందా అంటూ జోసెఫ్‌ షైన్‌ అనే ప్రవాస భారతీయుడు  సుప్రీం కోర్టులు వ్యాజ్యం వేశారు. ఒక పురుషుడు ఒక మహిళ ఇష్టపడి సెక్స్ లో పాల్గొంటే.. ఆమె మరొకరి భార్య అనే కారణంతో అతడిని వ్యభిచార నేరం కింద జైలుకెలా పంపుతారు. మహిళను మాత్రం వదిలేస్తారా అంటూ అడిగారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఐపీసీ 497  సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది. ఇది ఏకపక్షంగా ఉందని కూడా తెలిపింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం(ఆగస్టు-2) దీనిపై విచారణ జరిపింది. ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు పురుషుడి చర్య మాత్రమే నేరమని, మహిళ నేరం చేసినట్లు కాదని చెప్పడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రాథమికంగా ఏకీభవించింది. ఐపీసీ 497లో ‘లైంగిక సమానత్వం’ లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో ఐపీసీ 497 మహిళను కేవలం ఒక వస్తువుగా మాత్రమే పరిగణిస్తోందని అభిప్రాయపడింది. వివాహ బంధంలోని పవిత్రత కచ్చితంగా కీలకమైనదే. కానీ… ఈ సెక్షన్‌ ఏకపక్షంగా ఉందని తెలిపింది. ఐపీసీ సెక్షన్‌ 497 ప్రకారం.. భర్త పర్మిషన్ తో ఒక మహిళ వేరే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది తప్పు కాదనడం అర్థరహితం, మహిళల లైంగిక స్వాతంత్య్రం పట్ల నిరంకుశత్వమేనని, మహిళలను ఒక ఉపకరణంగా భావించడమేనని అభిప్రాయపడింది. ఇది లింగ వివక్షకు నిదర్శనమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వివాహేతర సంబంధం అనేది ఏకాభిప్రాయంతో జరిగేదే… కానీ, భర్తతో కాకుండా పరపురుషుడితో సంబంధం పెట్టుకుంటాననే ప్రాథమిక హక్కు మహిళలకు ఉండదన్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా. అదే సమయంలో.. లైంగిక స్వాతంత్య్రం అనేది ఒక సహజమైన హక్కు అనుకుంటే.. అప్పుడు విడాకులు కోరడానికి వివాహేతర సంబంధం అనేది కారణం కాకుండా పోతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates