ఇందిరాగాంధీనే అరెస్ట్‌ చేసిన ఆఫీసర్​

దేశంలోని అరుదైన పోలీస్‌ ఆఫీసర్లలో వీఆర్​ లక్ష్మీనారాయణన్​(విఆర్‌ఎల్‌) ఒకరు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీని అరెస్ట్‌ చేసిన వ్యక్తిగా అప్పట్లో ఆయనో సంచలనం. 91 ఏళ్ల వయసులో ఆదివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ విఆర్‌ కృష్ణయ్యర్‌ ఆయన  సోదరుడు. డ్యూటీకి కట్టుబడి ఉండే నికార్సైన వ్యక్తి విఆర్‌ఎల్‌. పోలీస్‌ అంటే ఎలా ఉండాలో చూపించారు.

విఆర్​ లక్ష్మీనారాయణన్ పనితీరు, కమిట్‌మెంట్​ని ప్రభుత్వం గుర్తించింది. ఇందిరాగాంధీ మెచ్చిన ఆఫీసర్లలో ఆయన ఒకరు. ఆమె నుంచి రెండు సార్లు గోల్డ్‌ మెడల్స్  తీసుకున్నారు.  సీబీఐ జేడీ​గా ఉన్న వీఆర్​ఎల్​ని ఎమర్జెన్సీ తర్వాత డైరెక్టర్​ చేయాలని ఆమె అనుకున్నారు. కానీ.. తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఎమర్జెన్సీ ముగిశాక మొరార్జీ దేశాయ్​ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అవినీతి కేసులో ఇందిరాగాంధీని అరెస్ట్​ చేయాలని సర్కారు ఆదేశించటంతో వీఆర్​ఎల్ ఆమె ఇంటికి వెళ్లారు.​ ఆ సమయంలో ఆయన ఎంతో నిబ్బరం ప్రదర్శించారు. ఇందిరాగాంధీని సరెండర్‌ అయ్యేలా ఒప్పించాల్సిందిగా రాజీవ్‌గాంధీని కోరారు. ‘మీ అమ్మగారిని సరెండర్​ అవ్వమని చెప్పండి. ఆవిడ ఈ దేశ మాజీ ప్రధాని, నెహ్రూ  కూతురు, అంత  గౌరవప్రదమైన  మహిళను పోలీసు చేతులు తాకడానికి వీల్లేదు. కాబట్టి మీరే చెప్పండి’ అని​​ ఆయన రాజీవ్​గాంధీతో అన్నారు.

రాజీవ్‌ వెళ్లి మాట్లాడిన కాసేపటికి ఇందిరా బయటకు వచ్చారు. విఆర్‌ఎల్‌ను చూస్తూ  ‘బేడీలెక్కడ’ అన్నారు. ఆయన బదులిస్తూ ‘మేడం.. మీ ప్రభుత్వంలో అంకిత భావంతో, గొప్పగా  పని చేశాను. నా సేవలను మెచ్చుకుంటూ మీ చేతుల మీదుగా రెండు మెడల్స్​ ఇచ్చారు. అప్పటి నుంచే నేను లేజీగా తయారయ్యాను. బేడీలు తేవడం మర్చిపోయాను.. అంటూ వినయంగానే చమత్కరించారు. ఎదుటివారు ఎంత పెద్దవారైనా ఇన్వెస్టిగేషన్​ విషయంలో రాజీపడేవారు కాదు.  తన అనుభవాలను ఆయన అపాయింట్‌మెంట్స్‌ అండ్‌ డిస్‌అపాయింట్‌మెంట్స్‌ పుస్తకంలో రాశారు. ​​1951లో​ ఐపీఎస్​కి సెలెక్ట్​ అయిన వీఆర్ఎల్​ మధురై ఏఎస్పీగా కెరీర్​ ప్రారంభించారు.   నెహ్రూ, ఇందిరాగాంధీ, చరణ్​సింగ్​, మొరార్జీ దేశాయ్​ గవర్నమెంట్లలో ఎన్నో సందర్భాల్లో టాలెంట్​ నిరూపించుకున్నారు.

సీబీఐ జేడీగా ఉంటూ డైరెక్టర్​గా ప్రమోషన్​పై వెళ్లాల్సిన వీఆర్ఎల్​​ని తమిళనాడు సీఎం ఎంజీఆర్​​  కోరి మరీ రాష్ట్ర డీజీపీగా రప్పించారు. ఎప్పుడో రిటైర్‌ అయినప్పటికీ తమిళనాడు పోలీసులకు విఆర్‌ఎల్‌ అంటే అపార గౌరవం. ఓసారి ఎక్కడికో వెళ్తూ చెన్నై ఎయిర్​పోర్ట్​కి వచ్చిన వీఆర్​ఎల్​ను చూసి ఒక పోలీసు​ అంత దూరం నుంచి పరుగున వచ్చి సెల్యూట్​ చేశారు. ఆయన లగేజీని కారులో నుంచి దించి ఫ్లైట్​ ఎక్కే వరకు వెంట ఉన్నారు. ఒక మాజీ పోలీసు ఆఫీసర్‌కు అంత గౌరవం చాలా అరుదు. 1981–84లో తమిళనాడు పోలీస్​ హౌజింగ్​ కార్పొరేషన్​ ఎండీగా ఉన్న వీఆర్​ఎల్​.. సిబ్బందికి క్వార్టర్స్​ కట్టించారు. అందుకే, ‘ఆ మాజీ డీజీపీ​ గారే లేకపోతే ఇవాళ మాకు గూడు ఉండేది కాదు’ అని తమిళనాడు పోలీసులు గుర్తుచేసుకుంటారు.

 

Latest Updates