ఇరాన్‌లోకి వెళ్లిన ఇజ్రాయెల్‌ ఫైటర్లు

రష్యాకు చెందిన పవర్ ఫుల్ ఎస్–300 వాయు రక్షణ వ్యవస్థను ఇజ్రాయిలీ ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు బోల్తా కొట్టించాయి. ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఎస్–300 రాడార్ల కళ్లు గప్పి, ఆ దేశ ఎయిర్ స్పేస్ లో స్వేచ్ఛగా విహరించాయి. సర్ ప్రైజ్ ఎటాక్ కోసం, ఇరాన్ సీక్రెట్ బేసులు, ఔట్ పోస్టుల ఫోటోలను సేకరించడానికే ఇజ్రాయిల్ ఈ సాహసానికి ఒడిగట్టిందని కువైట్ కు చెందిన ‘అల్ జరిదా’ డైలీ న్యూస్ పేపర్ తన రిపోర్టులో వెల్లడించింది.

సుప్రీం లీడర్ కు చెప్పని కమాండర్

కొద్ది రోజుల తర్వాత ఇజ్రాయెల్ ఆపరేషన్ గురించి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ఎయిర్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఫర్జాద్ ఇస్మాయిలీకి తెలియజేసింది. దేశంపై ఇంత పెద్ద ఆపరేషన్ జరిగిందని తెలిసి ఆయన షాక్ కు గురయ్యారు. పదవి ఊడుతుందనే భయంతో ఆ విషయాన్ని సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీకి చెప్పకుండా దాచారు. దాదాపు 13 నెలల తర్వాత ‘అల్ జరిదా’ ఈ విషయాన్ని రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సీనియర్ ఆఫీసర్లు చెప్పారంటూ కథనాన్ని రాసింది.

2010 నుంచి ఇస్మాయిలీ ఎయిర్ ఫోర్స్ ను లీడ్ చేస్తున్నారు. ఓ వైపు అమెరికాతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండగా, ఈ రిపోర్టు బయటకు రావడం ఇరాన్ లో ప్రకంపనలు సృష్టించింది. సుప్రీం లీడర్ ఖమేనీ, వెంటనే కమాండర్ ఇస్మాయిలీని పదవి నుంచి తొలగించారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఇంటెలిజెన్స్ మినిస్ట్రీని ఆదేశించారు. త్వరితగతిని నివేదిక ఇవ్వాలని ఆర్డర్ వేశారు.

ఇండియా ‘ఎస్–400’పై అనుమానాలు

ఇరాన్ లోని ఎస్–300 రాడార్లు ఎఫ్–35 ఫైటర్లను గుర్తించలేదనే విషయం తమకు తెలియదని రష్యా వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఎస్–400లో విభిన్న రాడార్లు ఉంటాయని, అవి స్టెల్త్ ఫైటర్లను గుర్తించగలవని చెప్పారు. అయితే ఎంత దూరంలో ఉండగా గుర్తిస్తాయనే ప్రశ్నకు భారత రక్షణ వర్గాలు సమాధానం చెప్పలేదు. ఎస్–300 కంటే పవర్ ఫుల్ రాడార్లు ఎస్–400లో ఉన్నాయని వివరించారు.

స్టెల్త్ ఫైటర్లను ఎస్–400 కూల్చేస్తుందా?

ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థ స్టెల్త్ ఫైటర్లను సులువుగా గుర్తిస్తుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. కానీ ఆ ఫైటర్లను కూల్చేయగలవా లేదా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ‘ఎఫ్–35 ఫైటర్లను, ఎస్–400 రాడార్లు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పుడు మాత్రమే పసిగట్టగలవు. కానీ, ఈ ఫైటర్లు అంతకంటే ఎక్కువ దూరం నుంచే గాల్లో, నేలపై ఉన్న టార్గెట్లను చేధించగలవు. కాబట్టి, ఎస్-400 వ్యవస్థపై  ఎఫ్35లు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఎక్కువగా ఉండే చాన్సులు ఉన్నాయి ’ అని స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మిలటరీ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీపై సీనియర్ రీసెర్చర్ గా పని చేస్తున్న మౌరో గిల్లీ తెలిపారు.

Latest Updates