ఇవాళ మళ్లీ అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డి కండీషన్‌ బెయిల్‌పై నిన్న( గురువారం) విడుదయ్యారు. నెలరోజులకు పైగా జైలులో గడిపి నిన్ననే కడప జైలు నుంచి విడుదలై ఇద్దరూ మల్లీ ఇవాళ(శుక్రవారం) అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయ్యారు. కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కాన్వాయ్ తో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకున్నారు. ర్యాలీలకు ప్రస్తుత నిబంధనలు ఒప్పుకోవని సీఐ స్పష్టం చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్టు తెలిసింది.

స్థానిక సీఐతో , జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి వీడియోల్లోనూ స్పష్టమైంది. దీంతో సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదు చేయగా… జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా, వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. ఈ రెండు కేసుల్లో తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. తర్వాత వారిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆపై వారిద్దరినీ గుత్తి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Latest Updates