జెట్‌‌ ఎయిర్‌‌వేస్ కథ ముగిసినట్టే!

భయపడ్డట్టే జరిగింది! జెట్‌‌ ఎయిర్‌‌వేస్ దివాలా కోర్టుకు వెళ్లకతప్పదన్న ఏవియేషన్‌‌ సెక్టర్‌‌ నిపుణుల అంచనాలు నిజమయ్యాయి. అప్పుల కుప్పగా మారిన జెట్‌‌లో వాటాల అమ్మకానికి ఎస్‌‌బీఐ నేతృత్వంలోని బ్యాంకు కన్సార్షియం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జెట్‌‌ను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని లెండర్లు ప్రకటించారు. దివాలా చట్టం ప్రకారం జెట్‌‌ కేసును నేషనల్‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌ (ఎన్సీఎల్టీ)కు తీసుకెళ్తామనిపేర్కొన్నారు. ‘‘జెట్‌‌ సమస్యపై చర్చించడానికి సోమవారం లెండర్ల సమావేశం నిర్వహించాం. ఐబీసీ ప్రకారం సమస్యను పరిష్కరించాలని ఎన్సీఎల్టీని కోరుతాం. ఎందుకంటే, జెట్‌‌లో వాటాల కొనుగోలుకు ఒకే కండిషనల్‌‌ బిడ్‌‌ దాఖలయింది’’ అని కన్సార్షియం చేసిన ప్రకటన పేర్కొంది. జెట్‌‌లోని మైనారిటీ వాటాదారు ఎతిహాద్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ షరతుల కూడిన బిడ్‌‌ సమర్పించింది. సంస్థ పునరుద్ధరణకు రూ.15 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.1,700 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేస్తామని తెలిపింది. మెజారిటీ వాటాలను కొనే వాళ్లను వెతుక్కోవాల్సిన బాధ్యత లెండర్లదేనని స్పష్టం చేసింది. ఓపెన్‌‌ ఆఫర్‌‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మినహాయించాలని కోరింది. ఈ షరతులకు లెండర్లు అనుమతించలేదు. అప్పుల సమస్యను ఎన్సీఎల్టీ బయటే పరిష్కరించుకోవాలని జెట్‌‌ ఎయిర్వేస్‌‌, బ్యాంకర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే, జెట్‌‌ షేర్ల విలువ సోమవారం 17 శాతం పతనమై రూ.13.75కు చేరింది. ఒక్కో షేరు ఏకంగా రూ.68.30 నష్టపోయింది. వరుసగా గత 11 రోజుల నుంచి జెట్‌‌ షేరు పడిపోతూనే ఉంది.  జెట్‌‌ దివాలా ప్రక్రియను మొదలుపెట్టాలంటూ దీనికి అప్పులిచ్చిన షమన్‌‌ వీల్స్‌‌, గగ్గర్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌లు ఇది వరకే నేషనల్‌‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌‌ (ఎన్సీఎల్టీ)లో కేసు వేశాయి. ఈ పిటిషన్​ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.

బ్యాంకులకు రూ.8,400 కోట్లు కట్టాలి…

రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌ 17 నుంచి జెట్‌‌ను మూసివేశారు. వందల మంది ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. విమానాలు కూడా ఒక్కొక్కటిగా డి-రిజిస్టర్‌‌ అవుతున్నాయి. ఫలితంగా జెట్‌‌ భవిష్యత్‌‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. జెట్‌‌ బ్యాంకులకు రూ.8,400 కోట్ల వరకు చెల్లించాలి. మొత్తం అప్పులు రూ.25 వేల కోట్ల వరకు ఉన్నాయి. తమ బకాయిలను రాబట్టుకోవడానికి బ్యాంకులు జెట్‌‌ వాటాలను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌‌ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌‌, ఇండిగో పార్టనర్స్‌‌, నేషనల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఫండ్‌‌ (ఎన్‌‌ఐఐఎఫ్‌‌), ఎతిహాద్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఆసక్తిని వ్యక్తీకరించడంతో బిడ్స్‌‌ వేసేందుకు అనుమతించారు.  వీటితోపాటు లండన్‌‌కు చెందిన అడిగ్రూప్‌‌, జెట్‌‌ మాజీ ఉద్యోగుల సంఘం, బ్రిటిష్‌‌ వ్యాపారి జేసన్‌‌ అన్‌‌స్వర్త్‌‌ జెట్‌‌లో వాటాలు కొనడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం జెట్‌‌లో 24 శాతం వాటా ఉన్న ఎతిహాద్‌‌కు అవకాశం దక్కవచ్చని భావించినా, ఇది పరిమిత వాటా కొనుగోలుకే ముందుకు వచ్చింది. ఇందుకు పలు షరతులూ విధించింది. హిందుజాతో కలిసి కంపెనీని పునరుద్ధరించాలని ఒకదశలో ఎతిహాద్‌‌ భావించినా, ఇందుకోసం లాంఛనంగా ప్లాన్‌‌ను మాత్రం సమర్పించలేదు. ఇదిలా ఉంటే, జెట్‌‌ నిధులను విదేశాలకు అక్రమంగా మళ్లించినట్టు నమోదైన కేసులో విచారణ రావాలని  ఐటీశాఖ దీని ప్రమోటర్‌‌ నరేశ్‌‌ గోయల్‌‌కు సమన్లు జారీ చేసింది. విదేశాలకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలను పాటించనందుకు, ఫ్యూచర్స్ అండ్‌‌ ఆప్షన్‌‌ (ఎఫ్ అండ్‌‌ ఓ) నుంచి జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ షేరును ఈ నెల 28 నుంచి తొలగిస్తున్నట్టు రెండు ప్రధాన స్టాక్‌‌ ఎక్స్చేంజీలు ఎన్‌‌ఎస్‌‌ఈ, బీఎస్‌‌ఈలు ప్రకటించాయి.

Latest Updates