పల్లెల్లోనూ జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ 

  •     రన్స్‌ , వికెట్స్, ఫోర్లు, సిక్స్‌ లపై బెట్టింగ్‌‌
  •     చేతులు మారుతున్నకోట్ల రూపాయలు  
  •    ఈజీ మనీ ఆశతో..చిత్తయిపోతున్న యూత్

హైదరాబాద్‌‌, వెలుగుచెప్పిన టీం గెలిస్తే.. వెయ్యికి పది వేలు. చెప్పిన ప్లేయర్ సిక్స్ కొడితే.. వెయ్యికి రెండు వేలు. బెట్ కట్టిన టీం స్కోరును120 లోపే కట్టడి చేస్తే.. వెయ్యికి మూడు వేలు. బాల్ బాల్ కూ పందెం.. ఓవర్ ఓవర్ కూ బెట్.. ఐపీఎల్ నేపథ్యంలో పల్లెల్లో బెట్టింగ్ జరుగుతున్న తీరు ఇది. గతంలో పట్టణాల్లో మాత్రమే బెట్టింగ్ లు బాగా జరిగేవి. ఇప్పుడు ఈ కల్చర్ పల్లెలకూ పాకిపోయింది. ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌లలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రోజూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈజీగా పైసలొస్తయని ఆశపడుతున్న యూత్.. బెట్టింగ్ కడుతూ చిత్తయిపోతున్నారు. కొందరు అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెడుతూ పందేలు కాస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోనే కాకుండా ఏపీ సరిహద్దు జిల్లాల్లోనూ బెట్టింగులు జరుగుతున్నాయి.

ఆన్ లైన్, ఆఫ్​లైన్ లో బెట్టింగ్ లు

బుకీలు ఆన్‌‌లైన్‌‌లో, ఆఫ్‌‌లైన్‌‌లోనూ బెట్టింగ్‌‌ లు నిర్వహిస్తున్నారు. ఊర్లలో కొంతమంది సీక్రెట్ గా గ్రూపులుగా ఏర్పడి పందేలు కాస్తున్నారు. కొంత మంది గ్రామ శివార్లలోని ఫాంహౌస్‌‌లు, హోటళ్లలో నడిపిస్తున్నారు. కొందరు తమ తమ సర్కిళ్లలో ఫోన్ల ద్వారా కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌‌, టెలిగ్రామ్‌‌ వంటి వాటిలో సీక్రెట్‌‌ గ్రూపులు పెట్టి కూడా నడిపిస్తున్నారు. గ్రామాల్లో యువకులు ఒకచోట గుమిగూడి ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌లు కడుతున్నారు. మరికొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్‌‌లైన్‌‌లో బెట్టింగ్‌‌ కాస్తున్నారు.

పందేలు ఇలా..

ఒక ప్లేయర్ బాల్‌‌కు ఎన్ని పరుగులు కొడతాడు? ఓవర్‌‌లో ఎన్ని ఫోర్లు కొడతాడు? సిక్సర్ కొడతాడా? ఫోర్ కొడతాడా లేక ఈ బాల్‌‌కు ఔట్ అవుతాడా? అంటూ పందేలు కాస్తున్నారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నదే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారు, ఏ బాట్స్‌‌మెన్‌‌ ఎన్ని పరుగులు చేస్తాడన్న దానిపైనా బెట్ లు కడుతున్నారు. టాస్ పడినప్పటి నుంచి బాల్ బాల్‌‌కు పందెం కాస్తున్నారు. ఎవరు టాప్ స్కోరర్‌‌? ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు?  ఫోర్లు ఎన్ని చేస్తారు? సిక్స్‌‌లు ఎన్ని కొడతారు? ఇలా రకరకాలుగా బెట్టింగ్‌‌‌‌లు కాస్తున్నారు. ఆ జట్టు గెలిస్తే వెయ్యి.. ఓడితే రెండింతలు.. ఈ బాల్ సిక్స్‌‌ పోతే ఇంత.. ఫోర్‌‌ పోతే అంత.. వికెట్‌‌ పడితే ఇంత అంటూ పందేలు జరుగుతున్నాయి.

100 నుంచి 10 వేల దాకా..

బెట్టింగ్‌‌ రాయుళ్లు ప్రధాన టీంలకు ఒక రేటు, మామూలు జట్లకు మరో రేటు ఫిక్స్‌‌ చేస్తారు. వందకు వెయ్యి, వెయ్యికి పదివేలు, పదివేలకు లక్ష చొప్పున పందెం వేస్తున్నారు. వంద నుంచి రూ. 10 వేల వరకూ బెట్టింగ్‌‌లు జరుగుతున్నాయి. మ్యాచ్‌‌ పరిస్థితులను బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ పందేలు కాయడానికీ వెనకాడటంలేదు.

అప్పులిచ్చి మరీ ఆడిస్తున్రు.. 

ఐపీఎల్‌‌ స్టార్టవడంతో బెట్టింగ్ ముఠాలు అమాయకులను ఉసిగొల్పుతున్నాయి. పేద, మధ్య తరగతి వాళ్లకు ఈజీ మనీ ఆశ చూపి బెట్టింగ్‌‌లోకి దింపుతున్నాయి. కొందరు అప్పులు చేసి మరీ బెట్టింగ్ కడుతున్నారు. మరికొందరు ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీ నోట్‌‌ పై సంతకం లేదా బైక్స్‌‌, మొబైల్స్‌‌ను పెట్టుకుని రూ.10 మిత్తితో బెట్టింగ్‌‌ నిర్వాహకులే డబ్బులను ఇస్తున్నారు. డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్‌‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Latest Updates