
ప్రాణం ముఖ్యమా.. దేశ రక్షణ ముఖ్యమా అని ఓ సైనికుడిని అడిగితే దేశానికే ఓటు వేస్తాడు..! గాయం పెద్దదా.. ఆట ముఖ్యమా.. అని మన క్రికెటర్లను అడిగితే.. ఆటకే ఓటు వేశారు..! అందుకే ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా గాయాలు ఇబ్బందిపెట్టినా.. ఏ క్రికెటర్ కూడా బరిలోకి దిగకుండా వెనుకంజ వేయలేదు..! మ్యాచ్ మధ్యలో తలకిందులయ్యే పరిస్థితులు ఎదురైనా.. గుండె ధైర్యాన్ని చూపెట్టడానికే సిద్ధమయ్యారు..! సిడ్నీ టెస్ట్‌లో జడేజా.. బ్రిస్బేన్‌లో నవ్‌దీప్ సైనీ చూపిన ఆ తెగువ, సాహసమే.. ఇండియాకు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని అందించింది..! అసలు సిడ్నీలో జడ్డూ గాయపడిన తర్వాత జరిగిన పరిణామాలు.. నొప్పితో బౌలింగ్ చేస్తావా? అని రహానె అడిగినప్పుడు సైనీ స్పందించిన తీరును వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం..!!
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ అడిలైడ్ అవమానం తర్వాత.. మిషన్ మెల్బోర్న్ను సూపర్ సక్సెస్ చేసిన టీమిండియాకు సిడ్నీలోనూ మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో టీమ్‌లోకి వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. సెకండ్ టెస్ట్‌లో అద్భుతంగా ఆడాడు. ఇక సిడ్నీ టెస్ట్‌లోనూ టీమ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవనుకుంటున్న తరుణంలో అతని గాయం తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే తన వల్ల టీమ్ ఓడిపోకూడదనే నిర్ణయానికి వచ్చిన జడేజా.. లాస్ట్ డే ఆటలో గాయంతోనే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆ టైమ్‌లో అతను తీసుకున్న నిర్ణయం, మానసిక పరిస్థితి గురించి జడ్డూ ఇలా చెప్పుకొచ్చాడు.
పంత్ ఔట్‌తో టెన్షన్ స్టార్ట్..
టీమ్ పరిస్థితి ఘోరంగా ఉండటంతో బరిలోకి దిగక తప్పదని భావించి నేను కూడా ప్యాడ్స్ కట్టుకున్నా. అప్పటికే నొప్పిని తగ్గించే ఇంజెక్షన్లు తీసుకోవడంతో కాస్త రిలీఫ్ అనిపించింది. కనీసం 10, 15 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే బెటరని అనుకున్నాను. ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలాంటి షాట్స్ ఆడాలి అనే దానిపై కూడా మానసికంగా ప్రిపేర్ అయ్యా. ఎందుకంటే నాకు అయిన గాయంతో భారీ షాట్లు ఆడటం అసాధ్యం. పేస్ బౌలర్లు బాల్స్ ఎక్కడ వేస్తారు, వాటిని ఎలా ఎదుర్యోవాలనే దానిపై కొన్ని అంచనాలు పెట్టుకున్నా. ఓవరాల్‌గా నా ప్లానింగ్‌లో నేను బిజీగా ఉండటంతో గాయం గురించి పెద్దగా ఆలోచన రాలేదు. ఇండియా గెలిచే మూమెంట్ ఉంటే కచ్చితంగా బరిలోకి దిగుతానని అంతకుముందే మేనేజ్మెంట్కు చెప్పా. వాళ్లు కూడా సరేనన్నా గాయం గురించి ఆలోచించారు. అయితే పుజారా, రిషబ్ బాగా ఆడుతుండటంతో నా అవసరం రాదనుకున్నారు. ఆల్మోస్ట్ సిడ్నీ టెస్ట్ గెలిచామనే అంచనాకు వచ్చేశాం. కానీ దురదృష్టం కొద్దీ పంత్ ఔట్‌కావడంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఇక అక్కడి నుంచి డ్రా కోసం పోరాటం స్టార్ట్ అయ్యింది.
అశ్విన్, విహారి సేవ్ చేశారు..
లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై పెద్దగా ఆశలు ఉండవు కాబట్టి ఓటమి తప్పదనుకున్నారు. కానీ అశ్విన్, విహారి ఆడిన తీరు సూపర్బ్. వీళ్లలో ఎవరు ఔటైనా నేను దిగాల్సిందే. లేకపోతే మ్యాచ్‌ను సేవ్ చేసుకోవడం కష్టమని తెలుసు. అందుకే నేను కూడా మెంటల్‌గా సిద్ధమయ్యా. ఏం జరిగినా ఆడటానికే మొగ్గు చూపా. అయితే నన్ను పంపించే విషయంలో మేనేజ్మెంట్ కాస్త ఆందోళనలో పడింది. గాయం తీవ్రత పెరిగితే కెరీర్‌కు ప్రమాతదమని భావించి ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. అయితే వాళ్లు చెప్పినా, చెప్పకపోయినా నేను మాత్రం కచ్చితంగా వెళ్లేవాడిని. అయితే లక్కీగా ఆ చాన్స్ నాకు ఇవ్వలేదు. విహారి, అశ్విన్ పోరాడిన తీరు.. టెస్ట్ క్రికెట్లో మరపురాని ఘట్టం. ఇదంతా టీమ్ ఎఫర్ట్. వాళ్లలో ఒక్కరు ఔటైనా.. టీమ్ కుప్పకూలుతుందని ఇద్దరికీ తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ఆడారు. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయి. వాటిని ఈ ఇద్దరు ఒడిసి పట్టేశారు. మ్యాచ్‌ను సేవ్ చేశారు.
ఫ్రాక్చర్ అని తెలియదు..
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బొటన వేలికి బాల్ తగిలినప్పుడు నొప్పి మాత్రమే అనిపించింది. వేలు ఫ్రాక్చర్ అయ్యిందని అనుకోలేదు. నొప్పిని కంట్రోలు చేసుకుంటూ బ్యాటింగ్ చేశా. టెయిలెండర్లతో కలిసి వీలైనన్ని రన్స్ చేయాలన్నదే నా ఆలోచన. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఫ్రాక్చర్ గురించి ఆలోచించలేదు. బాల్ తగిలితే నార్మల్‌గానే నొప్పి ఉంటుందని అనుకున్నా. కానీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి స్కానింగ్‌కు వెళ్లాకా అసలు విషయం తెలిసింది. బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యిందని రిపోర్ట్స్‌లో వచ్చింది. అయినప్పటికీ నా దృష్టి మొత్తం మ్యాచ్‌పైనే ఉంది. ఓడిపోయే పరిస్థితి వస్తే కచ్చితంగా బ్యాటింగ్ చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యా. అందుకు తగినట్లుగానే సిద్ధమవుతూ వచ్చా. కానీ లక్కీగా నాకు ఆడే
చాన్స్ రాలేదు.
ఎస్ చెప్పేశా: సైనీ
బ్రిస్బేన్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు గ్రోయిన్ ఇంజ్యురీ అయ్యింది. నొప్పితో నడవలేని పరిస్థితి ఉన్నా.. ఫిజియో సహకారంతో కాస్త కోలుకున్నా. అదే టైమ్‌లో అజింక్యా భయ్యా వచ్చి బౌలింగ్ చేస్తావా? అని అడిగాడు. నేను రెండో ఆలోచన లేకుండా ఎస్ చెప్పేశా. అప్పటికే గాయాలతో కీలక బౌలర్లందరూ దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో నేను కూడా బ్రేక్ తీసుకుంటే టీమ్ మొత్తానికే ఇబ్బంది అవుతుందని భావించా. మామూలుగానే మా ఎటాక్ బలహీనంగా ఉందని ఆస్ట్రేలియన్లు భావించారు. అందుకే ఏం జరిగినా బౌలింగ్ చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే మ్యాచ్ ఆడా. మ్యాచ్ ముందు వరకు నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ సడెన్‌గా ఇంజ్యురీ అయ్యింది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఇలా జరిగిందని కాసేపు బాధపడ్డా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది. అందుకే టీమ్ సపోర్ట్‌తో ఇంజ్యురీ ఉన్నా బౌలింగ్ చేయాలనుకున్నా. నొప్పి పెరిగితే మ్యాచ్ మొత్తానికే దూరమయ్యే చాన్స్ ఉంది. అది మరింత డేంజర్. కానీ రహానె అడిగేసరికి ఆగలేకపోయా. లాస్ట్ టెస్ట్‌లో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.
సిరాజ్.. బెస్ట్ టీమ్మేట్
గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. వీలైనంత త్వరగా ఫిట్నెస్ సాధిస్తా. అన్ని వికెట్లు నాకు ముఖ్యమే. అయితే ఫస్ట్ వికెట్‌ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఆసీస్‌లో ఆడిన ఎక్స్‌పీరియెన్స్ లేకపోయినా ఆటను బాగా ఆస్వాదించా. బౌన్స్ బౌలింగ్ బాగా అనిపించింది. టెస్ట్ క్రికెట్లో షార్ట్ బాల్స్ వేయడం చాలా నేచురల్. కానీ వాటితోనే మ్యాచ్‌ను ముగించలేం. ఓపిక, నిలకడగా ఒకే చానెల్లో బౌలింగ్ వేస్తేనే సక్సెస్ అవుతాం. ఆసీస్‌లో రాణిస్తే మెంటల్లీ బాగా స్ట్రాంగ్ అవుతాం. వేరే ఎక్కడ ఆడినా ఈ స్ఫూర్తి అలాగే కొనసాగుతుంది. టీమ్ మేనేజ్మెంట్, రోహిత్ భయ్యా చాలా సపోర్ట్‌గా నిలిచారు. రంజీల్లో ఎలా బౌలింగ్ వేశావో అలాగే వేయమని సలహా ఇచ్చారు. సిరాజ్ నా బెస్ట్ టీమ్మేట్. ఇండియా–ఎ తరఫున మేం ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడాం. బౌలింగ్ గురించే ఎక్కువగా మాట్లాడుతాం. పేస్ ఇంపార్టెంట్ అయినా లైన్ అండ్ లెంగ్త్ మీద కూడా దృష్టిపెట్టమని చెప్పాడు. సిరాజ్‌లో ధైర్యం ఎక్కువ. ఫాదర్ డెత్ తర్వాత కూడా టీమిండియా తరఫున అతను చేసిన పెర్ఫామెన్స్ సూపర్బ్. ఓ బస్ డ్రైవర్ కొడుకైన నేను ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుతాడని కలలో కూడా ఊహించలేదు.ఇదంతా నా అదృష్టం.