పిల్లలకు టాన్సిల్స్ వచ్చే టైమ్ ఇదే

చలికాలం వస్తోందంటే పిల్లల్లో దగ్గు, జలుబుతోపాటు  ఎక్కువగా కనిపించేది టాన్సిల్స్‌‌ సమస్య. ఇది నాలుగు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గొంతునొప్పి, వాపు ఈ టాన్సిల్స్​ ప్రధాన లక్షణాలు. అలాగే ఆహారం తినేటప్పుడు మింగలేకపోతారు. ఇన్‌‌ఫెక్షన్‌‌ ఎక్కువగా ఉంటే జ్వరం, తలనొప్పి కూడా వస్తాయి. ఈ టాన్సిల్స్‌‌ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్​ఫెక్షన్​ని తగ్గించుకోవచ్చు.

టాన్సిల్స్‌‌ ఇన్‌‌ఫెక్షన్‌‌ వల్ల వచ్చే నొప్పి నుంచి రిలీఫ్​ పొందాలంటే..

గ్లాసు వేడినీళ్లలో ఉప్పు వేసి, వాటిని గొంతువరకు పోసుకుని పుక్కిలించాలి (గార్గిలింగ్​).

వాపు ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడం కష్టం. అలాంటప్పుడు గ్లాసు వేడి పాలలో అర టీ స్పూన్​ పసుపు కలిపి చప్పరిస్తూ మింగటం వల్ల నొప్పి, ఇన్‌‌ఫెక్షన్‌‌ తగ్గుతాయి.

అలాగే వాపు తగ్గాలంటే, గోరువెచ్చని నీళ్లలో ఒక టీ స్పూన్​ నిమ్మరసం, చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్​ తేనె కలిపి మూడురోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్‌‌ – సి, యాంటీ బ్యాక్టీరియల్‌‌, యాంటీ వైరల్‌‌ గుణాలుండటం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది.

తులసి ఆకుల్లో యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకుల్ని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగయ్యాక అందులో తేనె కలుపుకుని  తీసుకోవటం మంచిది.

టాన్సిల్స్‌‌ వల్ల గొంతులో మరీ ఇబ్బందిగా అనిపిస్తే, వేడినీళ్లలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల కాస్త రిలీఫ్​గా ఉంటుంది.

అన్నం తినడం కష్టంగా అనిపించినప్పుడు ఫ్రూట్ జ్యూస్, మిల్క్​ షేక్స్​ వంటివి తాగడం బెటర్. అయితే చక్కెర, కూలింగ్​ ఉండొద్దు. ఈ చిట్కాలతో జ్వరం తగ్గకపోయినా, గొంతు నుంచి మాట రావడం కష్టంగా ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి.

సెక్యూరిటీ అలారం లాంటివి

పిల్లల్లో టాన్సిల్ వాపు చాలా సాధారణం. టాన్సిల్స్ అనేవి ప్రమాదకరమైనవేమీ కాదు. నిజానికి ఇవి మన బాడీలోకి వచ్చే ఇన్‌‌ఫెక్షన్స్ గురించి హెచ్చరించే సెక్యూరిటీ అలారం లాంటివి. నోటిలోకి వచ్చే ఇన్‌‌ఫెక్షన్‌‌ని పీల్చుకొని ఉబ్బిపోతాయి. అంటే, నోటి నుంచి ఇన్‌‌ఫెక్షన్‌‌ని మన బాడీ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి టాన్సిల్స్ రావటం ప్రమాదమని భయపడాల్సిన పని లేదు. టాన్సిల్ వాపుకి ముఖ్య కారణాలు.. ఇన్‌‌ఫెక్షన్స్, చల్లటి పదార్థాలు తినడం, నోరు లేదా గొంతులో గాయాలు అవ్వడం. అయితే చాలా అరుదుగా క్యాన్సర్, టీబీ వ్యాధి వల్ల కూడా టాన్సిల్ వాపు కనపడుతుంది. కేవలం టాన్సిల్ వాపు ఉండి.. నొప్పి, జ్వరం లేకపోతే యాంటీ బయాటిక్స్ అవసరంలేదు. ఒకవేళ పన్నెండేళ్లు దాటిన వాళ్లలో సంవత్సరానికి నలభై ఐదుసార్లకు మించి టాన్సిల్ వాపు వస్తూ ఉంటే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా సర్జరీ గురించి ఆలోచించాలి.– డా. వంశీధర్ రెడ్డి, పీడియాట్రిషియన్.

Latest Updates