చిరు వ్యాపారులపై వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్

కంపెనీలు, కాలేజీలు ఓపెన్ కాక పడిపోయిన వ్యాపారాలు
తెరుచుకోని ఫుడ్ కోర్టులు 11 వేల క్యాబ్ సర్వీసులు బంద్
హాస్టల్ ఓనర్లపై పెరుగుతున్న అద్దెల భారం

హైదరాబాద్, వెలుగు: ఎప్పుడూ కళకళలాడే ఐటీ కారిడార్ కరోనా ఎఫెక్ట్ తో వెలవెలబోతోంది. టెకీలు, స్టూడెంట్స్ తో రోజంతా హడావిడిగా ఉండే బిజినెస్ ఏరియాలు లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తర్వాత కూడా కోలుకోవడం లేదు. కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తుండటం, కాలేజీలు తెరుచుకోకపోవడంతో చిరువ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, హాస్టల్ నిర్వాహకులు, హౌస్ కీపింగ్, క్యాంటీన్ వర్కర్ల‌కు ఉపాధి కరువైంది. వేలాది హైరింగ్ వెహికల్స్ షెడ్లకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము మొదలు అర్ద‌రాత్రి దాటినా సాగే ఫుడ్ కోర్టులు మూతపడే ఉంటున్నాయి.

క్యాబ్స్ కు పని లేక..

ఐటీ కారిడార్ కేంద్రంగా 6 లక్షల మంది ఉద్యోగులు కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ కనీసం 40 మంది ఎంప్లాయీస్ కు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తుంది. అందుకోసం 11,980 క్యాబ్లు నడుస్తున్నాయి. లాక్డౌన్ మొదలు.. ఇప్పటికీ కంపెనీలు 90 శాతం వర్క్ ఫ్రం హోం ఫాలో అవుతున్నాయి. దాంతో క్యాబ్ లకు పని లేకుండా పోయింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయూస్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఇన్నోవా‌ కొన్న 5 నెలలకే లాక్డౌన్ కారణంగా ఉపాధి పోయిందని బోరబండకు చెందిన మహ్మద్ చెప్పాడు.

సందడి లేదు.. ఘుమఘుమల్లేవ్

కరోనా కారణంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో బిజినెస్ పూర్తిగా పడిపోయింది. రోడ్డుకు ఇరువైపులా ఉండే స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్ ఇప్పుడు కనిపించడం లేదు. మార్నింగ్ టిఫిన్ నుంచి లేట్ నైట్ బిర్యానీ వరకూ ఘుమఘుమలాడించే ఫుడ్ కోర్టులు తెరుచుకోలేదు. పాన్ ఇండియా థీమ్ తో వెరైటీస్ అందించే 3 వేల మందికి ఉపాధి లేకుండా పోయింది. లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఇచ్చాక కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఓపెన్ అవకపోవడంతో ఫుడ్ కోర్టుల కిరాయిలు, కరెంట్ బిల్లులు, హెల్పర్స్ జీత భత్యాలు రోజురోజుకూ భారమవుతున్నాయని అయ్యప్ప సొసైటీ రోడ్డు లోని దోశ ఆన్ వీల్ ఆపరేటర్ సంజయ్ తెలిపాడు. లీజ్ కు తీసుకున్న 4 వెహికల్స్ కు బిజినెస్ లేకున్నా నెలకు రూ.లక్ష చొప్పున 3 నెలల నుంచి కడుతున్నట్లు చెప్పాడు. బండికి ఆరుగురు చొప్పున 25 మంది హెల్పర్లు ఉన్నారని, వారికీ శాలరీస్ ఇస్తున్నానని తెలిపాడు.

హాస్టళ్లదీ అదే పరిస్థితి

ఐటీ కారిడార్ ఎంప్లాయిస్ ను బేస్ చేసుకుని రన్ అయ్యే 3వేలకు పైగా ప్రైవేట్ హాస్టళ్లు మూతపడే ఉన్నాయి. హాస్టళ్లలో ఎవరూ లేకున్నా, వర్క్ ఫ్రం హోమ్ తో ఎంప్లాయీస్ రాకున్నా అద్దెల భారం మాత్రం తప్పడం లేదు. తెరిచి ఉంచితే అధికారులు వారంలో మూడు సార్లు శానిటైజ్ చేయాలంటున్నారని, దాంతో నెల రోజులుగా హాస్టల్ తీయలేదని గచ్చిబౌలికి చెందిన రాఘవేంద్ర తెలిపారు. మరో 2, 3 నెలలు ఇలాంటి పరిస్థితులే ఉంటే నిర్వహణ భారం మోయలేక పూర్తిగా అమ్ముకుని వెళ్లాల్సి వస్తుందేమోనని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates