టోర్నీ మధ్యలో కెప్టెన్సీ మార్చడమేంటి?

న్యూఢిల్లీ: కోల్‌‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం జట్టు పగ్గాలను దినేశ్ కార్తీక్ నుంచి ఇయాన్ మోర్గాన్‌‌కు బదిలీ చేసింది. ఇలా టోర్నీ సగ భాగం ముగిశాక కెప్టెన్‌‌ను మార్చడంపై కోల్‌‌కతా యాజమ్యాన్యం మీద ఆ టీమ్ మాజీ కెప్టెన్, వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. కార్తీక్ కెప్టెన్సీలో కేకేఆర్ ఆడిన 7 మ్యాచుల్లో నాలుగింట్లో నెగ్గి, మూడింట్లో ఓడింది. కార్తీక్‌‌ తన బ్యాటింగ్‌‌పై మరింత ఫోకస్ చేసేందుకే నాయకత్వ పగ్గాలను మార్చారని చెప్పడం సరికాదని గంభీర్ పేర్కొన్నాడు.

‘క్రికెట్ అనేది బంధాలకు సంబంధించింది కాదు. నిజాయితీగా చెప్పాలంటే అది పెర్ఫామెన్స్ గురించే. మోర్గాన్ చాలా విషయాలను మార్చగలడని నేను భావించడం లేదు. టోర్నీ ఆరంభం నుంచే అతడు కెప్టెన్‌‌గా ఉండి ఉంటే మార్చేవాడేమో. కానీ టోర్నమెంట్ మధ్యలోకి వచ్చాక ఎవ్వరూ పెద్ద మార్పులు తీసుకురాలేరు. కోచ్, కెప్టెన్ మధ్య మంచి అనుబంధం ఉండటం చాలా అవసరం. గత రెండున్నరేళ్ల నుంచి కార్తీక్ టీమ్‌‌ను బాగా నడిపిస్తున్నాడు. సీజన్ మధ్యలో అనూహ్యంగా నాయకత్వాన్ని మార్చడమేంటి? కెప్టెన్‌‌ను మార్చాల్సిన ఘోరమైన స్థితిలో కేకేఆర్ లేదు. ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన మోర్గాన్‌‌కు కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటే టోర్నీ ఆరంభంలోనే ఇస్తే సరిపోయేది. కార్తీక్ మీద ఇంత ఒత్తిడి తీసుకురావడం అవసరమా?’ అని గంభీర్ చెప్పాడు.

Latest Updates