IPL క్వాలిఫయిర్-2 : ఫైనల్ కోసం కోల్ కత్తా, హైద్రాబాద్ ఫైట్

SRH IPLలో భాగంగా శుక్రవారం (మే-25)న జరిగే క్వాలిఫయర్ టూ మ్యాచ్ కు కోల్ కతా ఈడెన్ గార్డెన్ స్టేడియం రెడీ అయింది. కోల్ కతా నైట్ రైడర్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైట్ కు సిద్దమయ్యాయి. లీగ్ లో రెండు మ్యాచుల్లో చెరో విజయం సాధించాయి రెండు టీంలు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచింది. ఐపీఎల్లో రెండు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో కోల్ కతా గెలిస్తే… రెండింట్లో హైదరాబాద్ విజయం సాధించింది. సో ఎలిమినేటర్-2లో హాట్ ఫేవరేట్ ఎవరన్నది చెప్పడం కష్టమే.

క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో ఓడిన కసితో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. డూప్లెసిస్ దెబ్బతో గెలుపు అంచుల్లో నుంచి అనూహ్యంగా ఓడిపోయింది. అయితే తప్పుల్ని సరిచేసుకుని గెలుపు కోసం నెక్ట్స్ మ్యాచ్ లో సర్వశక్తులూ ఒడ్డుతామని ప్రకటించాడు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. చెన్నైతో మ్యాచ్ లో మరో 20-30 రన్స్ చేసే అవకాశమున్నా… బ్యాట్స్ మెన్ సమిష్టి వైఫల్యంతో 139 రన్స్ కే పరిమితమైంది. గెలుపు కోసం హైదరాబాద్ బౌలర్లు చివరిదాకా ప్రయత్నించినా… డెత్ ఓవర్లలో విలియమ్సన్ తీస్కున్న ఓ నిర్ణయం ఓటమి పాలు చేసింది. ఈసారి ఆ తప్పులు జరగకుండా చూస్తామన్నాడు విలియమ్సన్. శిఖర్ ధవన్ ఫెయిల్యూర్ మైనస్ గా మారింది. ఓపెనర్లు ధవన్-గోస్వామి రాణిస్తే సగం భారం తప్పుతుందని భావిస్తోంది టీం. విలియమ్సన్ బ్యాటింగ్ భారం మోస్తున్నా.. మనీష్ పాండే, యూసఫ్ పఠాన్ రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్ లో భువి, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్ రూపంలో తిరుగులేని స్థితిలో ఉంది హైదరాబాద్.

ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ పై గెలిచిన ఉత్సాహంతో ఉంది కోల్ కతా. సునీల్ నరైన్, ఉతప్ప, నితీష్ రాణా ఫెయిలైనా.. దినేష్ కార్తీక్, షబ్ మన్ గిల్, రస్సెల్ రాణించడంతో అద్భుతమైన విజయం సాధించింది కోల్ కతా. 169 రన్స్ టార్గెట్ ని జాగ్రత్తగా కాపాడుకుంది. తమకు అచ్చొచ్చిన గ్రౌండ్ లో హైదరాబాద్ కు అంత ఈజీ కాదని తేల్చేశాడు చైనా మెన్ కుల్దీప్ యాదవ్. పైగా లీగ్ లో హైదరాబాద్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో 172 రన్స్ టార్గెట్ ని అలవోకగా చేధించిన రికార్డును గుర్తుచేశాడు కుల్దీప్. ఖచ్చితంగా సెకండ్ క్వాలిఫయర్ లో గెలిచి ఫైనల్ చేరతామన్న ధీమాలో ఉంది కోల్ కతా. విచిత్రమేంటంటే.. హోం గ్రౌండ్ లో రెండు టీమ్స్ అపొనెంట్ చేతిలో ఓడాయి. లీగ్ లో రెండు జట్లు తలో విజయం సాధించాయి. అందుకే సెకండ్ క్వాలిఫయర్ లో ఫేవరేట్ ఎవరన్నది అంచనా వేయడం కష్టమే అంటున్నారు క్రికెట్ లవర్స్. ఫైనల్ లాంటి ఫైనల్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా జరగడం మాత్రం గ్యారెంటీ.

Posted in Uncategorized

Latest Updates