‘జనతా జనార్దన్’కు సడన్ బ్రేక్?

హైదరాబాద్, వెలుగు: జనతా జనార్దన్ పేరుతో సీఎస్ ఎస్​కే జోషి రూపొందిస్తున్న మొబైల్ అప్లికేషన్​కు బ్రేకులు పడ్డాయి. 6 నెలల శ్రమ వృథా అయింది. పౌర సేవలు మరింత సులభతరం చేసేందుకు త్వరలో  యాప్ ను తీసుకొస్తున్నట్టు జోషి ఈనెల 22న ట్వీట్ చేశారు. ఆ తర్వాతి రోజు యాప్ పై వివిధ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. యాప్ రూపకల్పనపై వారి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశారు.

సీఎం సీరియస్.. సీన్ రివర్స్

యాప్ రూపకల్పనపై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని అడిగితే ఆయన పలు అసక్తికర విషయాలు చెప్పారు. యాప్ విషయంలో సీఎం గుర్రుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్ కు తెలియకుండానే సీఎస్ సొంత నిర్ణయం తీసుకున్నారని, అందుకే అది మధ్యలోనే ఆగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ యాప్ తయారు చేసినా.. సీఎం ఆఫీసు నుంచి మీడియాకు నోట్ రావాలి కదా? అని ప్రశ్నించారు. సీఎస్ స్వయంగా ట్వీట్ చేసి పొరపాటు చేశారని అభిప్రాయపడ్డారు.

పేరుపై అభ్యంతరం?

యాప్ తయారీపై సీఎం అనుకూలంగానే ఉన్నా.. పేరుపై అసహనం వ్యక్తం చేసినట్టు మరో అధికారి చెప్పారు. జనతా జనార్దన్ అనే పేరు కేసీఆర్ కు నచ్చేలా లేదని తెలిపారు. యాప్ తయారీ, పేరుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. యాప్ ఆగిపోయిందని చెప్పలేమని, మరో పేరుతో రావొచ్చని అభిప్రాయపడ్డారు.

Latest Updates