అట్ల కాదు.. గిట్ల చేయుండ్రి

జనగామ, వెలుగు: మీకు జెప్పుడే కాదు.. నేను జేసి చూపిస్త సూడుండ్రి అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మోరీలు సాఫ్​ చేసిండు.. చెత్త ఎత్తిపోసిండు. మున్సిపల్​ ఎన్నికల్ల టికెట్​ఆశించే లీడర్లకు ఆయన మోరీలు.. చెత్త సాఫ్​ చేసే పోటీ పెట్టిన విషయం తెలిసిందే. పనులు ఎట్ల అయితున్నయో సూడడానికి ఎమ్మెల్యే శనివారం పట్టణంలోని 6, 7 వ వార్డుల్లో కలియ తిరిగిండు. ఆయన అనుకున్నట్టుగా పనులు జరగకపోవడంతో గిట్ల గాదు.. ఇగో గీ లెక్కన జేయండ్రి అంటూ జేసి చూపించిండు. అవ్వలక్కలను పనులెట్లున్నయ్​ అని ఆరా తీసిండు. ఓ పెద్దవ్వ శాన మంచి పని జేపిస్తున్నవ్​ బిడ్డా అని అనడంతో ఎంటనే గా అవ్వ కాళ్లు మొక్కిండు.. మీ అసోంటోళ్ల దీవెన్లుంటే ఇంక మంచిగ పనిజేత్త అని అన్నడు.

పనిమంతులనే ఎన్నుకోవాలే..

మంచి లీడర్లను కౌన్సిలర్​ లుగా ఎన్నుకునే బాధ్యతను ప్రజల పైనే పెడుతున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే లీడర్లెవరో స్వచ్ఛత పనుల ఆధారంగా తేల్చనున్నట్లు తెలిపారు. ఎవరో చెబితే నమ్మేది లేదని.. స్వయంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపిక పై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. 6, 7 వార్డులలో పర్యటన సందర్భంగా పలువురు కాలనీల సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. అందరూ మోరీలు ఎత్తుత లేరని అంటున్నారన్నారు. విషయం లీడర్లకు తెల్వాలని గీ పోటీ పెట్టినట్లు తెలిపారు. దీంతో జనగామ క్లీన్​ అయితది.. జనాలకూ ఎవరు పనిమంతులో తెలిసి పోతదని అన్నారు. తమ పార్టీ తరఫున సరైనోళ్లను ఎంపిక జేస్తమని.. వారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలన్నారు. గెల్చినంక కూడా వెంటబడి పని చేయించుకోవచ్చునని దానికి తనదే బాధ్యత అన్నారు.

 

Latest Updates