తండ్రి టెర్రరిస్ట్ అయితే పిల్లలది తప్పా?

తండ్రి టెర్రరిస్ట్ అయితే పిల్లలది తప్పా?

శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కొడుకులను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరితోపాటు మరో 9 మందిని హవాలా ద్వారా డబ్బులు సేకరించి టెర్రరిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో జాబ్స్ నుంచి తీసేశారు. ఈ విషయంపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించారు. సలాహుద్దీన్ కుమారులు చేసిన తప్పేంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తండ్రి చేసిన పనులకు పిల్లలను దండిస్తే ఎలా అని ప్రశ్నించారు. 

‘ఓ తండ్రి చేసే పనులు, చర్యలకు అతడి కొడులను హింసించడం సరైందేనా? ఎలాంటి విచారణ జరపకుండా వారిని ఉద్యోగాల నుంచి ఎలా తొలగిస్తారు? నేను పదే పదే చెబుతున్నా.. మీరు మనుషులను పట్టుకోగలరేమో, బంధించగలరేమో కానీ వారి ఆలోచనలు, సిద్ధాంతాలను ఏమీ చేయలేరు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అసమ్మతిని నేరంగా చూపే చర్యలు మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయి. ఈ సమయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయిని గుర్తు చేసుకోవాలి.. మనం మన స్నేహితులను మార్చగలమేమో కానీ మన పొరుగు వారిని కాదు అని వాజ్‌పేయి ఎప్పుడూ చెబుతుండేవారు. జమ్మూ కశ్మీర్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తూనే ఉంది’ అని మెహబూబా పేర్కొన్నారు.