రేట్లు పెంచిన్రు.. కోట్లు మింగిన్రు!

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టు (ఓసీపీ) భూసేకరణలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భూములకు నష్టపరిహారం పెంపు విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హయ్యర్​ ఆఫీసర్లు ఇంటర్నల్​ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఒక రెవెన్యూ ఆఫీసర్​ నెల రోజుల క్రితం సెలవుపై వెళ్లారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లే ఆఫీసర్లు చిక్కుల్లో పడ్డారని అంటున్నారు.

వెయ్యి ఎకరాలకు పైగా భూముల సేకరణ..
సింగరేణి సంస్థ శ్రీరాంపూర్​ ఏరియా పరిధిలోని ఐకే-1 అండర్​గ్రౌండ్​ మైన్​ను మూసివేసి ఆ ప్రాంతంలో ఓసీపీని ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆఫీసర్లు ఇందారం, టేకుమట్ల, శెట్​పల్లి, బెజ్జాల, రామారావుపేట, కాచన​పల్లి గ్రామాల్లో 1031.36 ఎకరాలు సేకరించారు. భూయజమానులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో రెవెన్యూ ఆఫీసర్లు కొంతమందికి అనుకూలంగా వ్యవహరించి అమాంతం రేట్లు పెంచారని, ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ద్వారా పావులు కదిపినట్లు సమాచారం. 300 ఎకరాలకు సంబంధించిన లావాదేవీల్లో కొందరు నేతలు, ఆఫీసర్లకు రూ.కోట్లలో లబ్ధి జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఆర్డీవో ఆఫీసులోని ఒక ఆఫీసర్​తో పాటు మరో ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సదరు భూములకు సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేయకుండా నిలిపేశారు.

డిమాండ్​ ఉన్న చోట ఎక్కువ.. లేని చోట తక్కువ..
రాజీవ్​ రహదారికి సమీపంలో ఉన్న కాచనపల్లి భూములకు మార్కెట్​ రేటు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. రెండు పంటలు పండే మాగాణి భూములకు రూ.12.60 లక్షల పరిహారం నిర్ణయించిన ఆఫీసర్లు, రాజీవ్​ రహదారికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు ఎకరానికి రూ.16.60 లక్షలు పరిహారంగా నిర్ణయించడంతో అక్రమాలు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఓసీపీ భూసేకరణకు నోటిఫికేషన్​ వచ్చినప్పటి నుంచి అంతకుముందు మూడేళ్లలో జరిగిన రిజిస్ర్టేషన్​ వాల్యూ ఆధారంగా భూముల ధరలను నిర్ణయించారు. దశాబ్దకాలంగా పెండింగ్​లో ఉన్న ఇందారం ఓసీపీకి క్లియరెన్స్​ రానుందనే విషయాన్ని ముందుగానే తెలుసుకున్న కొంతమంది నాయకులు ఆయా గ్రామాల్లో బినామీ పేర్లపై భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపారు. దీంతో కాచనపల్లిలో రిజిస్ర్టేషన్​ వాల్యూ రూ.6.50 లక్షలు, ఇందారంలో రూ.14.50 లక్షలు, టేకుమట్లలో రూ.8.50 లక్షలు వచ్చింది. రెండు పంటలు పండే విలువైన భూములకు పరిహారం తక్కువగా వస్తుందని కాచనపల్లికి చెందినవారు పలుమార్లు కలెక్టర్​ను, ఇతర ఆఫీసర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో వీరికి రూ.12.60 లక్షలుగా నిర్ణయించారు. ఇదే అదనుగా ఇతర గ్రామాల్లో పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులకు, సంబంధిత ఆఫీసర్లకు మధ్య సుమారు రూ.7కోట్ల డీల్​ కుదిరిందని, ఇప్పటికే సగం ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా ఉన్నతాధికారి ఇంటర్నల్​ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. లక్షల్లో పరిహారం పెంచినందుకు ఓ కీలక ప్రజాప్రతినిధితో పాటు పలువురు నాయకులు కమీషన్లు దండుకొని వాటాలు పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టారాజ్యంగా భూముల రేట్లు పెంచి సింగరేణి ధనాన్ని మింగిన ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులపై ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు.

పరిహారం పెంపు ఇలా…
మొదట భూసేకరణ చేపట్టిన సమయంలో సింగరేణి ఆఫీసర్లు కాచనపల్లి గ్రామ శివారులోని భూములకు రూ.10.50 లక్షలు, టేకుమట్ల, శెట్​పల్లి, బెజ్జాలలోని భూములకు రూ.12.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. కాచనపల్లి గ్రామస్తులు తమకు నష్టపరిహారం తక్కువగా ఉందని ఆందోళన చేయడంతో రూ.2.10 లక్షలు పెంచి రూ.12.60 లక్షలుచేశారు. దీనిని సాకుగా చూపుతూ ఇందారం, టేకుమట్ల, శెట్​పల్లి, బెజ్జాల గ్రామాల పరిధిలోని భూములకు పరిహారం పెంచేలా అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. దీంతో ఇందారం మినహా ఇతర గ్రామాల్లోని భూములకు రూ.12.50 లక్షల నుంచి రూ.16.60 లక్షలకు, ఇందారం పరిధిలోని భూములకు రూ.22.50 లక్షల నుంచి రూ.24.60 లక్షలకు పెంచుతూ రెవెన్యూ శాఖలోని కీలక ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు.

For More News..

ఆన్​లైన్ క్లాసులతో ఫాయిదా లేదు

చిరుతెక్కడ? 50 రోజులైనా జాడ లేదు

ఆర్టీసీలో వద్దన్నరు..  సింగరేణిలో సై అన్నరు

Latest Updates