క్యాన్సర్ పేషెంట్స్ కి ఐసోలేషన్ తప్పనిసరి

క్యాన్సర్​తో పోరాటమంటే చావుతో నేరుగా పోరాటం చేయడమే. అలాంటి పోరాటంలో ఉన్నప్పుడు కరోనా సోకడం ఇంకెంతో ప్రమాదకరం. ఆ ప్రమాదం నుంచి ఇప్పుడు తప్పించుకోవడం క్యాన్సర్​ పేషెంట్స్​కి సవాలుగా ఉంది. ప్రపంచాన్ని మార్చిన కరోనా క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ని కూడా మార్చేసింది. ఆ విశేషాలను అపోలో క్యాన్సర్​ ఇనిస్టిట్యూట్​ ఆంకాలజిస్ట్​ డాక్టర్​ పి. విజయ్​ కరణ్​ రెడ్డి లైఫ్​తో పంచుకున్నారు.

క్యాన్సర్ పేషెంట్స్​లో కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది?

క్యాన్సర్​ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాగే క్యాన్సర్​ ట్రీట్​మెంట్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. క్యాన్సర్​ ట్రీట్​మెంట్​లో భాగంగా చేసే సర్జరీ, రేడియేషన్​, కీమోథెరపీల అయితే వీటిలో బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కీమోథెరపీ ఇమ్యూనిటీ మరింత ఎక్కువగా దెబ్బతీస్తుంది.  అందువల్ల నార్మల్​ పర్సన్​ కంటే క్యాన్సర్​ పేషెంట్స్​ కోవిడ్​ 19 బారినపడితే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

ఎలాంటి ప్రికాషన్స్​ తీసుకోవాలి?

క్యాన్సర్​ పేషెంట్స్​ కరోనా బారిన పడకుండా అదనంగా తీసుకునే ప్రికాషన్స్​ ఉండవు. సాధారణ వ్యక్తులు ఎలా ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలో దానినే 100 శాతం పాటించాలి. మాస్క్​ ధరించడం, చేతులు ముఖానికి తాకకుండా చూసుకోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి.

క్యాన్సర్​ పేషెంట్స్​కి కరోనా సోకితే క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ ఆపేస్తారా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మందికి కరోనా సోకవచ్చు. క్యాన్సర్​ పేషెంట్​కి కరోనా సోకితే ముందు కరోనా నుంచి బయటపడేయడానికే ప్రయత్నం చేస్తాం. క్యాన్సర్​ టైప్​, దాని స్టేజ్​, అప్పటికే ఉన్న ట్రీట్​మెంట్​ని బట్టి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఇమ్యూనిటీని కాపాడేందుకు మొదట ప్రయత్నిస్తాం. అందుకోసం  ట్రీట్​మెంట్​లో మార్పులు చేస్తాం. క్యాన్సర్​ ట్రీట్​మెంట్​లో మార్పులుంటాయి. కానీ, పూర్తిగా ట్రీట్​మెంట్​ని ఆపడం కుదరదు.

కీమోథెరపీ తప్పనిసరి అయిన పేషెంట్స్​ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కీమోథెరపీ పేషెంట్​ వీలైనంత వరకు ఐసోలేషన్​లో ఉండాలి. ఫ్యామిలీతో ఉన్నా ఐసోలేట్​ అవ్వాలి. ఎవ్వరినీ కలవొద్దు. ఎక్కడికీ పోవద్దు. వాళ్లకు సాయపడే వ్యక్తి మాత్రమే వాళ్ల దగ్గరకు పోవాలి. ఏమైనా వస్తువులు ఆర్డర్​ చేస్తే డెలివరీ వాళ్లు డోర్​ దగ్గర వస్తువులు పెట్టిపోవాలి. వాళ్లను ఎవరూ డైరెక్ట్​గా కాంటాక్ట్​ కాకూడదు.

కోవిడ్​ టైమ్​లో కీమో థెరపీ ఇస్తుంటే కీమోథెరపీని ఆపి మందులు ఇవ్వడం మంచిది. లేకపోతే కీమోకి బదులుగా సర్జరీ చేసే అవకాశాలు పరిశీలించాలి. స్టేజ్​ని బట్టి కీమోని వాయిదా వేయొచ్చు. స్టేజ్​​ వన్​లో ఉంటే సర్జరీ చేసి, రెండు నెలల తర్వాత కీమోథెరపీ చేయాలి. కీమోథెరపీ చేయించుకున్న పేషెంట్​ ఇంటికే పరిమితమవ్వాలి. కరోనా సోకే టైంకి కీమో నడుస్తుంటే దానిని బ్రేక్​ చేయాలి.

కీమోథెరపీ చేస్తే ఇమ్యూనిటీ తగ్గుతుందా?

కీమో థెరపీ ఇచ్చినప్పుడు బోన్​మారోలో ఉండే సెల్స్​ డ్యామేజ్​అవుతాయి. తెల్లరక్త కణాలన్నీ డ్యామేజ్​ అవడం వల్ల బ్లడ్​లో వాటి సంఖ్య బాగా పడిపోతుంది.ఈ స్థితిలో శరీరంపై ఏదైనా బ్యాక్టీరియా, వైరస్​ అటాక్​ చేస్తే వాటిపై శరీరం సరైన పోరాటం చేయలేదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో (ఒక మైక్రో లీటర్​ బ్లడ్​లో) 7 నుంచి 8 వేల తెల్ల రక్తకణాలుంటే క్యాన్సర్​ పేషెంట్​లలో అంతకంటే తక్కువగా ఉంటాయి. వీళ్లలో మైక్రోలీటర్​ బ్లడ్​లో ఒకటి నుంచి రెండు వేల తెల్లరక్తకణాలు మాత్రమే ఉంటాయి.  తెల్లరక్తకణాలు పెరిగేందుకు ఇంజెక్షన్స్​ ఇస్తాం. కానీ యాంటీబాడీస్​ని పెంచేందుకు మందులు లేవు. కరోనా వైరల్​ లోడ్​ తగ్గితేనే కీమోథెరపీ చేయాలి. కరోనా సోకితే కీమోథెరపీని వాయిదా వేస్తూ సర్జరీ, రేడియేషన్​ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వైరస్​ లోడ్​ పూర్తిగా తగ్గిన తర్వాత కీమోథెరపీ చేయాలి.

క్యాన్సర్​ పేషెంట్స్​లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి?

క్యాన్సర్ పేషెంట్స్​ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు మంచి డైట్​ తీసుకోవాలి. ప్రతి రోజూ ఆకు కూరలు ఎక్కువగా తినాలి. నాన్​వెజ్​ తినేవాళ్లయితే ఆయిల్​, మసాలాలు బాగా తగ్గించాలి. ఫ్రూట్స్​ ఎక్కువగా తినాలి. ప్రొటీన్​ కోసం మిల్క్​, చికెన్​ తీసుకోవాలి. రెడ్​ మీట్​ జీర్ణం కాదు. కాబట్టి దానిని తీసుకోవద్దు.

ఇమ్యూనిటీ ఎంతకాలానికి ఇంప్రూవ్​ అవుతుంది?

క్యాన్సర్​ నుంచి కోలుకున్నాక బాడీలో ఇమ్యూనిటీ నెమ్మదిగా పెరుగుతుంది. సర్జరీ అయిన తర్వాత ఒక నెలకు, రేడియేషన్, కీమోథెరపీ చేస్తే రెండు నెలలకు సాధారణ వ్యక్తులకు ఉన్నంత ఇమ్యూనిటీ ఉంటుంది. క్యాన్సర్​ పేషెంట్స్​లో పెద్దల్లో కంటే పిల్లల్లో ఇమ్యూనిటీ చాలా త్వర​గా ఇంప్రూవ్​ అవుతుంది.

సిట్రస్​ ఫ్రూట్స్​ తినకుంటే ఇమ్యూనిటీ తగ్గదా?

క్యాన్సర్​ పేషెంట్స్ సిట్రస్​ ఫ్రూట్​ తింటే అసిడిటీ సమస్యలొస్తాయి. అందుకే వాటిని తినొద్దు. కీమోథెరపీ చేయించుకున్నవాళ్లు సిట్రస్​ ఫ్రూట్స్​ (నిమ్మ, సంత్రాలు, బత్తాయి లాంటివి) తింటే అసిడిటీ విపరీతంగా పెరిగిపోతుంది. కీమోథెరపీ చేసినవాళ్లకు వాంతులు ఎక్కువగా అవుతుంటాయి. సిట్రస్​ తింటే వాంతులు ఇంకా పెరుగుతాయి. రెగ్యులర్​ డైట్​ (క్యాన్సర్​ పేషెంట్స్​ తీసుకునే ఆకుకూరలు, కాయగూరలు)లో విటమిన్​ సి శరీరానికి కావాల్సినంత ఉంటుంది.  కాబట్టి విటమిన్​– సి డెఫిషియెన్సీ రాదు.

Latest Updates