‘ఇద్దరు పిల్లల’ రూల్ అమలు​ సాధ్యమేనా?

  • తాజాగా అస్సాం సర్కారు కొత్త పాలసీ
  • జనాభా నియంత్రణకు1951లోనే ప్రయత్నం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు
  • ఇప్పుడు సర్కార్ ఉద్యోగానికి, సంతానానికి లింక్

న్యూఢిల్లీ: ‘ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు’ అంటూ అస్సాం ప్రభుత్వం తేల్చేసింది.. రెండేళ్ల తర్వాత ఈ రూల్​ను కచ్చితంగా అమలుచేస్తామని ప్రకటించింది. పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ఈ పాలసీని అమలుచేయనున్నట్లు తెలిపింది. నిజానికి జనాభా నియంత్రణకోసం స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే ప్రయత్నాలు జరిగాయి. 1951లో అంటే ఇంకా మొదటి లోక్​సభ ఏర్పాటు కాకముందే ఓ పాలసీని రూపొందించారు. ఫలితాల మాటెలా ఉన్నా ప్రయత్నం మాత్రం ఆనాడే జరిగింది. మళ్లీ 2017లో అస్సాంలోని బీజేపీ సర్కారు కొత్త రూల్​తీసుకొచ్చింది. 2021 జనవరి నుంచి ఈ కొత్త రూల్​ను అమలు చేస్తామని ప్రకటించింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారితో పాటు ఇప్పటికే సర్కారు కొలువు చేస్తున్న వారికీ ఈ రూల్​ వర్తింపజేస్తామని పేర్కొంది.

ఎమర్జెన్సీ కాలంలో..

ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణను ప్రోత్సహించారు. ఒకరకంగా డాక్టర్లు నిర్బంధంగా ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ ఎత్తేశాక మాత్రం ఇదే రివర్స్​ కొట్టింది. దేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. 1980లలో ప్రభుత్వం ‘మేమిద్దరం, మాకిద్దరు’ అంటూ కుటుంబ నియంత్రణ పద్ధతులను, అవసరాన్ని ప్రచారం చేసింది. తర్వాత నేషనల్​ హెల్త్​పాలసీని ప్రభుత్వం అడాప్ట్​ చేసుకుంది.  ఎంతమంది పిల్లలను కనాలనేది దంపతుల వ్యక్తిగత హక్కు అని, దానిని గౌరవిస్తానని ప్రభుత్వం వెల్లడించింది.1994లో పాపులేషన్​ అండ్​ డెవలప్​మెంట్​ డిక్లరేషన్​ పై సంతకం చేయడంతో జనాభా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి బిల్లులను తీసుకురాలేకపోతోందని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో..

అధిక సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.

రాజస్థాన్​లో..

ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు.ఇద్దరు పిల్లల్లో ఒకరు ఏదైనా వైకల్యంతో.. ఆ దంపతులకు మినహాయింపు కల్పించింది.

గుజరాత్​లో..

పంచాయతి, మున్సిపాలిటీ, మున్సిపల్​ కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసే వీల్లేదు.

మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​లలో..

ప్రభుత్వ ఉద్యోగానికి, స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పోటీకి అవకాశమూ లేదు. ఈ రూల్​ను2001 లో అమల్లోకి తీసుకొచ్చి 2005లో ఎన్నికల్లో పోటీకి మినహాయింపు కల్పించాయి.

ఒడిశాలో..

అర్బన్​ లోకల్​ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుం డా అనర్హులుగా ప్రకటించింది. బీహార్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలు మాత్రం మున్సిపల్​ ఎన్నికలకు మాత్రమే పరిమితం చేశాయి.

కర్నాటకలో..

పిల్లల విషయంలో ఇక్కడ ఎలాంటి నిబంధన లేకున్నా.. ఇంట్లో మరుగుదొడ్డి లేకుంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వీల్లేకుండా గ్రామ స్వరాజ్, పంచాయతీ రాజ్ యాక్ట్​లో ఓ క్లాజును ఏర్పాటు చేసింది.

Is it possible to implement the two-child code rule in Assam?

Latest Updates