టీచర్లకు ప్రమోషన్లు ఇప్పట్లో కష్టమే!

హైదరాబాద్‌‌‌‌, వెలుగుటీఆర్టీ నియామకాలకు ముందే సెకండరీ గ్రేడ్‌‌‌‌ టీచర్స్‌‌‌‌(ఎస్‌‌‌‌జీటీ)కు ప్రమోషన్లు ఇవ్వాలనే డిమాండ్​తో కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళన ఫలించేలా లేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పట్లో ప్రమోషన్లు అసాధ్యమని, ఇందుకు మరో ఏడాది పట్టే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.  దీంతో సీనియర్‌‌‌‌ ఎస్‌‌‌‌జీటీల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఏడేళ్ల  తర్వాత  ప్రభుత్వస్కూళ్లలో​ టీచర్‌‌‌‌ నియామకాలు జరుగుతున్నాయి. 8,792 పోస్టుల భర్తీకి రెండేండ్ల క్రితమే నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించినా, అర్హులకు పోస్టింగులు ఇవ్వలేదు. అనేక ఆందోళనల తర్వాత ఇటీవలే వివాదాల్లేని 2,509 స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, పీఈటీ, లాంగ్వేజ్​ పండిట్‌‌‌‌ పోస్టుల భర్తీకి  ప్రభుత్వం షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసింది. గతంలో ప్రమోషన్లు, బదిలీల తర్వాతే కొత్త నియామకాలు చేపట్టేవారు. కానీ కోర్టు ఉత్తర్వులతో ప్రమోషన్లు లేకుండానే టీచర్​ నియామకాలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. దీంతో 3 వేలమంది ఎస్‌‌‌‌జీటీలు ప్రమోషన్లకు దూరం కావడంతో పాటు సీనియార్టీ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ఇస్తే కొత్త జిల్లాల ప్రకారమే..

పాఠశాల విద్యాశాఖ అధికారుల వద్ద పాత పది జిల్లాలకు చెందిన టీచర్ల సీనియార్టీ లిస్టులున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ముందుగా భావించారు. కానీ  ఓ తీర్పులో భాగంగా కొత్త జిల్లాలకు అనుగుణంగానే ప్రమోషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.  రాష్ర్టంలో 31 జిల్లాలకు రాష్ర్టపతి ఆమోదం ఉండగా, కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ర్టపతి ఉత్తర్వులకు సవరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించింది. ఇంకా రాష్ర్టపతి ఆమోదం లభించలేదు. సుప్రీంకోర్టులో టీఆర్టీ నియామకాలకు సంబంధించిన కేసు నడుస్తోంది. నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సీఎస్‌‌‌‌ తమ ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అనివార్యంగా సర్కారు టీఆర్టీ నియామకాలు చేపట్టాల్సి వచ్చింది. కోర్టు ఉత్తర్వులపై స్టే తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు భావించినా, ఒక్కోశాఖకు ఒక్కోరూల్‌‌‌‌ వద్దని జీఏడీ అధికారులు సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ తీరుపై టీచర్స్ యూనియన్లు మండిపడుతున్నాయి. కొత్తజిల్లాల ప్రకారం ప్రమోషన్లు అంటే కాలయాపనేనని, పాత జిల్లాల ప్రకారమే ఇవ్వాలని టీటీఎఫ్‌‌‌‌ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘునందన్‌‌‌‌, కె రమణ, టీడీటీఎఫ్‌‌‌‌ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్‌‌‌‌, సోమయ్య డిమాండ్‌‌‌‌ చేశారు.

Latest Updates