బిగ్‌‌బాస్‌‌ హౌజ్‌‌లో ఉన్నట్లే అనిపిస్తోంది: ధవన్

యూఏఈ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌ పదమూడో సీజన్‌‌ను యూఏఈలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న మెగా టోర్నీ కోసం అన్ని టీమ్స్ సన్నద్ధమవుతున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ప్లేయర్లు కూడా సన్నాహకాల్లో మునిగిపోయారు. అయితే కరోనా భయం కారణంగా పటిష్ట జాగ్రత్త చర్యల నడుమ టోర్నీని నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి సేఫ్టీ కోసం ప్రత్యేకంగా బయో బబుల్‌‌లో ప్లేయర్లను ఉంచుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఆటగాళ్లు ప్రపంచంతో సంబంధం లేకుండా బయో బబుల్‌‌లో ఉండనున్నారు. దీనిపై టీమిండియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శిఖర్ ధవన్ స్పందించాడు. బయో బబుల్‌‌లో ఉండటం బిగ్‌‌బాస్‌‌ హౌజ్‌‌‌లో ఉన్నట్లే అనిపిస్తోందని ధవన్ చెప్పాడు.

‘మానసిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం మంచిదే. బిగ్‌‌బాస్‌‌ హౌజ్‌‌‌లో ఉంటున్నట్లే అనిపిస్తోంది. బయో బబుల్‌‌‌లో ఉండటం అందరికీ కొత్తగా ఉంది. చాలా చాలెంజింగ్‌‌గా ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో మెరుగవ్వడానికి ఇదో మంచి అవకాశమనే చెప్పాలి. నేను ఉల్లాసంగా ఉండటానికి యత్నిస్తున్నా. దీన్ని సానుకూల దృక్పథంతో తీసుకుంటున్నా. ఒక విధంగా చెప్పాలంటే ఓ వ్యక్తి తనతో తాను ఎలా ఉంటాడనే దానిపైనే అంతా ఆధారపడి ఉంది. మీకు మీరు బెస్ట్ ఫ్రెండ్‌‌గా అయినా ఉండొచ్చు లేదా శత్రువుగానైనా ఉండొచ్చు. పాజిటివ్‌‌గా ఉండే పది మంది మిత్రులు మీ చుట్టూ ఉండొచ్చు. కానీ మీకు మీరు మంచి మిత్రుడు కాకపోతే మీకెవరూ సాయం చేయలేరు. నాకు రెస్టారెంట్స్‌‌కు వెళ్లడం ఇష్టం. కానీ ప్రస్తుతం వెళ్లలేని పరిస్థితి. ఈ ఐపీఎల్ చాలా కీలకం కాబోతోంది. ప్లేయర్స్ విఫలమైతే దాన్ని వారెలా తీసుకుంటారో? అదే సహచర ఆటగాళ్లతో, టీమ్‌‌తో హోటల్‌‌లో ఉండాలి. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపించనుంది’ అని ధవన్ చెప్పాడు.

Latest Updates