ఉస్మానియా హాస్పిటల్ లో నకిలీ సర్టిఫికెట్లు!

అర్హత లేకున్నా మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న సిబ్బంది

సూపరింటెండెంట్ దృష్టికి అక్రమ సర్టిఫికెట్ల బాగోతం

అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం

ఉస్మానియా హాస్పిటల్ లో మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లను అర్హత లేని వారు అడ్డగోలుగా జారీ చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కు ఉన్న పేరును బద్​నాం చేసే విధంగా మెడికల్ సర్టిఫికెట్ల అక్రమ దందాకు తెగబడుతున్నారు. భారీగా డబ్బులు తీసుకుంటూ ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే పలువురికి నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తుండటం కలకలం రేపుతోంది.

సాధారణంగా ఉస్మానియా హాస్పిటల్ లో క్వాలిఫైడ్ డాక్టర్లకు మాత్రమే మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఉంది. ఉస్మానియా హాస్పిటల్ నుంచి పొందే  మెడికల్ సర్టిఫికెట్ విషయంలో సరైన స్టాండర్డ్స్ పాటిస్తారు. దీంతో చాలా మంది ఉస్మానియా హాస్పిటల్ వైద్యుల నుంచే మెడికల్ సర్టిఫికెట్ పొందేందుకు పోటీ పడతారు. ఈ అవకాశాన్ని కొంతమంది హాస్పిటల్ లోని సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుంటూ కాసులు దండుకుంటున్నారు. ఏ మాత్రం  అర్హతలు లేని  కొంతమంది సిబ్బంది ఏకంగా మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తూ దర్జాగా వాటిపై ఉస్మానియా హాస్పిటల్ స్టాంప్ ను వేసేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ లోనే ప్రత్యేకంగా ఉండే కొన్ని విభాగాలు ఉన్నాయి. టీబీ, ఏఆర్టీ, హెచ్ఐవీ సహా పలు విభాగాలు ఉస్మానియా హాస్పిటల్ లోనే ఉన్నప్పటికీ అవి వేర్వేరుగా పనిచేస్తాయి. ఐతే వీరికి ఉస్మానియా హాస్పిటల్ లో ఉన్న కింది స్థాయి సిబ్బందితో ఉన్న పరిచయాలతో కొన్ని నెలలుగా అక్రమ మెడికల్ సర్టిఫికెట్ల జారీ బాగోతాలకు తెరతీసినట్లు అనుమానాలున్నాయి.  వీరికి ఉస్మానియాలోని కొంతమంది ఇంటి దొంగలు కూడా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అర్హతలు లేని వారు యథేచ్ఛగా మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

ఐతే ఇటీవలే ఈ అక్రమ మెడికల్ సర్టిఫికెట్ల సంగతి కొంతమంది ఉస్మానియా వైద్యుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పలు అక్రమ మెడికల్ సర్టిఫికెట్లను చూసి ఉస్మానియా వైద్యులు ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అంతర్గతంగా ఈ మెడికల్ సర్టిఫికెట్ల బాగోతంపై విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఐతే హాస్పిటల్ వైద్యులు మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించటం లేదు.

Latest Updates