జయహో జనతా.. కర్ఫ్యూ దేశమంతా సక్సెస్

ఇది తొలి అడుగు

కరోనా వైరస్‌‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం తరఫున కృతజ్ఞతలు కలిసిముందుకు నడిస్తే ఎటువంటి చాలెంజ్​ నైనా ఓడిస్తామని దేశ ప్రజలు నిరూపించారు. కర్ఫ్యూ ముగిసినా.. ఇది మనం సంబరాలు చేసుకునే సమయం కాదు. ఇది సక్సెస్​గా భావించవద్దు. సుదీర్ఘ పోరాటంలో తొలి అడుగు మాత్రమే. ఇదే పోరాటం కొనసాగిద్దాం.

– ట్విట్టర్​లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ మరింత విస్తరించకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూ సూపర్​ సక్సెస్​ అయ్యింది. ఆదివారం దేశం మొత్తం స్తంభించిపోయింది. కోట్లాది మంది జనం ఇండ్లకే పరిమితమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకుని మారుమూల గల్లీ వరకూ ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లపై ఒకటి అరా మాత్రమే వెహికల్స్​ కనిపించగా.. పోలీసులు తప్ప జనం చాలా తక్కువగా కనిపించారు. బడా షాపింగ్​ మాల్స్, సినిమా హాల్స్, రిటైల్​ మార్కెట్లతో పాటు వీధి చివర ఉండే చిన్న కిరాణా షాపులు, పాన్​ డబ్బాలు కూడా మూతపడ్డాయి. జనం కూడా బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడలేదు. పూర్తిగా ఇంట్లోనే ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువ శాతం మంది మొగ్గు చూపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్​ సర్వీసులు, మెడికల్​ షాపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఢిల్లీ: జనతా కర్ఫ్యూ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రజలు స్వీయ నిర్బంధంలోని వెళ్లిపోయారు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను బంద్‌‌ చేశారు. ఎమర్జెన్సీకి ఉపయోగపడేలా కొన్ని బస్సులను మాత్రమే నడిపారు. టూరిస్టు స్పాట్‌‌లు కూడా మూతపడ్డాయి.

కాశ్మీర్‌‌‌‌:కాశ్మీర్‌‌‌‌లో జనతా కర్ఫ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. గత నాలుగు రోజుల నుంచి లోయలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌‌డౌన్‌‌ కొనసాగుతున్నప్పటికీ ఆదివారం అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ పాటించారు.

పశ్చిమబెంగాల్‌‌: జనతా కర్ఫ్యూతో వెస్ట్‌‌బెంగాల్‌‌లోని అన్ని సిటీలు, ఊళ్లు లాక్‌‌డౌన్‌‌ అయ్యాయి. బస్సులు, ట్రైన్లు క్యాన్సిల్‌‌ అయ్యాయి. ఎప్పుడూ రద్దీగా కనిపించే డల్‌‌హౌసీ, ఎస్‌‌ప్లాండే, కోల్​కతాలోని హౌరా బ్రిడ్జి ఖాళీగా కనిపించాయి.

మధ్యప్రదేశ్‌‌:మధ్యప్రదేశ్‌‌లోని అన్ని పార్కులు, స్టేడియాలు, పబ్లిక్‌‌ గ్రౌండ్స్‌‌ ఖాళీగా కనిపించాయి. వాకింగ్‌‌, జాగింగ్‌‌ చేసే వాళ్లు, క్రికెట్‌‌ ఆడుకునే పిల్లలతో ఆదివారం నిండుగా కనిపించే స్టేడియాల్లో చీమ కూడాకనిపించలేదు. భోపాల్‌‌ తదితర సిటీల్లో కూడా రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.

మహారాష్ట్ర:ముంబైలో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. ఎప్పుడూ రద్దీగా కనిపించే సబ్‌‌ అర్బన్‌‌ ట్రైన్‌‌ స్టేషన్స్‌‌లో జనం ఎవరూ లేరు. ముంబైలో పరిస్థితి దారుణంగా ఉండటంలో రైల్వే అధికారులు రైళ్లను క్యాన్సిల్‌‌ చేశారు. 477 సబ్‌‌అర్బన్‌‌ రైళ్లు క్యాన్సిల్‌‌ అయ్యాయి. మాల్స్‌‌, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు మూతపడ్డాయి.

గుజరాత్‌‌: రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్‌‌, సూరత్‌‌, వడోదర, రాజ్‌‌కోట్‌‌ తదితర ప్రాంతాలన్నీ నిర్మాన్యుష్యంగా మారిపోయాయి. జనతా కర్ఫ్యూని పాటించేందుకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

గోవా:గోవాలోని బీచ్‌‌లు, రెస్టార్టెంట్లు, బార్లను మూసేశారు. దీంతో నిత్యం టూరిస్టులతో కళకళాడే గోవా బీచ్‌‌లు, రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాను కూడా మూసేశారు.

తమిళనాడు: రా ప్రజలంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. దీంతో నిత్యం రద్దీగా కనిపించే లోకల్‌‌ ట్రైన్స్‌‌ ఖాళీగా దర్శనమిచ్చాయి.“అమ్మ క్యాంటిన్లు” మాత్రం ఓపెన్‌‌లోనే ఉన్నాయి.

ఒడిశా:ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 5 జిల్లాలు, 8 పట్టణాల్లో లాక్‌‌డౌన్‌‌ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.

కర్నాటక: అత్యంత రద్దీ ప్రాంతమైన బెంగళూరు ఆదివారం ఖాళీగా కనిపించింది. షాపింగ్‌‌ మాల్స్‌‌, రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి. మెట్రో, బస్సు సేవలనూ నిలిపేశారు. బోర్డర్‌‌‌‌లన్నీ క్లోజ్‌‌ చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

కేరళ: జనతా కర్ఫ్యూకి కేరళ సర్కార్‌‌‌‌ సపోర్ట్‌‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిధిలోని అన్ని బస్సు, రైలు సర్వీసులు బంద్‌‌ అయ్యాయి. ఆర్టీసీ డిపోలు, తదితర ప్రాంతాలను క్లీన్‌‌ చేశారు. రోడ్లపై తిరుగుతున్న వారికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌‌: మార్కెట్లు మూతపడ్డాయి. జనతా కర్ఫ్యూలో స్వచ్చంధంగా పాల్గొన్న జనాలు మార్నింగ్‌‌ వాక్‌‌ కోసం కూడా బయటకు రాలేదు.

పంజాబ్‌‌, హర్యానా, చండీగఢ్‌‌: పంజాబ్‌‌, హర్యానా రాష్ట్రాలు పూర్తిగా షట్‌‌డౌన్‌‌ అయ్యాయి. జనతా కర్ఫ్యూలో పాల్గొన్న జనం ఇళ్లకే పరిమితమయ్యారు. తెల్లవారుజాము నుంచే రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.

పుద్దుచ్చేరి: పుద్దుచ్చేరిలో ‘జనతా కర్ఫ్యూ’ప్రభావం బాగా కనిపించింది. అన్ని టూరిస్టు ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, బీచ్‌‌లు క్లోజ్‌‌ అయ్యాయి.

అస్సాం: ప్రజలు ఆదివారం ఉదయం నుంచే స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్నారు. . కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు శనివారం రాత్రి నుంచే కర్ఫ్యూ పాటిస్తున్నారు.

మేఘాలయ: పూర్తిగా లాక్‌‌డౌన్‌‌ అయింది. చర్చిలు, ఆలయాలు క్లోజ్‌‌ అయ్యాయి. మార్కెట్లు కూడా మూత పడ్డాయి. జనం ఎవరూ బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.

నాగాలాండ్‌‌: జనతా కర్ఫ్యూను వల్ల రాష్ట్ర ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఆదివారం ప్రార్థనలకు  చాలా తక్కువ మంది వచ్చారు.

14 గంటల కర్ఫ్యూ

కరోనా విస్తరించకుండా సోషల్ డిస్టెన్స్​ లో భాగంగా కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ 14 గంటల జనతా కర్ఫ్యూను ప్రకటించారు. రాష్ట్రం సహా కొన్ని రాష్ట్రాల్లో 24 గంటల కర్ఫ్యూను అమలు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ మొదలు కాగా.. ఉదయం నుంచే అన్ని మార్కెట్లు, పెద్ద పెద్ద కంపెనీలు, మాల్స్ పూర్తిగా మూసేశారు. టూరిస్టు స్పాట్స్, ప్రముఖ ఆలయాలు, పార్కులు, సినిమా హాల్స్​ కూడా బందయ్యాయి. కర్ఫ్యూ ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు మోడీ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టారు. ‘‘మరికొద్ది నిమిషాల్లో జనతా కర్ఫ్యూ మొదలవుతుంది. అంతా భాగస్వాములు అవుదాం. ఇది కరోనా మహమ్మారిపై పోరాటానికి గొప్ప స్ఫూర్తినిస్తుంది”అని పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరైన టైం మనకు సహాయపడతాయని చెప్పారు.

బండి కదలలేదు

శనివారం రాత్రి నుంచి దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఒక్క రైలు కదలలేదు. శనివారం రాత్రి నుంచి అదివారం రాత్రి 10 గంటల వరకూ అన్ని మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే లోకల్ ట్రైన్లను మాత్రం చాలా తక్కువ సంఖ్యలో నడిచాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలో మెట్రో సర్వీసులను ఆదివారం పూర్తిగా రద్దు చేశారు. ఇక అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను
కూడా పూర్తిగా ఆపేశారు. ఇప్పటికే విదేశీ సర్వీసులను ఆపేసిన ఎయిర్ లైన్స్ కంపెనీలు.. ఆదివారం డొమెస్టిక్ సర్వీసులను సైతం
నిలిపేశాయి. గోఎయిర్, ఇండియో, విస్తారా ఆదివారం డొమెస్టిక్ సర్వీసులను ఆపేశాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను నిలిపేసినట్టు చెప్పారు.

For More News..

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం

Latest Updates