స్కూల్ కి వెళ్లాలంటే రెండు విమానాలు..ఐదు రోజులు కొండలు ఎక్కాలి

మన పిల్లల్ని రెండు మూడు రోజులు విడిచిపెట్టి ఉండాలంటేనే ఉండలేం. చదువు కోసం వేరే ప్రాంతానికి పంపిస్తే.. మా అంటే ఓ ఆరు నెలలు.. సంవత్సరం చూడకుండా ఉంటాం. కానీ 12 సంవత్సరాలు పిల్లల్ని చూడకుండా ఉండాలంటే ఉండగలమా? ఏ తల్లి అయినా పిల్లలను చూడకుండా ఉంటుందా? తల్లిని చూడకుండా పిల్లలు ఉంటారా? కానీ నేపాల్  లో చదువు కోసం వెళ్లిన తమ పిల్లల రాక కోసం 12 ఏళ్లుగా నీరిక్షిస్తున్న తల్లిదండ్రులు ఎందరో.!

నేపాల్ లోని హిమాలయ పర్వత  శ్రేణుల్లో  కొన్ని గ్రామాలున్నాయి. అక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేదు. ఆ గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. ఏదైనా అవసరం ఉంటే పట్టణ ప్రాంతాలకు కొండలు దాటి వెళ్లాల్సిందే. అందుకే అక్కడి గ్రామాల్లో  కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు కోసం పట్టణ ప్రాంతాలకు పంపిస్తారు. అయితే ఆ పిల్లలు పదేళ్లయినా సొంతూరికి రారు. ఎందుకంటే రవాణా, కమ్యూనికేషన్స్ వ్యవస్థ లాంటివి  ఏమి లేవు ఆ గ్రామాలకు.

పైన ఫోటోలో కనిపిస్తున్న బాలుడి పేరు జీవన్ మహాతర. నేపాల్ రాజధాని కాట్మాండులో స్నోలాండ్ అనే స్కూల్ లో చదువుతున్నాడు. స్నోలాండ్ స్కూల్ ను ఓ స్వచ్చంధ సంస్థ నడుపుతుంది. పేద, గ్రామీణ పిల్లలకు అందులో ఫ్రీగా చదువు చెబుతారు. అందులోనే జీవన్ చదువుకుంటున్నాడు. నాలుగేళ్ల వయసులో చదువుకోవడానికి  స్నోలాండ్ స్కూల్ కు వచ్చిన జీవన్ ..12 ఏళ్ల తర్వాత మళ్లీ తన తల్లిదండ్రులను చూసేందుకు సొంతూరికి వెళ్లాడు. ఎందుకంటే స్కూల్ నుంచి తన సొంతూరికి వెళ్లాలంటే జీవన్  రెండు విమానాలు మారాలి. ఐదు రోజులు కొండలు ఎక్కాలి. అందుకే 12 సంవత్సరాలుగా తన ఊరికి వెళ్లలేకపోయాడు.

12 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లిన జీవన్ భావోద్వేగానికి లోనయ్యాడు. స్కూల్లో నాలుగు సంవత్సరాల వయసులో చేరానని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తల్లిదండ్రులతో ఎప్పుడూ మాట్లాడలేదు.. చూడలేదని అన్నాడు. ఎందుకంటే తమ ఊరికి ఎలాంటి కమ్యూనికేషన్ సదుపాయం కానీ రవాణా వ్యవస్థ లేదని చెప్పాడు.

అలా 12 సంవత్సరాల తర్వాత అమ్మానాన్నలను చూసేందుకు వెళ్లిన జీవన్ తన తల్లిని గుర్తుపట్టలేదంట. ఆమె తన అమ్మేనా? కాదా? అనిపించిందంట. తన తల్లికి వయసు మీద పడటంతో గుర్తు పట్టలేదంట. తనను చూడగానే అమ్మ ఎంతో సంతోష పడిందని..ఒక విద్యావంతుడిలా తనను చూడటంతో తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు జీవన్.12 సంవత్సరాలైనా తన ఊరు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని..ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నాడు. బాగా చదువుకుని తన ఊరిని అభివృద్ధి చేస్తానని అన్నాడు జీవన్.

Latest Updates