ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నయ్.. కొత్త ఫ్రంట్ రావొచ్చు

న్యూఢిల్లీ, వెలుగురానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమే అల్టర్నేట్‌‌‌‌గా మారుతుందని, రీజినల్ పార్టీస్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌ స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌లకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని, ఇందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌లు కూడా ఒక రకంగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే అన్నారు. దక్షిణాదిలో కర్ణాటకలో తప్ప మిగతా రాసష్ట్రాలలో బీజేపీ చాలా బలహీనంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ ఎప్పుడూ చెప్పే నిజమైన ఫెడరల్‌‌‌‌ స్ఫూర్తితో దేశం నడిచే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌‌‌‌నౌ నిర్వహించిన సమ్మిట్‌‌‌‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారతదేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన సమ్మిట్‌‌‌‌లో మంత్రి కేటీఆర్‌‌‌‌ మాట్లాడారు. దేశ అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామం చాలా కీలకమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఊదారంగా రాష్ట్రాల అభివృద్ధికి నిధులను విడుదల చేసినప్పుడే, దేశ ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నారు. బలమైన దేశాన్ని నిర్మించాలంటే, రాష్ట్రాలను బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, దేశ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రెండు జాతీయ పార్టీలు ఫెయిల్‌‌‌‌ అయ్యాయన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆలోచన, భావాజాలంలో తేడాలు ఉ న్నంత మాత్రాన, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం… రాష్ట్రాలను, ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కొన్నేండ్లుగా కాంగ్రెస్‌‌‌‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని వీక్‌‌‌‌ చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలకు అంశాల వారీగా మద్దతిచ్చిన తాము ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదే రీతిలో వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా… వాటి ఆచరణ మాత్రం అంతా రాష్ట్రాల్లో ఉంటుందని వెల్లడించారు. మేకిన్ ఇండియా అంటే దేశంలో పారిశ్రామిక రంగాన్ని బలపర్చే విధానమని, అందుకు కేంద్రానికి రాష్ట్రాల సహకారం తప్పని సరి అని గుర్తు చేశారు. పరిశ్రమల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల సహకారం వంటి అంశాలు కీలకమని చెప్పారు.

కేంద్రానికి నిధులు సమకూర్చుతుంది రాష్ట్రాలే…

రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సొంత నిధులు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌‌‌‌లో అన్నారు. ఆమె కామెంట్లను ఖండిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రాలు పన్నులు, ఇతర రూపాల్లో కేంద్రానికి నిధులు సమకూర్చుతున్న విషయాన్ని విస్మరించ కూడదన్నారు. తెలంగాణ నుంచి రూ. 2లక్షల 70 వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తే, రాష్ట్రానికి కేంద్రం కేవలం రూ.లక్షా 15 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఇంకా లక్షా  60 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని గుర్తు చేశారు. సీఏఏ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉందని అభిప్రాయపడ్డారు.  అందువల్లే పార్లమెంట్‌‌‌‌లో తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించిందని వివరించారు. గతంలో నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ మాటలపై విశ్వాసంతో రాష్ట్ర అసెంబ్లీలో కూడా నోట్ల రద్దుకు మద్దతుగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. కానీ ఇందుకు భిన్నంగా నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇబ్బంది కలిగించిందన్నారు. నీతిఅయోగ్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా.. ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్‌‌‌‌గా ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌‌‌‌స్పష్టం చేశారు. దేశానికి రెండో జాతీయ రాజధానిగా హైదరాబాద్ ప్రస్తావనకు వస్తే… ఇందుకు ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందన్నారు.

Latest Updates