లోక్ సభ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ పెడ్తం

అమరావతి, వెలుగు: ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడేండ్లలో రూ. 15,337 కోట్ల నిధులతో సర్కార్ దవాఖానాలను డెవలప్ చేస్తామన్నారు. అందుకోసం ‘నాడు నేడు’ పథకాన్నిరూపొందించామని, మూడేండ్ల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల ఇప్పటి ఫోటోలు, అభివృద్ధి చేసిన తర్వాతి ఫోటోలను చూపించి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన చోట కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మంగళవారం కర్నూలులో పర్యటించిన జగన్.. ఎస్టీబీసీ క్యాంపస్​లో వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభించి మాట్లాడారు. కంటి వెలుగు పథకంలో భాగంగా మార్చి 1 నుంచి 54 లక్షల మంది అవ్వ, తాతలకు కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించి గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే మందులు, కళ్లద్దాల పంపిణీ చేస్తామన్నారు.

40 వేల జీతమున్న ఉద్యోగులకూ ఆరోగ్యశ్రీ

రాష్ట్రంలో ప్రతి మండలానికో అంబులెన్స్, పూర్తి స్థాయి మందులు ఉండేలా పీహెచ్​సీలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్​సీల నిర్మాణం, అభివృద్ధికి రూ. 670.36 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. రూ.670.36 కోట్లతో 149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, 989 పీహెచ్‌సీల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నెలకు రూ.40 వేల జీతాలున్న ఉద్యోగులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. పిల్లల చదువుల ఖర్చులు, ఆస్పత్రులకు అయ్యే ఖర్చుల కారణంగానే పేద, మధ్య తరగతి వర్గాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని, విద్యా దీవెన, ఆరోగ్య శ్రీ పథకాల ద్వారా ఆ భారం ప్రభుత్వమే భరిస్తుందన్నారు

Latest Updates