అమెరికాతో డీల్ కుదరలేదు: ట్రంప్ వాదనను కొట్టి పారేసిన ఇరాన్

అమెరికాతో డీల్ కుదరలేదు: ట్రంప్ వాదనను కొట్టి పారేసిన ఇరాన్

ఇరాన్ తో డీల్ కుదిరింది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టి పారేసింది. అమెరికాతో ఎలాంటి డీల్ కుదరలేదని స్పష్టం చేసింది. డీల్ కుదరాలంటే తమ డిమాండ్లు ప్రతి ఒక్కటీ అంగీకరించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

నెలల తరబడి కొనసాగుతున్న ఘర్షణలకు బ్రేక్ పడుతోందని.. ఇరాన్‌తో 'గ్రేట్ డీల్' కుదురుతుందని  ట్రంప్ చేసిన వాదనను టెహ్రాన్ తోసిపుచ్చింది . ఇంకా ఏ ఒప్పందమూ ఖరారు కాలేదని, తమ 'రెడ్ లైన్స్' విషయంలో రాజీ పడటం కుదరదని హెచ్చరించింది.

అమెరికాతో చర్చలలో కొంత మేరకు పురోగతి సాధించినప్పటికీ, ఒప్పందాలపై ఇంకా సమీక్షిస్తున్నామని  ఇరాన్ అధికారులు తెలిపారు. ఇకా ఫైనల్ అప్రూవల్ రాలేదని విదేశాంగ ప్రతినిధి ఇస్తాయిల్ బక్వాయీ పేర్కొన్నారు. 

ఇరాన్ తో డీల్ కుదురుతుందని.. యూరప్ లో డీల్ కు సంబంధించి సంతకాలు చేసుకుంటామని ట్రంప్ చేసిన కామెంట్స్ ను ఆయన తోసిపుచ్చారు. ఇప్పటి వరకు ఇరాన్ ఎలాంటి అగ్రీమెంట్ కు రాలేదని తెలిపారు. 

డీల్ కుదిరిందని ట్రంప్ చెప్పడం ఇది కొత్తేమీ కాదని.. గత రెండు నెలలలో ఇప్పటికి 38 సార్లు ప్రకటించారని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్ అధికారికంగా ప్రకటిచే వరకు అది ట్రంప్ ఊహాగానాలుగానే పరిగణించాలని తెలిపింది.

ఇరు దేశాల మధ్య డీల్ కుదరాలంటే తమ అన్ని డిమాండ్లను ఒప్పుకోవాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది. యురేనియం నిల్వలను వదులుకోమని ఈ సందర్భంగా చెప్పింది. అదే విధంగా 24 బిలియన్ డాలర్ల ఫ్రోజెన్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒత్తిడికి తలొగ్గి డీల్స్ కు ఒప్పుకుంటామంటే.. ఏడాది కిందటే అది జరిగేదని విదేశాంగ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు హార్మూజ్ జలసంధి నిర్బంధంలోనే ఉంటుందని పునరుద్ఘాటించారు. 

చర్చల్లో భాగంగా ఇప్పటికే అంగీకారం కుదిరినప్పటికీ, చర్చలు జరుగుతున్న క్రమంలో అమెరికా తన వైఖరులను పదేపదే మార్చుకుందని బఘాయీ తెలిపారు. దీంతో మళ్లీ మొదటికి వస్తున్నట్లు తెలిపారు.