జయరాం హత్య కేసులో చార్జిషీట్..8మంది నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి సహా 8 మందిపై 388 పేజీలతో కూడిన ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. నాంపల్లి 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం దాఖలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మైలవరంలో జనవరి 31న జయరాం తన కారులో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు నందిగామ పోలీసుల నుంచి ట్రాన్స్ ఫర్ ఐన తరువాత జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కొనసాగిన కేసు దర్యాప్తులో మొత్తం78 మందిని స్పెషల్ టీమ్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పధకం ప్రకారమే జయరాంను హత్య చేసినట్లు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.

హనీ ట్రాప్ చేసి రాకేష్ రెడ్డి అతని అనుచరులతో కలిసి జయరాంను హత్య చేశాడని కోర్టుకు తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డికి సహకరించిన వారిపై కూడా అభియోగాలు పొందుపరిచారు. ఈ కేసులో పూర్తిగా సాంకేతిక ఆధారాలను సేకరించి కోర్టులో డిపాజిట్ చేశారు. హత్యకు ముందు, హత్య జరిగిన తరువాత రాకేష్ రెడ్డి, జయరామ్ కాల్ లిస్ట్ లో ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులు,రియల్టర్ల సాక్ష్యాలతో కూడిన 388 పేజీల ఛార్జిషీట్ రూపొందించారు. ఇందులో ఏపీ పోలీసుల విచారణలో వెలుగు చూసిన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబుల పాత్ర కూడా ఛార్జిషీట్ లో పేర్కొన్నట్లు తెలిసింది. హత్య జరిగిన తరువాత నిందితుడు రాకేష్ రెడ్డి ఈ ముగ్గురితో మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే డిపార్ట్ మెంట్ ఏసీపీ,ఇన్ స్పెక్టర్లపై వేటువేసింది.

8 మందితో పాటు బీఎన్ రెడ్డిపై చార్జిషీట్..

ఈ కేసులో రాకేష్ రెడ్డితో పాటు కారు డ్రైవర్ శ్రీనివాస్, సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, రౌడీ షీటర్ నగేష్ అతని అల్లుడు విశాల్, రియల్టర్లు అంజిరెడ్డి, సుభాష్ రెడ్డి పేర్లను నిందితులుగా చార్జిషీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఎనిమిది మందితో పాటు హైదరాబాద్ కు చెందిన కార్మిక సంఘం నాయకుడు బీఎన్ రెడ్డి పేరును కూడా ఛార్జిషీట్లో చేర్చారు. జయరాం హత్యకు రెండు రోజుల ముందు నుంచి రాకేష్ రెడ్డి ఇంటికి బీఎన్ రెడ్డి వెళ్లివచ్చాడని తమ దర్యాప్తులో హత్య కుట్రలో బీఎన్ రెడ్డికూడా పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. జనవరి 29, 30వ తేదీన రాకేష్ రెడ్డితో సంప్రదింపులు జరిగిన బీఎన్ రెడ్డిని సీసీ ఫుటేజిలు, కాల్ డేటా ఆధారంగా ఛార్జిషీట్ లో నిందితునిగా చేర్చినట్లు తెలిసింది. దీంతో బీఎన్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి.

సాక్షిగానే శిఖాచౌదరి..

మరోవైపు జయరాం హత్యలో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని ఛార్జిషీట్ లో సాక్షిగా చేర్చారు.

Latest Updates