డిజిటలైజేషన్ దిశగా జలమండలి

జలమండలి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై దృష్టి పెట్టింది. నగరప్రజల దాహార్తిని తీర్చే ఈ సంస్థ పరిధిలో ఉన్ననీటి సరఫరా వ్యవస్థ వివరాలను ఆధునీకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యం లోనగరంలో ఉన్న మంచినీటి, మురుగు నీటి పైపులైన్ల పొడవు, వాటి నిర్మాణం, మన్నిక వంటి అంశాలను పక్కాగా, సులభంగా తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ విధానాలను వినియోగించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన జీఐఎస్ విధానంతో అధ్యయనం చేయనుంది. ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన పైపులైన్ల వివరాలను తెలుసుకునేందుకు సర్వే చేయించే ప్రయత్నం జరిగినా అనివార్య కారణాలతో ఆగిపోయింది. దీనితో మరోసారి తాగు, మురుగు నీటి పైపులైన్ల పొడవు, నీటివనరులు, సరఫరా అయ్యేనీటి వివరాలు, ట్రీట్ మెంటు ప్లాంటులోకి చేరిన నీరెంత, ఏ స్థాయిలో శుద్ధీకరణ జరిగిందనే విషయాలను మరింత కచ్చితత్వంతో లెక్కించేలా సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం జలాశయం నుంచి నగరానికి వచ్చే పైపులైన్ల పొడవు, అక్కడి నుంచి ట్రీట్ మెంట్ ప్లాంట్ కు చేరిన నీరెంత, నీటి శుద్ధి తరవాత నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటి పరిమాణం వంటి వివరాలను మాన్యువల్ గా జలమండలి లెక్కిస్తుంది. అయితే ఇదంతా శాస్త్రీయంగా లేకపోవడంతో నీటి సరఫరాపై అధికారులకు పక్కాసమాచారం అందటం లేదు. దీంతో అత్యవసర పరిస్థితులలో నీటి సరఫరాపై స్థానిక అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే నీటి సరఫరా, వినియోగం, పైప్ లైన్ల పొడవు వంటి అంశాలతోపాటు ఏ సమయంలో, ఎంత పరిమాణంలో నీటి సరఫరా ఎక్కడి వరకు జరిగిన విషయాలను త్వరగా తెలుసుకునేందుకు జి.ఐ.ఎస్ మ్యాపింగ్ ను వినియోగించి పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసే దిశగా కార్యాచరణ రూపొందించింది. తొలుత గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న మంచినీటి పైపులైన్లను జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్సిస్టం ) విధానంతో క్యాప్చర్ చేసి సమగ్ర వివరాలతో కూడిన డాటాను సేకరిస్తారు. ఆ తర్వాత అందిన డిజిటల్ సమాచారం ఆధారంగా రియల్టైం వివరాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకునేసిద్ధం చేస్తుంది.

త్వరలో పూర్తి కానున్న జీఐఎస్ సర్వే..
తొలుత కొన్ని డివిజన్ల పరిధిలో జీ.ఐ.ఎస్ సర్వే ఆధారంగా సమాచారాన్ని సేకరించే పనిని జలమండలి నిర్విరామంగా చేస్తుంది. రామచంద్రాపురం, ఎల్బీనగర్, శేరిలింగం పల్లి, మల్కాజిగిరి, రాజేంద్ర నగర్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో దీని ఆధారంగా క్యాప్చర్ చేస్తూ డిజిటలైజేషన్ చేస్తుంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి ప్రాంతంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికాగా, సేకరించిన డాటాతో పైపులైన్ల పొడవు, వెడల్పు, నీటి సరఫరా, నీటి ప్రవాహ వేగంవంటి అంశాల పనితీరును పరిశీలిస్తుంది. ఇలా బోర్డులో నిర్వహణ పనితీరు సజావుగా, సులభంగా సాగిపోతుందనీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత నగరంలోని మురుగు నీటి పైపులైన్లను ఆధునీకరించేందుకు వినియోగిస్తున్నారనీ అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో మురుగు నీటి పైపు లైన్ల వ్యవస్థపై పక్కా సమాచారాన్ని సేకరించనుంది. దీంతో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా నిర్వహించేలా సమాచారాన్ని డిజిటైలే షన్చేయనుంది.

Latest Updates