ఐపీఎల్‌‌ ఫైనల్లో పర్యావరణంపై అవేర్ నెస్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ఫైనల్‌‌ వేదికగా వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌పై కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగే మెగా ఫైనల్‌‌ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరు ఫ్రాంచైజీలకు చెందిన అభిమాన సంఘాలు ‘హైదరాబాద్‌‌ డిక్లరేషన్‌‌’ పేరుతో రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశానికి రూపకల్పన చేశారు. ఇంటర్నేషనల్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌(ఐఐడబ్ల్యూఎం) ఆధ్వర్యంలో ‘గ్రీన్‌‌ వికెట్‌‌’ పేరుతో  ప్లాస్టిక్‌‌ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని గురించి ఈ మ్యాచ్‌‌ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం మ్యాచ్‌‌ ముగిసిన తర్వాత ప్రేక్షకుల సహకారంతో స్టాండ్స్‌‌లో చెత్తను సేకరించనున్నారు.

‘ప్రతి మ్యాచ్‌‌ ముగిశాక 4 నుంచి 4.5 టన్నుల చెత్త స్టాండ్స్‌‌ల్లో మిగిలిపోతోంది. ఇందులో పేపర్‌‌, ప్లాస్టిక్‌‌ కప్పులు, ఇతర ప్లాస్టిక్‌‌ ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. ఇందులో 40 శాతానికిపైగా ఒక్కసారి వినియోగించినవే. ఇది పర్యావరణానికి ఎంతో ప్రమాదకరం. చాలా ఏళ్లపాటు భూగర్భంలో కరిగిపోకుండా అలాగే మిగిలిపోతాయి’ అని ఐఐడబ్ల్యూఎం  సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గతంలో  2012 బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గ్రీన్‌‌ వికెట్‌‌ పేరుతో వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కార్యక్రమాలు చేపట్టింది. ఫైనల్‌‌ ద్వారా హైదరాబాద్‌‌లోనూ విస్తరించనుంది. రాబోయే రోజుల్లో ఫుట్‌‌బాల్‌‌, బ్యాడ్మింటన్‌‌, కబడ్డీ తదితర క్రీడలు జరిగే స్టేడియాల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.