అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. కోహ్లి మాత్రం జిమ్‌‌లో బిజీ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫిట్టెస్ట్ స్పోర్స్‌‌మెన్‌‌లో ఒకడిగా పేరుంది. ఆరోగ్యం, ఫిట్‌‌నెస్ విషయంలో కోహ్లీని చాలా మంది అథ్లెట్లు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఫిట్‌‌నెస్ మీద కింగ్ కోహ్లీ చూపే శ్రద్ధ క్రీడా ప్రపంచంలో అతడ్ని ఐకాన్‌‌గా మార్చింది. దీన్ని పక్కనబెడితే.. భారత క్రికెట్ టీమ్‌‌లో ఫిట్‌‌నెస్ స్టాండర్డ్స్ విషయంలో మాజీ కెప్టెన్ ధోని చాలా తీవ్రత తీసుకొచ్చాడని సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ షాన్ పొలాక్ చెప్పాడు. ధోని తర్వాత కోహ్లీ టీమ్‌‌లో మరింత ఇంటెన్సిటీని పెంచాడని మెచ్చుకున్నాడు.

‘ధోని కెప్టెన్సీ తీసుకున్నాక టీమిండియాలో ఇంటెన్సిటీని పెంచాడు. కెప్టెన్సీ చేసే సమయంలో అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. కానీ క్రీజులోకి వచ్చాక మాత్రం వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెత్తుతాడు. అతడు తనను తాను సన్నద్ధం చేసుకోవడంతోపాటు టీమ్‌‌ను ఉరకలెత్తించిన తీరు ప్రశంసనీయం. దీన్ని కోహ్లీ కొనసాగిస్తున్నాడు. ఇండియా-సౌతాఫ్రికా సిరీస్‌‌లో నేను కామెంట్రీ చేస్తున్నప్పుడు ఓ విషయాన్ని గమనించా. గేమ్ ముగిశాక అందరూ హోటల్స్‌‌కు వెళ్లిపోయేవారు. నేను జిమ్‌‌కు వెళ్లా. అక్కడ కోహ్లీ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయా. ఆ రోజు ఆట అయిపోయిన తర్వాత, మ్యాచ్‌‌ను గెలిచాక వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ కోహ్లీ మాత్రం జిమ్‌‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ధోని సెట్ చేసిన తీవ్రతను కోహ్లీ మరో స్థాయికి తీసుకెళ్లాడు’ అని పొలాక్ పేర్కొన్నాడు.

Latest Updates