జగదీశ్ వర్సెస్ ఉత్తమ్..నువ్వేంది..నీ లెక్కేంది

నల్గొండ, వెలుగు:‘షరతుల ఎవుసం’పై నల్గొండలో జరిగిన ప్రభుత్వ సమావేశం రసాభాసగా మారింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి, పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇద్దరు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మంత్రి మాట్లాడుతుండగా.. ‘రుణమాఫీ ఎక్కడ చేశారు.. లెక్కలు చెప్పండి’ అని ఉత్తమ్ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య విమర్శలు మొదలయ్యాయి. సహనం కోల్పోయిన ఇద్దరు నేతలు ఒకానొక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్‍ ఆఫీసులో జరిగిన షరతుల సాగు సన్నాహక సమావేశంలో ఈ ఘటన జరిగింది. మంత్రి, పీసీసీ చీఫ్ మధ్య సాగిన వాగ్వాదం వారి మాటల్లోనే..

జగదీశ్: సర్, మీరు ఎందుకు వచ్చిండ్రో మాకు తెలుసు. సమాధానం చెప్పే శక్తి మాకు ఉంది. సప్పుడు చేయకుండా కూర్చోండి. లేదంటే బయటికి పోండి. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం అని మీ పార్టీ వాళ్లే అంటున్నరు. నేను అంటలేను. ఈ జిల్లాకు సంబంధించిన మీ ఎమ్మెల్యేలే అంటున్నరు. నేను కాదు.

ఉత్తమ్:  నువ్వు మంత్రి కావడంనల్గొండ జిల్లా దురదృష్టం.

జగదీశ్: అనవసరంగా ఎందుకు మాట్లడుతున్నవ్. రూ.17 వేల కోట్ల రుణ మాఫీ చేసిన విషయం లెక్కలతో పాటు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీరు మాట్లాడినప్పుడు నేను గౌరవంగా విన్నా. దేశంలో రూ.లక్ష వరకు వేల కోట్ల రుణ మాఫీ చేసింది తెలంగాణ సర్కారే. 60, 70 ఏళ్ల మీ పాలనలో దేశం, రాష్ర్టం వెనకబడి పోయినయ్. కనీసం రైతులకు మద్దతు ధర కల్పించలేదు. సోనియాగాంధీ, ఇందిరాగాంధీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్​లో కరెంట్​కు దిక్కులేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. మర్యాద తప్పి లేచి మాట్లాడింది మీరు. మధ్యలోకి వచ్చింది మీరు. మధ్యలో రాకండని ముందే చెప్పిన. మీరు మాట్లాడినంత సేపు నేను మధ్యలో రాలేదు. ‘దిసీజ్ నాట్ ఎ డిబేట్.. దిసీజ్ నాట్ ఎ అసెంబ్లీ.. దిసీజ్ నాట్ఎ పార్లమెంట్’. ఎస్.. నేనేం చెప్పదల్చుకున్ననో అదే చెప్త. ఐ హ్యావ్ ఎ రైట్. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ మధ్యలో. ఏయ్ ఆఫ్టర్ ఆల్ నువ్వేంది..? నీ లెక్కేంది..? ఎక్కువ మాట్లాడుతున్నావ్ నువ్వు. మధ్యలో ఎందుకు వచ్చినవ్. నువ్వు సీనియర్ లీడర్​వి. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినవ్. మంత్రిగా చేసినవ్. ఎంపీగా ఉన్నవ్. డయాస్ మీద మాట్లాడేటప్పుడు మధ్యలో లేవొచ్చా..? నువ్వు ఎందుకు అడుగుతున్నవ్​..? నన్ను అడిగే హక్కు నీకు లేదిక్కడ.

ఉత్తమ్: మేం బాగా చేసినం. కేసీఆర్ ఎంత చేసిండో కూడా అందరికి తెలుసు. రూ.2,500 కోట్లు రావాలి. మర్యాదగా మీరు కొనసాగించండి. డిబేట్ కాకపోతే దీన్ని ఏమంటారు? ఇక్కడ మేం ఎందుకు? నువ్వు ఎందుకు వచ్చినవ్ చెప్పు మధ్యలో? నీ లెక్కేంది? రుణమాఫీ అయ్యిందా అని అడిగినా.. ఎందుకు అడుగుతావ్ అంటే మరీ ఈ మీటింగ్ ఎందుకు?

జగదీశ్: మీడియా ఉందని డ్రామా చేస్తున్నవ్. ఎక్కువ మాట్లాడుతున్నావ్. మీడియా చూస్తంది. ప్రజలందరు చూస్తన్నరు. నీ గౌరవం ఏందో, నేను మాట్లాడిన పద్ధతి ఏందో, నీ పద్ధతి ఏందో ప్రజల్లోకి పోవాలి. చాలా అబద్ధాలు మాట్లాడినవ్. సీఎం అసెంబ్లీలో ప్రతి అక్షరం లెక్క ఇచ్చిండు. నేను ప్రిపేర్ కాలేదని పారిపోయింది తమరు. తమరు పారిపోయారనడానికి నేనే సాక్షిని.

ఉత్తమ్: మీడియా ముందు దొంగాట నీది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్. వాట్ ఈజ్ దిస్. వై డోంట్ యు కాల్ మి. ఇదేమన్నా మీ సొంత ఏరియానా? రుణ మాఫీ అయ్యిందా? నేనెక్కడ అసెంబ్లీ నుంచి పారిపోయా?మంత్రిగా మంచిగ బిహేవ్ చేయ్. అసెంబ్లీ లో రుణమాఫీ అయ్యిందా అని అడిగినా? ఎవరు పారిపోయిండ్రు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్ నువ్వు.

సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా..

జగదీశ్, ఉత్తమ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

షరతుల ఎవుసం.. కమీషన్ల కోసమే!

Latest Updates