మమత నోట ‘జై జగన్నాథ్’

ఇస్కాన్ రథయాత్రను ప్రారంభించిన బెంగాల్ సీఎం

కోల్ కతా: సమైక్యత, మత సామరస్యం పాటించాలని  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకు పిలుపునిచ్చారు. కోల్కతాలోని అతిపెద్ద ఇస్కాన్ రథయాత్రను గురువారం ఆమె ప్రారంభించారు. సహనం, సమైక్యతలే నిజమైన మతం అని అన్నారు. శాంతి, ఐక్యతలను ప్రతిఒక్కరూ స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక పూజల తర్వాత వేలాదిమంది భక్తుల నడుమ రథయాత్ర ప్రారంభమైంది. ఆల్పర్ట్ రోడ్ లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్ నుంచి జెండా ఊపి రథయాత్ర ప్రారంభించే ముందు మమతా బెనర్జీ.. జై జగన్నాథ్, జై హింద్, జై బంగ్లా నినాదాలు చేశారు. ఈ మధ్య జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినా స్పందించని దీదీ.. ఈ రథయాత్రలో ‘జై జగన్నాథ్’ నినాదం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

బెంగాల్ స్నేహానికి ప్రతీక: నుస్రత్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, భర్తతో కలిసి రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బెంగాల్లో కులం, మతం అనే తేడా లేకుండా అందరం కలిసి పండుగల్లో పాల్గొంటామని, బెంగాల్ స్నేహానికి ప్రతీక అని నుస్రత్ అన్నారు. అందరం కలిసి ముందుకెళ్లాలని, కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచిస్తూ.. ‘జై జగన్నాథ్’ నినాదం చేశారు. ముస్లిం రిలీజియన్ కు చెందిన బసిర్ హాట్ ఎంపీ నుస్రత్.. విదేశీయుడైన నిఖిల్ జైన్ ను ఈ మధ్యే పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత హిందూ ట్రెడిషన్ లో పార్లమెంట్ సమావేశాలకు హాజరవడం వివాదాస్పదమైంది. నమాజ్ చదివే నుస్రత్ జైన్ ను పెళ్లి చేసుకుని హిందువులా కనిపించడమేంటని ముస్లిం మత పెద్దలు ప్రశ్నించారు. దీనికి తగ్గట్టుగానే నుస్రత్ ‘తాను కుల, మత భేదాలు లేని ఇండియన్ ను’ అంటూ విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. కిందటేడాది ఇస్కాన్ రథయాత్రలోనూ పాల్గొన్న నుస్రత్ ఈ సారి పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest Updates