కార్పోరేట్ ఆసుపత్రులపై ఐటీ దాడులు

విజయవాడ లో కార్పోరేట్ ఆసుపత్రులపై  ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్ల పై కొరడా ఎక్కు పెట్టారు. ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ ఆదాయపన్ను శాఖకు మాత్రం పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై నిఘా పెట్టిన అధికారులు.. మంగళవారం విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆకస్మిక దాడులు చేశారు.

ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ఆసుపత్రిలోని అన్ని ఫైల్స్ ను  క్షుణ్నంగా పరిశీలించారు అధికారులు. ఐటి రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కోట్ల రూపాయల్లో ఆదాయం ఉన్నప్పటికీ పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ అధికారులు పరిశీలనలో వెల్లడైనట్టు తెలుస్తుంది. ఉదయం నుండి పది మందికి పైగా ఐటీ అధికారులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగించారు. ముందు ముందు రిటర్న్స్ దాఖలు చేయని ఆసుపత్రుల్లో కూడా త్వరలో దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా అధికారుల దాడులతో కార్పోరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు, డాక్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Latest Updates