న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ జోరు.. మళ్లీ జెసిండానే ప్రధాని

ఆక్లాండ్: న్యూజిలాండ్ సాధారణ ఎన్నికల్లో ఆ దేశ ప్రస్తుత ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కరోనా మహమ్మారిని ప్రభావవంతంగా ఎదుర్కోవడం ద్వారా జెసిండా తన విజయానికి బాటలు వేసుకున్నారు. 120 పార్లమెంట్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో జెసిండా నాయకత్వంలోని లేబర్ పార్టీ 49.2 శాతం ఓట్లతో 64 సీట్లను గెల్చుకుంది. దీంతో ప్రధాన మంత్రిగా జెసిండా రెండోసారి విజయం సాధించారు.

న్యూజిలాండ్‌‌లో 1996 నుంచి దామాషా ఓటింగ్ విధానాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరూ ఇంత మెజారిటీని సాధించకపోవడం గమనార్హం. తాజా గెలుపుతో సంస్కరణల ఎజెండాను జెసిండా కొనసాగించనున్నారు. ఫలితాల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేషనల్ పార్టీకి 35 సీట్లు మాత్రమే వచ్చాయి. గత 20 ఏళ్లలో ఆ పార్టీకి ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే మొదటిసారి అంటే ఎన్నికల్లో లేబర్ పార్టీ ప్రభంజనం ఎంతగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. లేబర్ పార్టీ ఘన విజయాన్ని ఆ పార్టీ మద్దతుదారులు ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. జెసిండా అద్భుతమైన నాయకత్వానికి దక్కిన విజయంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఆమెను ప్రశంసిస్తున్నారు.

Latest Updates