జెస్సికా మర్డర్​ కేసు నిందితుడు పెరోల్​పై విడుదల

17 ఏళ్ల పాటు జైలు జీవితం

న్యూఢిల్లీ: మోడల్​ జెస్సికా లాల్​ హత్య కేసులో నిందితుడు మను శర్మ పెరోల్​పై విడుదలయ్యాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జైలులో గడిపిన శర్మతో పాటు మరో 18 మంది ఖైదీలు తీహార్​ జైలు నుంచి పెరోల్​పై రిలీజ్​ అయ్యారు. జైళ్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కొంతమంది ఖైదీలను టెంపరరీగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఖైదీల విడుదలకు లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ ఆమోదముద్ర వేశారు. గతంలో శర్మను విడుదల చేయాలన్న ప్రతిపాదనను ఢిల్లీ సెంటెన్స్​ రివ్యూ బోర్డు నాలుగు సార్లు కొట్టేసింది. దీంతో శర్మ లాయర్​ హైకోర్టుకు వెళ్లారు. తన క్లైయింట్​ జైలులో మంచి ప్రవర్తనతో మెలిగినా, ఆయనను విడుదల చేయట్లేదని ఆరోపించారు. దీంతో గత నెలలో జరిగిన బోర్డు మీటింగ్​లో శర్మను విడుదల చేయాలని సభ్యులు నిర్ణయించారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్ బైజాల్​కు పంపించారు. ఆయన దీనికి ఆమోద ముద్ర వేయడంతో శర్మ జైలు నుంచి బయటికి వచ్చారు.

1999 ఏప్రిల్​ 30న ఢిల్లీలోని ఓ రెస్టారెంట్​లో జరిగిన గొడవలో మను శర్మ మోడల్​ జెస్సికా లాల్​ పై కాల్పులు జరిపాడు. పోలీసులు శర్మను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు ఏడేళ్ల విచారణ తర్వాత 2006లో శర్మను కోర్టు నేరస్థుడిగా నిర్ధారించింది. మరో నాలుగేళ్ల తర్వాత అంటే.. 2010లో శర్మకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి శర్మ జైలు జీవితం గడుపుతున్నాడు. 2018లో శర్మను క్షమిస్తున్నట్లు జెస్సికా లాల్​ సోదరి సబ్రీనా లాల్​ప్రకటించారు. శర్మను విడుదల చేస్తే తనకేమీ అభ్యంతరంలేదని చెప్పారు.

Latest Updates