జయశంకర్ సార్ పేరిట పార్క్​ ఇంకెప్పుడు?

వరంగల్‍ రూరల్‍, వెలుగు: అది 2011 జూన్‍ 22.. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు. ముందురోజు జయశంకర్‍ సార్‍ మరణించడంతో అభిమానులకు కడసారిచూపు దక్కేందుకు ఇదే పార్కులో ఆయన పార్ధివదేహాన్ని అందుబాటులో ఉంచారు. టీఆర్‍ఎస్‍ అధ్యక్షుడు కేసీఆర్‍ పార్కు దగ్గరకు వచ్చి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సార్‍ను రాబోయే తరాలు గుర్తుంచుకోడానికి ఆయన పేరుతో ఓ స్మృతివనం ఉండాలని చెప్పారు. స్వరాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో దానికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. ఆపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అప్పట్లో నాయకులు చెప్పిన మాటలు ఏళ్లు గడుస్తున్నా చేతల్లో మాత్రం చూపడం లేదు.

స్వరాష్ట్ర ఏర్పాటే అంతిమ లక్ష్యంగా ఉద్యమ భావాజాలాన్ని కోట్లాది జనాల గొంతుల్లోకి తీసుకెళ్లిన సిద్ధాంతకర్త. తొలి, మలి విడత ఉద్యమాలకు వారధిగా నిలిచిన తెలంగాణ జాతిపిత. తెలంగాణ మొత్తంతో సార్‍ అని గౌరవంగా పిలిపించుకున్న వ్యక్తి ప్రొఫెసర్‍ జయశంకర్‍. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల సాకారం కాకుండానే ఆయన కన్నుమూశారు. ఆయనను యాదికి ఉంచుకోవడంలో భాగంగా చేపట్టిన పనులు మాత్రం సార్‍ అభిమానులను అవహేళన చేస్తున్నాయి. 2017లో రాష్ట్ర మున్సిపల్‍శాఖ మంత్రిగా కేటీఆర్‍ సిటీలో పర్యటించారు. జయశంకర్‍ స్మృతివనం పనులకు శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల పైచిలుకు నిధులతో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటిదశలో రూ.1.7 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రేటర్‍ కార్పొరేషన్‍తో పాటు కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీకి పనుల పర్యవేక్షణ అప్పజెప్పారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేసి సార్‍ పేరుతో ఉన్న పార్కును సుందరంగా మార్చనున్నట్లు చెప్పారు. మధ్యలో ఎన్నో రివ్యూలు.. మరెన్నో డెడ్‍లైన్లు.. అయినా పనులు పూర్తి కావడం లేదు.

చెత్తచెదారం.. మందు బాటిళ్లు

గతంలో నగరంలో పచ్చదనంతో ఉన్న ఏకశిల పార్కును స్మృతివనం పేరుతో మొత్తం తొలగించారు. చిన్నపాటి సమావేశాలకు వేదికగా ఉండే బిల్డింగును కూల్చివేశారు. కేటీఆర్‍ ఈ పనులను ప్రారంభించిన ఈ మూడేళ్లల్లో.. ఎంట్రెన్సులో ఓ పిల్లర్‍, గజిబిజిగా కొన్ని నిర్మాణాలు చేసి వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా చెట్ల కొమ్మలు, చెత్తచెదారమే కనిపిస్తోంది. పార్కు లోపల భాగమంతా కళావిహీనంగా తయారైంది. పార్కు లోపలున్న ప్రొఫెసర్‍ విగ్రహం ముక్కు ఊడిపోయింది. సాయంత్రమైతే చాలు మందుబాబులకు అడ్డాగా మారుతోంది. జిల్లా కేంద్రంలో నిరసనలు, ధర్నాలు చేపట్టడానికి అధికారులు ఈ పార్కును వేదికగా చేశారు. జనం పార్కు దుస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పార్కు అభివృద్ధిని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్కంపేట అభివృద్ధి అంతంతే..

ఉద్యమ గురువుగా జయశంకర్‍ అంటే వల్లమాలిన ప్రేమని చెప్పే సీఎం కేసీఆర్‍.. సార్‍ సొంత ఊరైన వరంగల్‍ రూరల్‍ జిల్లా అక్కంపేటకు రావాలని అక్కడి జనం ఎన్నోసార్లు కోరారు. అయినా ఏనాడు అది కార్యరూపం దాల్చలేదు. జయశంకర్​జయంతి సందర్భంగా 2016లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అక్కంపేటను సందర్శించారు. జయశంకర్‍ గుర్తుగా రాష్ట్రంలోనే అక్కంపేటను నంబర్‍వన్‍గా మారుస్తామని హామీ ఇచ్చారు. తీరా నాలుగేళ్లు గడిచాక చూస్తే.. దాదాపు వెయ్యి మంది ఉండే ఊరిలో ఇప్పటికి పీహెచ్‍సీ లేదు. వర్షాకాలం వచ్చిందంటే జనాలు సీజనల్‍ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త గ్రామపంచాయతీ బిల్డింగ్‍ కట్టలేదు. 40 శాతం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గాలేక మురుగునీరు రోడ్డుపైనే పారుతోంది. కుల సంఘాలకు ఇస్తామన్న కమ్యూనిటీ భవనాలు ఇవ్వలేదు. జయశంకర్‍ పేరుతో స్మారక భవనం, మ్యూజియం నిర్మిస్తామని చెప్పినా కట్టనేలేదు.

Latest Updates