యువతి తల్లిపై కాల్పులు జరిపిన  జవాన్ సూసైడ్

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన

అమరావతి, వెలుగు: ఏపీలోని గుంటూరు జిల్లాలో ప్రేమించిన యువతి తల్లిపై కాల్పులకు పాల్పడ్డ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున తాడేపల్లి పరిధిలోని కొలనుకొండ రైల్వేస్టేషన్ దగ్గరలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన బాలాజీ జమ్మూకాశ్మీర్ రెజిమెంట్ లో పని చేసేవాడు. చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఉంటున్న రమాదేవి కూతురిని ప్రేమించాడు.  యువతి ఒప్పుకోకపోవడంతో ఆమె తల్లి వద్దకు వెళ్లి పెళ్లి చేయాలని అడిగాడు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోని రమాదేవి బాలాజీపై కేసు పెట్టింది. దీంతో ఉద్యోగం కోల్పోయిన బాలాజీ కక్ష పెంచుకున్నాడు. శనివారం పొద్దున ఆమె ఇంటికి వెళ్లి నాటు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్ చెవిని చీల్చుకుంటూ వెళ్లడంతో రమాదేవి ప్రాణాలతో బయటపడింది. కాల్పుల తర్వాత బాలాజీ పరారయ్యాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి బాలాజీ సూసైడ్ చేసుకున్నాడు. తన కొడుకుది సూసైడ్ కాదని, యవతి తల్లి రమాదేవి, బంధువులే హత్య చేయించి ఉంటారని బాలాజీ తండ్రి ఆరోపించారు. గతంలో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధించారని అన్నారు.

Latest Updates