ఒలింపిక్స్ వాయిదా భారంపై జపాన్‌‌, ఐఓసీ మధ్య రగడ

టోక్యో:కరోనా మహమ్మారి దెబ్బకు టోక్యో ఒలింపిక్స్‌‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే ఈ పోస్ట్‌‌పోన్‌‌ వల్ల వచ్చే ఎక్స్​ట్రా ఖర్చుల అంశంలో జపాన్‌‌ ప్రభుత్వం, ఇంటర్నేషనల్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ(ఐఓసీ) మధ్య అగ్గిరాజుకుంటుంది. అదనపు ఖర్చులకు సంబంధించి ఐఓసీ చేస్తున్న ప్రచారాన్ని జపాన్‌‌ మంగళవారం తప్పుబట్టింది. పోస్ట్‌‌పోన్‌‌ వల్ల అయ్యే అదనపు ఖర్చుల్లో ఎక్కువ భాగాన్ని తామే భరిస్తామని  జపాన్‌‌ ప్రధాని షింజో అబే చెప్పినట్టు ఐఓసీ తన వెబ్‌‌సైట్‌‌లో పెట్టింది. ఆ సమాచారాన్ని వెంటనే తొలిగించాలని టోక్యో గేమ్స్‌‌ నిర్వాహకులు ఐఓసీని కోరారు. అంతేకాక అదనపు ఖర్చులకు సంబంధించి తమ ప్రధాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌‌ కోసం జపాన్‌‌  అధికారికంగా12.6 బిలియన్‌‌ డాలర్ల వరకు ఖర్చు చేస్తోంది. వాస్తవంలో ఇది ఇంకా ఎక్కు వఉంటుందని  ఫస్ట్‌‌ నుంచి చెబుతున్నారు. ఇప్పుడు గేమ్స్‌‌ వాయిదా పడడం వల్ల దాదాపు ఆరు బిలియన్‌‌ డాలర్లు అదనంగా ఖర్చు అయ్యే అవకాశముంది. దీనిని ఎవరు భరిస్తారనే దానిపై ఇటు ఐఓసీ, అటు టోక్యో ఆర్గనైజర్స్‌‌ వేర్వేరు వాదనలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం గేమ్స్‌‌ వాయిదా పడినా ఆ ఖర్చులతో తమకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారం జపాన్‌‌ తన వాటా మొత్తాన్ని భరించాల్సిందేనని ఐఓసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

జపాన్‌‌ ప్రధాని కూడా ఇందుకు ఒప్పుకున్నారని అందులో చెప్పింది. పది రోజుల క్రితం  ఓ ఇంటర్వ్యూలో ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్‌‌ బాచ్‌‌ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే జపాన్‌‌ ప్రధాని పేరు మాత్రం బాచ్‌‌ ప్రస్తావించలేదు. కానీ పోస్ట్‌‌పోన్‌‌ వల్ల అయ్యే అదనపు ఖర్చులకు సంబంధించి ఒప్పందంలో ఎలాంటి ప్రస్తావన లేదని ప్రధాని షింజో అబే,  ప్రతినిధి యొషిహిదే సుగా మంగళవారం చెప్పారు. 2013లో  ఒలింపిక్స్‌‌ ఆతిథ్య హక్కుల కోసం చేసుకున్న ఒప్పందం ప్రకారం టోక్యో సిటీ, జపాన్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ, స్థానిక నిర్వాహకులు గేమ్స్‌‌ నిర్వహణ ఖర్చుల్లో అధిక భాగాన్ని భరించాల్సి ఉంటుంది. గేమ్స్‌‌ పోస్ట్‌‌పోన్‌‌ కావడంతో తమపై పెద్ద మొత్తంలో ఆర్థిక భారం పడనుందని టోక్యో ఆర్గనైజర్స్‌‌తో ఇటీవల జరిగిన మీటింగ్‌‌లో ఐఓసీ అధికారి జాన్‌‌ కోట్స్‌‌ తెలిపారు. అయితే ఐఓసీ కష్టాల్లో ఉన్న నేషనల్‌‌ ఒలింపిక్‌‌ కమిటీలకు, ఇంటర్నేషనల్‌‌ ఫెడరేషన్స్‌‌కు మాత్రమే ఆర్థిక సాయం చేస్తుందని టోక్యోకు ఎలాంటి చెల్లింపులు చేయదని కోట్స్‌‌ స్పష్టం చేశారు. ఈ అదనపు ఖర్చుల వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి..

Latest Updates