మన సోలాపూర్​ మస్తు స్లో

అలాట్​మెంట్​ స్టేజ్​లోనే జనగామ టెక్స్​టైల్​ పార్క్

119 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు
560 ఇండస్ట్రీస్‌లో 88 మాత్రమే కేటాయింపు
నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు

జనగామ, వెలుగు: ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని సోలాపూర్​ పోయిన వలస కార్మికులకు ఇక్కడే పని చూపేందుకు జనగామలో ఏర్పాటుచేస్తున్న టెక్స్​టైల్​ పార్క్​పనులు ఇంకా స్పీడందుకోవడం లేదు. 560 ఇండస్ట్రీస్ తో మరో సోలాపూర్ లా డెవలప్​చేసి, క్లాత్​తయారీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే చాన్స్​ ఉన్నప్పటికీ పనులు స్లోగా సాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఈ పార్క్​ కార్యరూపంలోకి వస్తుందని ఆశించినా పాలకులు, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పనులు పూర్తవలేదు. తాజాగా కరోనా తోడైంది. ప్రస్తుతం లాక్​డౌన్​ఆంక్షలు ఎత్తేసినందున టీఎస్​ఐఐసీ ఆధ్వర్యంలో పనులు స్పీడప్​ చేస్తే హైదరాబాద్​ టు వరంగల్​ ఇండస్ట్రీయల్​ కారిడార్​లో తొలి అంకం పూర్తవుతుంది. జనగామ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో లింగాల ఘన్​పూర్​మండలం కళ్లెం సమీపంలో టెక్స్​టైల్​ పార్క్​ నిర్మాణానికి గతేడాది పర్మిషన్​ వచ్చింది. టీఎస్​ఐఐసీ ఆధ్వర్యంలో గ్రామ శివారులోని 456 సర్వే నంబర్​లో 136 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని సేకరించారు. దేవాదుల కాల్వకు కొంత భూమి పోగా 119 ఎకరాలలో 560 ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 88 మంది ఎంటర్​ ప్రెన్యూర్ లకు ప్లాట్ల అలాట్​మెంట్​ జరిగింది. మిగిలిన వారంతా ఎదురుచూస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి..

నగామకు నేషనల్​హైవే, రైల్వే వంటి ట్రాన్స్​పోర్ట్​ఫెసిలిటీస్​ఉన్నా ఇండస్ర్టీయల్​గా వెనకబడింది. ఫలితంగా ఈ ప్రాంతవాసులు ఉద్యోగం, ఉపాధి కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ వలస వెళ్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొంత తగ్గినా మిగతా రోజుల్లో రైల్వే స్టేషన్ వలస కార్మికులతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. దీంతో జనగామలోనే ఇండస్ట్రీస్​ నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్​ చాలా ఏండ్లుగా ఉంది. గత కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలో కళ్లెం శివారులో  రూ.600 కోట్లతో కామోజీ టెక్స్​ టైల్​పార్క్ నిర్మాణానికి పనులు మొదలు పెట్టినా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణలోకి రాలేదు. తర్వాత రూ. 300 కోట్ల అంచనాతో ఇదే స్థలంలో సూర్యవంశీ స్పిన్నింగ్​ మిల్​ ఏర్పాటు జరిగినట్టే జరిగి చివరికి కార్యరూపం దాల్చలేదు. ముచ్చటగా మూడోసారి  టెక్స్​ టైల్​ పార్క్​ కోసం పనులు జరుగుతున్నాయి.

ఇంకా డీ మార్కింగ్ దగ్గరే..

పార్క్​​ పనులు ఆశించిన దానికన్నా స్లోగా నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్లాట్ల డీమార్కింగ్​ పూర్తి చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఒక్కో ప్లాట్​ 480 నుంచి 500 స్క్వేర్ మీటర్ల​ నిడివి ఉండేలా చూస్తున్నారు. ఇంటర్నల్​ రోడ్ల నిర్మాణానికి రూ 12.50 కోట్లు ఇటీవలే శాంక్షన్​ అయ్యాయి. ఈ నెలాఖరు వరకు పనులు స్టార్ట్​ అవుతాయని  ఆఫీసర్లు చెబుతున్నారు. ఇవి పూర్తి కాగానే పవర్​, వాటర్​ సప్లై, డ్రైనేజీల నిర్మాణం తదితర మౌలిక వసతులను కల్పించనున్నారు. కాగా, ఇప్పటి వరకు స్క్వేర్​ మీటర్​కు రూ.1600 చొప్పున 10 శాతం అమౌంట్​ఈఎండీ చెల్లించిన 88 మంది ఎంటర్​ప్రెన్యూర్లకు ప్లాట్ల అలాట్​మెంట్​ జరిగింది. వీరు మిగిలిన మొత్తం కూడా చెల్లించి రిజిస్ర్టేషన్​ చేసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. కరోనా కారణంగా కొత్తవారికి అలాట్​మెంట్, ఇదివరకే అలాట్​మెంట్​అయినవారికి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్​ పూర్తైతే సదరు ఇండస్ట్రీలకు సంబంధించిన కన్​స్ట్రక్షన్​లు స్టార్ట్​ కానున్నాయి.

సోలాపూర్​ వలస వెళ్లిన వారికి..

పెద్ద కంపెనీలకు వందలాది ఎకరాలు అప్పగిస్తే రిజల్ట్​ కనిపించడం లేదనుకున్న గవర్నమెంట్​ చిన్న చిన్న ఎంటర్​ప్రెన్యూర్​లను ప్రోత్సహించే పద్ధతిన ఇక్కడ టెక్స్​టైల్​పార్క్ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. తెలంగాణ ప్రాంతం నుంచి సోలాపూర్ కు వలస వెళ్లినవారిని తిరిగి రప్పించి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని ఆఫీసర్లు చెబుతున్నారు. అందులో భాగంగా సోలాపూర్​మైగ్రేటెడ్​ సొసైటీ సభ్యులకు ఇండస్ట్రీలను నెలకొల్పే అవకాశం కల్పిస్తున్నారు. సుమారు 560 మంది ఇక్కడ ఇండస్ట్రీస్​ ఏర్పాటు చేయనున్నారు. గత ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ఊపందుకుంటుందని అంచనా వేశారు. గతేడాది చివరలో ఆర్​డీడీ (రీజినల్​ డిప్యూటీ డైరెక్టర్)​ నేతృత్వంలో  ఫిజికల్​ వెరిఫికేషన్​కూడా కంప్లీట్​చేసి డీడీ(డిప్యూటీ డైరెక్టర్)కి నివేదిక అందించారు. ఇందుకు సంబంధించిన లే అవుట్​కు డీటీసీపీ అప్రూవల్​ కూడా అప్పట్లోనే వచ్చేసింది.

20 వేల మందికి ఉపాధి

టెక్స్ టైల్​పార్క్ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికిపైగా ఉపాధి దొరకనుంది. ఇక్కడ ఏర్పాటయ్యే 560 ఇండస్ట్రీస్​లో క్లాత్​ తయారు చేస్తారు. ఒక్కో ఇండస్ట్రీలో 20‌ ‌మంది వరకు ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేసే చాన్స్ ఉంటుంది. పరోక్షంగా వివిధ పనుల కోసం వేలమంది అవసరమవుతారు. వీరిపై ఆధారపడి పరిసర ప్రాంతాల్లో పలు రకాల బిజినెస్​లు వెలిసి మరింత మంది ఉపాధి పొందనున్నారు. దీంతో పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

For More News..

బ్యాన్​ చేసిన​ చైనా యాప్స్​ను అమ్మాల్సిందే!

ముంబైని ఆపతరమా! ఐదో టైటిల్‌‌పై రోహిత్‌ సేన దృష్టి..

లంచం కోసం పక్కా స్కెచ్

Latest Updates