జమ్ములో ముగిసిన నేతల గృహ నిర్భందం

ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి గృహ నిర్భందంలో ఉంచిన రాజకీయ నేతలను జమ్ము కశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కేవలం జమ్ము పరిధిలోని రాజకీయ నేతలకు మాత్రమే స్వేచ్ఛ లభించింది. కశ్మీర్ ప్రాంతంలో ఉన్న నేతల గృహ నిర్భందం కొనసాగుతూనే ఉంది.

జమ్ములో పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చి, శాంతియుతంగా ఉండడంతో ఇక్కడి రాజకీయ నేతలందరిపై ఆంక్షలు ఎత్తేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తనకు పోలీసు అధికారులు స్వయంగా ఈ విషయం చెప్పారని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా బయట తిరగొచ్చని తెలిపారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేంద్ర రాణా వివరించారు.

దేవేంద్ర రాణా, రామన్ భల్లా, హర్షదేవ్ సింగ్, లాల్ సింగ్, వికార్ రసూల్, జావెద్ రాణా, సుర్జీత్ సింగ్ స్లతై, సజ్జద్ అహ్మద్ కిచ్లూ సహా పలువురు నేతలపై గృహ నిర్భందం ఎత్తేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లోయలో నిర్భందం కొనసాగింపు

అయితే కశ్మీర్ కు చెందిన నేతలు ఇంకా గృహ నిర్భందంలోనే ఉన్నారు. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా వందకు పైగా కశ్మీర్ నేతలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారిని తమ సొంత ఇళ్లలోనే బందీ చేశారు. ఈ చట్టం కింద ఎటువంటి విచారణ లేకుండానే ఆరు నెలల వరకు నిర్భందించవచ్చు.

Latest Updates