అతడు మా నుంచి మ్యాచ్‌‌‌ను లాగేసుకున్నాడు

దుబాయ్: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో ఆదివారం రసవత్తర పోరు జరిగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌‌ మొదట టై అయ్యింది. సూపర్ ఓవర్‌‌లో పంజాబ్‌‌ను ఢిల్లీ మట్టికరిపించింది. ఢిల్లీ ఆల్‌‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ (21 బంతుల్లో 53 రన్స్) కీలక ఇన్నింగ్స్‌‌తో మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. అతడి ఇన్నింగ్స్‌‌తొ గౌరవప్రదమైన స్కోరు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలర్ల ప్రతిభతో మ్యాచ్‌‌ను టై చేసింది. ఛేజింగ్‌‌లో పంజాబ్‌‌ను విజయ తీరాలకు చేర్చడానికి మయాంక్ అగర్వాల్ (60 బంతుల్లో 89) విఫలయత్నం చేశాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌‌లో మాట్లాడిన మయాంక్.. స్టొయినిస్‌‌పై ప్రశంసలు జల్లులు కురిపించాడు. అతడు తమ నుంచి మ్యాచ్‌‌ను లాగేసుకున్నాడని పేర్కొన్నాడు.

‘స్టొయినిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మా వైపు నుంచి చిన్న తప్పిదం జరిగినా దాన్ని అతడు చాలా బాగా ఉపయోగించుకున్నాడు. అతడికి ఇది మంచి గేమ్. స్టొయినిస్‌‌కు కంగ్రాట్స్. అతడు తన ప్లాన్స్‌‌ను బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. డెత్ ఓవర్లలో ఢిల్లీకి అతడు మంచి మేలు చేకూర్చాడు. మేం కూడా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా యత్నించాం. అయినా ఇది తొలి మ్యాచే కదా. తర్వాతి మ్యాచ్‌‌ల్లో మా జట్టు బౌలర్లు పుంజుకుంటారు’ అని మయాంక్ చెప్పాడు.

Latest Updates