నాకొక గర్ల్‌‌ఫ్రెండ్‌‌ కావలెను.. బిలియనీర్ బంపర్‌ ఆఫర్‌

  • అప్లికేషన్‌కు చివరి తేదీ జనవరి 17
  • జపాన్‌ కుబేరుడు యుసాకు సంచలన ప్రకటన
  • చంద్రునిపైకి కలిసి పోయొద్దమని బంపర్‌ ఆఫర్‌

జపాన్‌‌ బిలియనీర్‌‌ యుసాకు మేజావా (44) సంచలన ప్రకటన చేశారు. ఆయనకో ప్రేయసి కావాలని ఆన్‌‌లైన్‌‌లో ప్రకటించారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న ఒంటరి మహిళలు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. సెలెక్టయిన అమ్మాయి తనతో పాటు స్పేస్‌‌ ఎక్స్ రాకెట్‌‌లో చంద్రుని చుట్టూ తిరిగే బంపర్‌‌ ఆఫర్‌‌ కూడా కొట్టేయొచ్చన్నారు. ఇద్దరు మహిళలతో ఇప్పటికే ముగ్గురు పిల్లలున్న యుసాకు ఇటీవల జపాన్ నటితో విడిపోయారు. ఇప్పటివరకు తాను అనుకున్నట్టే జీవించానన్న యుసాకు.. ఇప్పుడు ఈ మధ్య వయసులో ఒంటరితనంతో బాధపడుతున్నానని, వెలితి వేధిస్తోందని, తనకో తోడు కావాలని, తద్వారా జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్‌‌ చేయాలనుకుంటున్నాని చెప్పారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌‌ ఖాతాలోనూ పోస్టు చేశారు. ‘చంద్రునిపై ప్రయాణించే తొలి మహిళ మీరే ఎందుకు కాకూడదు?’ అని ట్వీట్‌‌ చేశారు. ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చని, మార్చి చివరి నాటికి ఎంపిక పూర్తవుతుందని చెప్పారు. ఎలాన్‌‌ మస్క్‌‌ స్పేస్‌‌ ఎక్స్‌‌ రాకెట్‌‌లో 2023లో చంద్రునిపైకి యుసాకు వెళ్లి రానున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఆర్టిస్టులను ట్రిప్‌‌కు తీసుకెళ్తున్నారు. చంద్రునిపై ల్యాండవకుండా ఒకసారి చుట్టి తిరిగి వచ్చేస్తారు. తన ఆన్‌‌లైన్ ఫ్యాషన్ కంపెనీ ‘జోజో’ను గతేడాది యాహూకు యుసాకు అమ్మేశారు. ఇటీవల తన ట్విటర్‌‌ ఫాలోవర్లకు రూ. 64.36 కోట్లు ప్రకటించి యుసాకు వార్తల్లో నిలిచారు.

Latest Updates