రిలయన్స్‌‌ హెల్త్‌‌ పాలసీలపై బ్యాన్‌‌

  • ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడమే కారణం

ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నందున, అనిల్‌‌ అంబానీకి చెందిన రిలయన్స్‌‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌ (ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌) హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీలు అమ్మకుండా ఇన్సూరెన్స్‌‌ రెగ్యులేటరీ అండ్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌ అథారిటీ (ఐఆర్‌‌డీఏ) నిషేధం విధించింది. పాలసీహోల్డర్ల వివరాలను, ఫైనాన్షియల్‌‌ అసెట్లను రిలయన్స్‌‌ జనరల్‌‌ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌‌ (ఆర్‌‌జీఐసీఎల్‌‌)కు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఇక నుంచి ఇదే కంపెనీ క్లెయిములను పరిష్కరిస్తుందని పేర్కొంది. ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ ఆర్థిక పరిస్థితి అత్యంత బలహీనంగా ఉన్నందున, హెల్త్‌‌ ఇన్సూరెన్స్ బిజినెస్‌‌ను కొనసాగించడానికి అనుమతి కొనసాగించలేమని స్పష్టీకరించింది. పాలసీహోల్డర్ల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ దగ్గర క్లెయిములకు చెల్లించేందుకు డబ్బు లేదని పేర్కొంది. ఈ నెల 15 నుంచి ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ అండర్‌‌రైటింగ్‌‌ ఇన్సూరెన్స్‌‌ వ్యాపారాన్ని ఆపేయాలని, ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌‌సైట్‌‌ ద్వారా కస్టమర్లకు తెలియజేయాలని నిర్దేశించింది.  తమ అనుమతి లేకుండా కంపెనీ తన ఆస్తులను అమ్మకుండా ఆంక్షలు విధించింది. సాధారణ బీమా వ్యాపారంతో, ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ ఆస్తులకు సంబంధం లేకుండా విడదీయాలని ఐఆర్‌‌డీఏ ఆదేశాలు పేర్కొన్నాయి. ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ క్లెయిములన్నింటికీ ఆర్‌‌జీఐసీఎల్‌‌ డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ వ్యాపారం కోసం ఐఆర్‌‌డీఏ గత ఏడాది అక్టోబరులో అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌‌ నాటికి దీని సాల్వెన్సీ రేషియో 106 శాతంగా నమోదయింది. దీనిని 150 శాతానికి పెంచుకోవాలని ఐఆర్‌‌డీఏ ఆదేశించినా, ఆర్‌‌హెచ్‌‌ఐసీఎల్‌‌ ఈ విషయంలో విఫలమైంది.   పాలసీహోల్డర్ల ప్రయోజనాలను  కాపాడుతామని ఐఆర్‌‌డీఏ భరోసా ఇచ్చింది.

Latest Updates