వరల్డ్ కప్ ఫైనల్ టెన్షన్ కి కోచ్ మృతి

ఆక్లాండ్‌: వరల్డ్ కప్-2019 ఫైనల్ థ్రిల్లింగ్ గా జరిగిన విషయం తెలిసిందే. లాస్ట్ వరకు టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ మ్యాచ్ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్ కారణంగా ఓ ఇంట్లో విషాదం నింపింది. సూపర్ ఓవర్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఓ క్రికెట్ అభిమానికి గుండె ఆగిపోయింది. బాల్ టు బాల్ టెన్షన్ టెన్షన్ గా సాగిన ఈ మ్యాచ్ చూస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చిన ఓ వ్యక్తి మరణించాడు. ఆలస్యంగా తెలిసిన ఈ సంఘటన న్యూజిలాండ్ లో జరిగింది. న్యూజిలాండ్‌ ఆల్‌ రౌండర్‌ జేమ్స్ నీషమ్ జోరుగా ఇన్నింగ్స్‌  ఆడుతుండగా విషాదం జరిగిందని తెలిపారు మృతుడి ఫ్యామిలీ మెంబర్స్. మరణించిన ఆ వ్యక్తి నీషమ్  చిన్ననాటి కోచ్‌, ఆక్లాండ్‌ గ్రామర్‌ స్కూల్‌ మాజీ టీచర్‌ డేవిడ్‌ జేమ్స్‌ గొర్డాన్‌ అని తెలిపారు.

మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చే సూపర్‌ ఓవర్‌లో రెండో బాల్ ని నీషమ్‌ సిక్సర్‌ కొట్టిన సమయంలోనే జేమ్స్‌ గొర్డాన్‌ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ తెలిపారు.  ‘గొర్డాన్‌ తుదిశ్వాస విడిచారని సూపర్‌ ఓవర్‌ జరుగుతుండగా నర్స్‌ వచ్చి మాతో చెప్పారు. నీషమ్‌ సిక్సర్‌ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు. గొర్డాన్‌ మృతికి నీషమ్‌ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్‌ జేమ్స్‌ గొర్డాన్‌.. నా హైస్కూల్‌ టీచర్‌, కోచ్‌, స్నేహితుడు. క్రికెట్‌ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’  అంటూ నీషమ్‌ ట్వీట్‌ చేశాడు.