గడ్డ కట్టే చలిలో అత్యంత ఎత్తుపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన జవాన్లు

దేశ వ్యాప్తంగా 72 వ‌ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో  ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వెన్నెల త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. దేశ స‌రిహ‌ద్దులో కూడా గడ్డ క‌ట్టే చ‌లిని సైతం లెక్క చేయ‌కుండా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) సైనికులు మువ్వన్నెల‌ జెండాను ఎగుర‌వేశారు. లడఖ్ ప్రాంతంలో -25 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద జాతీయ జెండాను చేత పట్టుకుని వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐటీబీపీ త‌న అధికారిక ట్విట‌ర్ లో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ మంచులో సైనికుల ధైర్య సాహసాల‌ను కొనియాడుతున్నారు.

లడఖ్ వద్ద 17,000 ల అడుగుల‌ ఎత్తులో జెండాను ఎగుర‌వేసేందుకు చ‌లిని సైతం లెక్క చేయ‌కుండా.. మంచులో నిల‌బ‌డి భార‌త్ మాతా కి జై, వందే మాత‌రం అంటూ నినాదాలు చేశారు. ఐటీబీపీ ఈ వీడియోని షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్య‌లో వ్యూస్ , వంద‌ల సంఖ్య‌లో లైక్స్ , కామెంట్స్ వ‌చ్చాయి. సైనికుల ధైర్యాన్ని ప్ర‌శంసిస్తూ చాలా మంది జాతీయ జెండాతో తాము దిగిన ఫోటోల‌ను కామెంట్స్ తో జ‌త చేస్తూ వారికి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Latest Updates