ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎన్విరాన్​మెంట్ క్లియరెన్స్​ ఉందా?

అన్ని ప్రాజెక్టుల వివరాలు పంపండి

 తెలంగాణ, ఏపీలకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ లేఖలు

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్మిస్తోన్న అన్ని ప్రాజెక్టులకు ఎన్విరాన్​మెంట్​ క్లియరెన్స్​లు ఉన్నాయా అని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ మేరకు అన్ని ప్రాజెక్టుల వివరాలు పంపించాలంటూ కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ మానిటరింగ్ అప్రైజల్ డైరెక్టరేట్(సీడబ్ల్యూసీ) డిప్యూటీ డైరెక్టర్ రేఖారాణి శుక్రవారం రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లెటర్​ రాశారు. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రెటరీ బీపీ పాండే కూడా ఇదే అంశంపై రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లెటర్లు రాశారు. ఈ నెల 23న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖలు రాస్తున్నట్టు తెలిపారు. వెంటనే ఆయా ప్రాజెక్టులకు వచ్చిన ఎన్విరాన్​మెంట్ క్లియరెన్స్​ల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులు ఇవీ..

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తోన్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీంలు, మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్​లు, ఉమ్మడి ఏపీలో చేపట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత విస్తరిస్తోన్న కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీంలు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల వివరాలు పంపాలని సూచించింది. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తోన్న కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలు, దేవాదుల థర్డ్ ఫేజ్, తుపాకులగూడెం బ్యారేజీ, మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, లోయర్ పెన్​గంగపై నిర్మిస్తోన్న రాజుపేట్, చనాకా–కొరాటా, పింపరాద్–పర్సోడా, రామప్ప డైవర్షన్ స్కీంలకు ఉన్న అనుమతుల వివరాలందించాలని  ఆదేశించింది.

ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టులు..

శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించడానికి ఏపీ కొత్తగా తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం(రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. వీటితోపాటు ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్దాపురం, శివభాష్యం, వేదవతి, నాగులదిన్నె లిఫ్ట్ స్కీంలు, గుండ్రేవుల రిజర్వాయర్, మున్నేరు స్కీం, ఆర్డీఎస్ రైట్ కెనాల్, తుంగభద్ర నదిపై ఆర్డీఎస్–సుంకేసుల బ్యారేజీ మధ్యలో చేపట్టిన లిఫ్ట్ స్కీం, గోదావరి–పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్టు ఫేజ్–1కు ఉన్న పర్యావరణ అనుమతులను సమర్పించాలని సూచించింది. ఏపీ గోదావరిపై నిర్మిస్తోన్న పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులకు ఉన్న ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లను సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది.

Latest Updates