IPL-14:3 వికెట్లతో ఢిల్లీపై రాజస్తాన్ విక్టరీ

IPL-14:3 వికెట్లతో ఢిల్లీపై రాజస్తాన్ విక్టరీ

రాజస్తాన్‌‌ను గెలిపించిన క్రిస్‌‌ 

 తమ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కొద్దిలో విజయాన్ని చేజార్చుకున్న రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ ఈసారి చిన్న లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్‌‌14లో బోణీ కొట్టింది.  బౌలింగ్‌‌లో జైదేవ్‌‌ ఉనాద్కట్‌‌, ముస్తాఫిజుర్‌‌ (2/29).. బ్యాటింగ్‌‌లో మిల్లర్‌‌, మోరిస్‌‌ మెరుపులతో  గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌లో 3 వికెట్ల తేడాతో  ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌ చేసిన ఢిల్లీ 20 ఓ వర్లలో 8 వికెట్లకు 147 రన్స్‌‌ చేసింది. రిషబ్‌‌ పంత్‌‌ (32 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 51) హాఫ్‌‌ సెంచరీతో సత్తా చాటాడు.  అనంతరం రాజస్తాన్‌‌ 19.4 ఓవర్లలో 150/7 స్కోరు చేసి మ్యాచ్‌‌లో గెలిచింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్‌‌ ఖాన్ (3/32), క్రిస్‌‌ వోక్స్‌‌(2/22), రబాడ (2/30) రాణించినా ఫలితం లేకపోయింది. ఉనాద్కట్‌‌కు మ్యాన్ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 
టాప్‌‌ ఫట్టు.. పంత్‌‌ హిట్టు
37/4. రాజస్తాన్‌‌ పేసర్‌‌ జైదేవ్‌‌ ఉనాద్కట్‌‌ బౌలింగ్‌‌ దెబ్బకు ఏడు ఓవర్లకు ఢిల్లీ స్కోరిది. ఈ లెక్కన క్యాపిటల్స్‌‌ 120 చేస్తేనే గొప్పే అనిపించినా.. కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ మెరుపులతో టీమ్‌‌ గౌరవప్రద స్కోరు చేయగలిగింది. బిగ్‌‌ హిట్టర్లతో కూడిన పటిష్ట ఢిల్లీ బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ను  స్టార్టింగ్‌‌లో ఉనాద్కట్‌‌ వణికించాడు.  టాస్‌‌ నెగ్గి బౌలింగ్‌‌ ఎంచుకున్న తమ కెప్టెన్‌‌ నిర్ణయానికి న్యాయం చేశాడు. సీఎస్‌‌కేతో ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో మెరుపు ఫిఫ్టీలతో చెలరేగిన ఓపెనర్లు పృథ్వీ షా (2), శిఖర్‌‌ ధవన్‌‌ (9)తో పాటు అజింక్యా రహానె (8)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌‌ చేర్చి ప్రత్యర్థికి ట్రిపుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు.  సెకండ్‌‌ ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన జైదేవ్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు పేస్‌‌లో మార్పు చేసి షా వికెట్‌‌ తీశాడు. ఆపై, కీపర్‌‌ శాంసన్‌‌ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌‌కు ధవన్​ను ఔట్​ చేశాడు. మరో స్లో బాల్‌‌తో రిటర్న్‌‌ క్యాచ్‌‌తో రహానెను వెనక్కుపంపడంతో పవర్‌‌ప్లేలో ఢిల్లీ 36/3తో నిలిచింది. ఏడో ఓవర్లో ముస్తాఫిజుర్‌‌ తన ఐదో బాల్‌‌కే స్టోయినిస్‌‌ (0)ను డకౌట్‌‌ చేసి ఒకే పరుగిచ్చాడు. ఇలాంటి సిచ్యువేషన్‌‌లో కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ టీమ్‌‌ను ఆదుకున్నాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న పంత్‌‌.. లలిత్‌‌ యాదవ్‌‌ (24 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 20)తో కలిసి ఎదురుదాడికి దిగాడు. తెవాటియా వేసిన 11వ ఓవర్లో నాలుగు ఫోర్లతో 20 రన్స్‌‌ రాబట్టడంతో రాయల్స్‌‌ బౌలర్లు ఒత్తిడిలో పడ్డారు. ఆపై, ముస్తాఫిజుర్‌‌ బౌలింగ్‌‌లో ఇంకో బౌండ్రీతో 30 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగుతున్న టైమ్‌‌లో 13వ ఓవర్లో  టైట్‌‌ సింగిల్‌‌ కోసం ప్రయత్నించిన పంత్‌‌ రనౌటవడంతో ఢిల్లీ  ఇన్నింగ్స్‌‌ మళ్లీ తడబడింది. అప్పటికి స్కోరు 88/5.  స్కోరు వంద దాటిన వెంటనే లలిత్‌‌ కూడా పెవిలియన్‌‌ చేరాడు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. కానీ, చివర్లో టామ్‌‌ కరన్ (21), క్రిస్‌‌ వోక్స్‌‌ (15) ఆడపాదడపా బౌండ్రీలు కొడుతూ విలువైన రన్స్‌‌ అందించారు. వాళ్ల  పోరాటంతో ఢిల్లీ 140 ప్లస్‌‌ స్కోరు చేయగలిగింది. 
గెలిపించిన మిల్లర్‌‌, మోరిస్‌‌
చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ తడబడింది. క్రిస్‌‌ వోక్స్‌‌, అవేశ్‌‌ ఖాన్‌‌కు తోడు కగిసో రబాడ చెలరేగడంతో  రాయల్స్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. మూడో ఓవర్లోనే  ఓపెనర్లు మనన్‌‌ వోహ్రా (9), బట్లర్‌‌ (2)ను ఔట్‌‌ చేసిన వోక్స్‌‌ ఆ టీమ్‌‌కు షాకిచ్చాడు.  వోహ్రా.. రబాడకు క్యాచ్‌‌ ఇవ్వగా.. కీపర్‌‌ పంత్‌‌ పట్టిన సూపర్‌‌ క్యాచ్‌‌కు బట్లర్‌‌ వెనుదిరిగాడు. ఇక, సీజన్‌‌లో ఫస్ట్‌‌ మ్యాచ్‌‌ ఆడుతున్న కగిసో రబాడ..  నాలుగో ఓవర్లో రాయల్స్‌‌ను చావు దెబ్బకొట్టాడు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌‌ సంజు శాంసన్‌‌ (4)ను పెవిలియన్‌‌ చేర్చాడు. సీమ్‌‌ మూమెంట్‌‌లో మార్పు చేస్తూ రబాడ వేసిన బాల్‌‌ను సంజు డ్రైవ్‌‌ చేయబోగా.. ఎడ్జ్‌‌ తీసుకొని స్లిప్‌‌లో ధవన్‌‌ చేతిలో పడింది. 17/3తో కష్టాల్లో పడ్డ ఇన్నింగ్స్‌‌ను డేవిడ్‌‌ మిల్లర్‌‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, అవతలి ఎండ్‌‌లో వికెట్ల పతనం ఆగలేదు.  పవర్‌‌ప్లే తర్వాత మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన అవేశ్‌‌ ఖాన్​ తన వరుస ఓవర్లలో శివం దూబే (2), రియాన్‌‌ పరాగ్‌‌ (2) వికెట్లు తీశాడు. దాంతో, 42 రన్స్‌‌కే ఐదు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌‌ ఎదురీత మొదలు పెట్టింది. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న మిల్లర్‌‌ అనూహ్యంగా జోరు పెంచాడు. అవేశ్‌‌ బౌలింగ్‌‌లో వరుసగా రెండు  ఫోర్లతో గేరు మార్చాడు. ఆల్‌‌రౌండర్‌‌ రాహుల్‌‌ తెవాటియా (19) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయగా.. మిల్లర్‌‌ పవర్‌‌ఫుల్‌‌ షాట్లతో అలరించాడు. స్టోయినిస్‌‌ వేసిన 13వ ఓవర్లో హ్యాట్రిక్‌‌ ఫోర్లు బాది రాయల్స్‌‌ను రేసులోకి తెచ్చాడు.  ఆ వెంటనే తెవాటియా కూడా రెండు బౌండ్రీలు రాబట్టడంతో ఢిల్లీ బౌలర్లపై ప్రెజర్‌‌ పెరిగింది. 14 ఓవర్లకు రాజస్తాన్‌‌ 85/5తో నిలిచింది. ఈ దశలో సెకండ్‌‌ స్పెల్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన రబాడ.. తెవాటియాను ఔట్‌‌ చేశాడు. కానీ, 40 బాల్స్‌‌లో ఫిఫ్టీ దాటిన మిల్లర్‌‌.. అవేశ్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు  సిక్సర్లు కొట్టాడు. ఇంకో సిక్స్‌‌కు ట్రై చేసి ఏడో వికెట్‌‌గా పెవిలియన్‌‌ చేరడంతో మ్యాచ్‌‌ ఢిల్లీ వైపు మొగ్గింది.  చివరి 24 బాల్స్‌‌లో రాయల్స్‌‌కు 43 రన్స్‌‌ అవసరం అవగా ఢిల్లీకే కాస్త మొగ్గు కనిపించింది. 17వ ఓవర్లో భారీ సిక్స్‌‌ కొట్టిన ఉనాద్కట్‌‌ (11 నాటౌట్‌‌) ను రనౌట్‌‌ చేసే ఈజీ చాన్స్‌‌ను పంత్‌‌ మిస్‌‌ చేశాడు. ఉనాద్కట్‌‌తో ప్రమాదం ఏమీ రాకపోయినా.. క్రిస్‌‌ మోరిస్‌‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు.  లాస్ట్‌‌ రెండు ఓవర్లలో 27 రన్స్‌‌ అవసరం కాగా.. రబాడ బౌలింగ్‌‌లో  రెండు, టామ్‌‌ కరన్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదేసి రాజస్తాన్‌‌ను గెలిపించాడు. 
ఢిల్లీ: పృథ్వీ (సి) మిల్లర్‌‌ (బి) ఉనాద్కట్‌‌ 2, ధవన్‌‌ (సి) శాంసన్‌‌ (బి) ఉనాద్కట్‌‌ 9, రహానె (సి అండ్‌‌ బి) ఉనాద్కట్‌‌ 8, పంత్‌‌ (రనౌట్‌‌/పరాగ్‌‌) 51, స్టోయినిస్‌‌ (సి) బట్లర్‌‌ (బి) ముస్తాఫిజుర్‌‌ 0, లలిత్‌‌ (సి) తెవాటియా (బి) మోరిస్‌‌ 24, టామ్‌‌ కరన్‌‌ (బి) ముస్తాఫిజుర్‌‌ 21, మోరిస్‌‌ (నాటౌట్‌‌) 15, అశ్విన్‌‌ (రనౌట్‌‌) 7, రబాడ (నాటౌట్‌‌) 9; ఎక్స్‌‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 147/8; వికెట్ల పతనం: 1–5, 2–16, 3–36, 4–37, 5–88, 6–100, 7–128, 8–136; బౌలింగ్‌‌: సకారియా 4–0–33–0, ఉనాద్కట్‌‌ 4–0–15–3, మోరిస్‌‌ 3–0–27–1, ముస్తాఫిజుర్‌‌ 4–0–29–2, పరాగ్‌‌ 2–0–16–0, తెవాటియా 3–0–27–0.

రాజస్తాన్: బట్లర్‌‌ (సి) పంత్‌‌ (బి) వోక్స్‌‌ 2, వోహ్రా (సి) రబాడ (బి) వోక్స్‌‌ 9, శాంజన్‌‌ (సి) ధవన్‌‌ (బి) రబాడ 4, దూబే (సి) ధవన్‌‌ (బి) అవేశ్‌‌ 2, మిల్లర్‌‌  (సి) లలిత్‌‌ (బి) అవేశ్‌‌ 62, తెవాటియా (సి) లలిత్‌‌ (బి) రబాడ 19, మోరిస్‌‌ (నాటౌట్) 38, ఉనాద్కట్‌‌ (నాటౌట్‌‌) 11;  ఎక్స్‌‌ట్రాలు: 3; మొత్తం: 19.4 ఓవర్లలో 150/7;  వికెట్ల పతనం: 1–13, 2–13, 3–17, 4–36, 5–42, 6–90, 7–104;  బౌలింగ్‌‌: క్రిస్‌‌ వోక్స్‌‌ 4–0–22–2, అవేశ్‌‌ ఖాన్‌‌ 4–0–32–3, రబాడ 4–0–30–2, అశ్విన్‌‌ 3–0–14–0, టామ్‌‌ కరన్‌‌ 3.4–0–35–0, స్టోయినిస్‌‌ 1–0–15–0.