కోటీశ్వరులకు ఆసరా పింఛన్లు

  • కరీంనగర్‌‌ కార్పొరేషన్‌ లో ఆఫీసర్ల దాతృత్వం
  • విచారణ చేపట్టా లంటూ కలెక్టర్‌‌కు లోక్‌ సత్తా ఫిర్యాదు

కరీంనగర్, వెలుగువృద్ధులు.. వికలాంగులు.. వితంతు, ఒంటరి మహిళలు.. బీడీ, గీత కార్మికులు.. లాంటి వారికి ప్రతి నెలా ఆసరా పింఛన్ల రూపంలో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది.  కొంత మంది ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఏ అర్హత లేకపోయిన ఏంచక్కా.. నెల నెలా పింఛను డబ్బులు తీసుకుంటున్నారు. కరీంనగర్‍ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 20 వేల మందికి పింఛన్లు ఇస్తుండగా.. వీటిలో సుమారుగా మూడు వేల మంది వరకు అనర్హులు ఉన్నారని అంచనా. దీంతో నెలకు రూ.60 లక్షల చొప్పున ఏడాదికి రూ.7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.

కరీంనగర్‍ కార్పొరేషన్‍ పరిధిలో చాలా డివిజన్లలో ఇదే తీరు ఉంది. కార్పొరేషన్‌‌లో తెలిసిన నాయకులు ఉంటే చాలు అర్హత ఉన్నా.. లేకున్నా.. ఆసరా పింఛను రాయించుకొని లబ్ధి పొందుతున్నారు. మరోవైపు ఎంతో మంది అర్హులైన పేదలు మాత్రం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్‍ కార్పొరేషన్ పరిధిలో రాంనగర్‍ 41 డివిజన్‌‌లో 15 మంది అనర్హులున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీరంతా కూడా పెద్ద పెద్ద బంగ్లాలు… వాటి ముందు ఖరీదైన కార్లు ఉండే కోటీశ్వరులు. బీడీ ఆకు ఎట్లుంటదో దాన్ని ఎట్ల చుడుతరో తెల్వనోళ్లు కూడా బీడీ కార్మికుల పింఛను అందుకుంటున్రు.

భర్త బతికే ఉన్నా.. 

భర్త బతికే ఉన్నా.. వితంతువు కేటగిరిలో పింఛన్లు ఇచ్చే స్థాయిలో కరీంనగర్‌‌లో పింఛన్ల మంజూరులో మాయ నడుస్తోంది. ఇంకొందరు ఏకంగా చనిపోయినోళ్ల పేర్లపై నెలలుగా పింఛన్లు తీసుకుంటున్నరు. 19 వ వార్డులో ఓ మున్సిపల్ జవాన్ సైతం ఆసరా పెన్షన్‍ తీసుకుంటుండడం విశేషం. ఈ వార్డులో 18 మంది అనర్హుల లిస్ట్‌‌ కలెక్టర్‌‌కు అందించారు.

విచారణ చేపట్టాలి

కార్పొరేషన్‍ పరిధిలో అక్రమంగా పింఛన్లు పొందుతున్న కొంత మంది డేటా మాత్రమే బయటపడింది. మొత్తంగా 20వేల మంది పింఛన్లు పొందుతుంటే వీరిలో  సుమారుగా 3వేల వరకు అనర్హులవే ఉండటం గమనార్హం. వీరి ద్వారానే ఏటా రూ.7 కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. దీనిపై లోక్‌‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా బాధ్యుడు నరెడ్ల శ్రీనివాస్ కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. అనుమతిస్తే తామే విచారణ చేపట్టి రిపోర్టు ఇస్తామని కూడా ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Latest Updates