ఐల్యాండ్స్ లో.. ఐదు రోజులు : హైదరాబాద్​ టు అండమాన్

చుట్టూ పచ్చటి వాతావరణం ఉంటే.. ఈ లోకంతో పెద్దగా పనుండదు. ఆ పచ్చదనాన్ని చూస్తూ హాయిగా గడిపేయొచ్చు. అలాగే.. స్వచ్ఛమైన సముద్రం నిశ్చలంగా ఉండి.. దాని చుట్టూ పచ్చటి చెట్లు.. మధ్యలో మనం ఉంటే ఆ ఫీలింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! మీక్కూడా ఆ ఫీలింగ్​ అనుభవించాలని ఉందా? అయితే.. మీకోసమే ఐఆర్​సీటీసీ తక్కువ ధరలో టూర్​ ప్యాకేజీలు తెచ్చింది. ఆ వివరాలు.. అండమాన్​ అందాల కనువిందుతో ఈ స్టోరీ మీకోసం..

చాలారోజులుగా ఏదైనా మంచి ప్లేస్​కి వెళ్లాలనుకుంటూ.. బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ మరిచి హాయిగా.. రొటీన్​ జీవితానికి, బోరింగ్​ ప్రపంచానికి దూరంగా గడపాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఇండిగో ఎయిర్​లైన్స్​ ఎకానమీ క్లాస్​లో హైదరాబాద్​ నుంచి అండమాన్​కు తీసుకెళ్లే టూర్​ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్​సీటీసీ. ఐదు రాత్రులు, ఆరు రోజులు అండమాన్​లో గడిపే అద్భుతమైన అవకాశం టూరిస్టులు అస్సలు వదులుకోకండి అంటూ తొందరపెడుతోంది. ముప్పై వేల నాలుగు వందల రూపాయలు టూర్​ ప్యాకేజీగా నిర్ణయించింది. హైదరాబాద్​ నుంచి అండమాన్​  ట్రిప్​ వచ్చేనెల అంటే.. సెప్టెంబర్​ 6న స్టార్ట్​ అవుతుంది. ఆహ్లాదకరమైన ఈ టూర్​ ప్యాకేజ్​ అందుకోవాలంటే..  irctctourism.com వెబ్​సైట్​ ఓపెన్​ చేసి ప్యాకేజీ బుక్​ చేసుకోవాలి.

ఏమేముంటాయి..

పర్యాటక ప్రేమికులకు అతి తక్కువ ధరలో అందించే ఈ టూర్​ ప్యాకేజీలో  ఫ్లైట్​ టిక్కెట్లు, డీలక్స్​ హోటల్లో బస, బ్రేక్​ఫాస్ట్​, ట్రావెల్​ ఇన్సూరెన్స్​ కవర్​ అవుతాయి. మధ్యాహ్న భోజనం, రూమ్​ సర్వీస్​, ఎంట్రీ టికెట్లు ఈ ప్యాకేజీలో కవర్​ కావు. అంటే.. ఉదయం బ్రేక్​ఫాస్ట్​ వరకే వాళ్లు చూసుకుంటారన్నమాట. మధ్యాహ్నం లంచ్​, రాత్రి డిన్నర్​, ఎక్కడికైనా వెళ్తే.. ఎంట్రీ టిక్కెట్లు మనమే తీసుకోవాలి.

ఎలా సాగుతుంది?

సెప్టెంబర్​ 6న హైదరాబాద్​ నుంచి అండమాన్​ బయల్దేరే ఫ్లైట్​ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు టేకాఫ్‌ అవుతుంది. మధ్యాహ్నం పన్నెండున్నరకు పోర్ట్​బ్లెయిర్​కు చేరుకుంటుంది. అక్కడ హోటల్లో​ బస చేసి లంచ్​ పూర్తి చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత కార్బినిస్​ కోవ్​ బీచ్​కు ప్రయాణం. ఆ తర్వాత సెల్యులార్​ జైల్​ చూపిస్తారు. దీంతో ఆరోజు ప్యాకేజీ ముగుస్తుంది. ఆ రాత్రి పోర్ట్​ బ్లెయిర్​ హోటల్​లోనే నిద్ర. సెప్టెంబర్​ 7న ఉదయం ఐల్యాండ్​లో విహారం ఉంటుంది. అక్కడి నుంచి ‘నార్త్​ బే’ దీన్నే కోరల్​ ఐల్యాండ్​ అని కూడా అంటారు. రోజంతా ఐల్యాండ్​లో గడిపి తిరిగి రాత్రికి మళ్లీ పోర్ట్​బ్లెయిర్​కు చేరుకుంటారు. సెప్టెంబర్​ 8న ఉదయాన్నే హేవ్​లాక్​ ఐల్యాండ్​కి ప్రయాణం. వెళ్లగానే హోటల్​ రూం ఇస్తారు.

కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాధానగర్​ బీచ్​లో విహరిస్తారు. తిరిగి రాత్రి మళ్లీ హేవ్​లాక్​ ఐల్యాండ్​లోనే బస చేయాలి. మరుసటి రోజు అంటే.. సెప్టెంబర్​ 9న ఉదయం కాలాపత్తర్​ బీచ్​లో విహరించాలి. అదే రోజు తిరిగి పోర్ట్​బ్లెయిర్​ చేరుకొని సెప్టెంబర్​ 10న ఉదయం బారాతంగ్​కు ప్రయాణం చేయాలి. అక్కడ లైమ్​స్టోన్​ కేవ్స్​, మడ్​ వాల్కనోస్​ ప్రాంతాల్లో విహరించి తిరిగి రాత్రి పోర్ట్​ బ్లెయిర్​ చేరుకుంటారు. ఆ రాత్రి పోర్ట్​ బ్లెయిర్​లోనే ఉండి.. సెప్టెంబర్​ 11 మధ్యాహ్నం ఒంటిగంటకు పోర్ట్​బ్లెయిర్​లో ఫ్లైట్​ ఎక్కితే.. అదేరోజు మధ్యాహ్నం మూడున్నరకు హైదరాబాద్​లో దిగుతారు.

ఈ టూర్​లో చూసేవి..

పోర్ట్​ బ్లెయిర్​, కార్బినిస్​ కోవ్​ బీచ్​, సెల్యులార్​ జైల్​, కోరల్​ ఐల్యాండ్, హేవ్​లాక్ ఐల్యాండ్, రాధానగర్​ బీచ్​, కాలాపత్తర్​ బీచ్​, బారాతంగ్​, లైమ్​స్టోన్​ కేవ్స్​, మడ్​ వాల్కనోస్​.

Latest Updates